
– సిట్టింగ్ రూములు లేవని నిరసన
శ్రీకాళహస్తి: మందు తాగడానికి సరైన సిట్టింగ్ రూములు లేవంటూ ఓ మందుబాబు నడిరోడ్డుపై మద్యం సేవిస్తూ హల్‌చల్ చేసిన ఘటన శ్రీకాళహస్తి ఆర్టీసీ బ స్టాండ్ సర్కిల్‌లో శుక్రవారం చోటు చేసుకుంది.
కూట మి ప్రభుత్వం వచ్చాక మద్యం షాపుల యజమానులు కుమ్మక్కై పర్మిట్ రూమ్‌లను ఏర్పాటు చేసి, తినుబండారాలు, ఇతర వస్తువుల రేట్లు ఇబ్బడిముబ్బడిగా పెంచేశారని, వీటన్నింటినీ కట్టడి చేయకుంటే మళ్లీ పుల్ బాటిల్‌తో స్థానికంగానే తాగుతూ నిరసన వ్యక్తం చేస్తానని సదరు మందుబాబు చెప్పడం గమనార్హం. ఇంత జరుగుతున్నా సంబంధిత పోలీసు అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
అటువైపు వెళ్లే ప్రయాణికులు ఔరా..? అంటూ ముక్కున వేలేసుకోవడం కనిపించింది. దీనిపై రెండవ పట్టణ సీఐ నాగార్జునరెడ్డిని వివరణ కోరగా అతనిపై కేసు నమోదు చేశామని, మత్తులో ఉండడం వల్ల అతనిపై పబ్లిక్ న్యూసెన్స్, ఓపెన్ బూజింగ్ కేసులు నమోదు చేశామన్నారు. మత్తు దిగిన తరువాత కౌన్సెలింగ్ ఇచ్చి కోర్టులో హాజరు పరుస్తామన్నారు.