అనుమతి లేకుండా విద్యుత్ కొన్న పంపిణీ సంస్థలు
యూనిట్ ధర రూ.5.22కు అనుమతించాలని ప్రతిపాదించిన డిస్కంలు
అనధికార కొనుగోళ్లు జరిగినట్టు గుర్తించిన విద్యుత్ నియంత్రణ మండలి
2024–25కి విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్ రూ.5.17గా ఖరారు
సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి అనుమతి లేకుండా కరెంటు కొంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) గుర్తించింది. అలా కొన్న విద్యుత్‌కు ధరను ఖరారు చేయడానికి కమిషన్ నిరాకరించింది. అనుమతితో చేసిన కొనుగోళ్లకు సంబంధించి 2024–25 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని యూనిట్‌కు రూ.5.17గా ఖరారు చేసింది. ఇదే ధర 2025–26 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుందని గురువారం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది.
ఆలస్యంగా పిటిషన్లు
ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు ఏపీఈఆర్‌సీకి ఆరు నెలలు ఆలస్యంగా పిటిషన్లు దాఖలు చేశాయి. అలాగే డిస్కంలు యూనిట్ ధర రూ.5.22గా ప్రతిపాదించగా.. కమిషన్ రూ.5.17కు తగ్గించింది. దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోళ్ల ఆధారంగా ఈ ధరను లెక్కించింది. అనుమతి లేని కొన్ని విద్యుత్ కేంద్రాల నుంచి డిస్కంలు చేసిన కొనుగోళ్లను కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదు.
అలాగే పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్లను కూడా లెక్కించలేదు. ఇక తాత్కాలికంగా చెల్లించిన ధర, తుది ధర మధ్య తేడాను వచ్చే నెల నుంచి మూడు సమాన నెలవారీ వాయిదాల్లో సర్దుబాటు చేయాలని డిస్కంలను ఏపీఈఆర్‌సీ ఆదేశించింది. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పిటిషన్లను ఈ ఏడాది సెపె్టంబర్ 30లోపు తప్పనిసరిగా దాఖలు చేయాలని సూచించింది.
ఒక్కరు కూడా అభ్యంతరం చెప్పలేదేంటో
ఏపీఈఆర్‌సీ 2022లో ప్రవేశపెట్టిన పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు బాధ్యత నియమావళి ప్రకారం.. ఏటా డిస్కంలు విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని కమిషన్‌కు సమర్పించాలి. దీనిలో భాగంగా ఏపీ ఈపీడీసీఎల్ ఫిబ్రవరి 26, సీపీడీసీఎల్ మార్చి 9, ఎస్పీడీసీఎల్ మార్చి 10న పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై మార్చి 16న బహిరంగ ప్రకటన జారీ చేసిన కమిషన్ ఏప్రిల్ 6 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలు కోరింది. కానీ చిత్రంగా ఒక్కరి నుంచి కూడా ఎటువంటి అభ్యంతరాలు లేదా సూచనలు రాలేదు.
ఏప్రిల్ 22న కర్నూలులో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఎలాంటిæ అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. దీంతో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగానే కమిషన్ తుది నిర్ణయం తీసుకుంది. మూడు డిస్కంల సమాచారాన్ని కలిపి ఒకే ధరను ఖరారు చేసింది. ఇలా ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం చాలా అరుదు. కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించకపోవడమే దీనికి ప్రధాన కారణం.


