డిస్టెన్స్, ఆన్‌లైన్‌లో హెల్త్‌కేర్, అనుబంధ కోర్సుల నిలిపివేత | Distance and online healthcare and supplementary courses suspended | Sakshi
Sakshi News home page

డిస్టెన్స్, ఆన్‌లైన్‌లో హెల్త్‌కేర్, అనుబంధ కోర్సుల నిలిపివేత

Aug 18 2025 6:13 AM | Updated on Aug 18 2025 6:13 AM

Distance and online healthcare and supplementary courses suspended

ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు  

ఉన్నత విద్యాసంస్థలకు ఆదేశాలిచ్చిన యూజీసీ  

పలు కోర్సులపై ప్రభావం  

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో హెల్త్‌కేర్, అనుబంధ ప్రోగ్సామ్స్‌ను ఓపెన్‌ అండ్‌ డిస్టెన్స్‌ లెరి్నంగ్‌ (ఓఎల్‌డీ), ఆన్‌లైన్‌ మోడ్‌లో అందించడాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నిషేధించింది. ఈ విద్యా సంవత్సరం (2025–26) నుంచే ఈ నిషేధం అమలులోకి వస్తుందని ప్రకటించింది. సైకాలజీ, మైక్రోబయాలజీ, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ సైన్స్, బయోటెక్నాలజీ, క్లినికల్‌ న్యూట్రిషన్, డైటెటిక్స్‌ వంటి ప్రత్యేక కోర్సులను ఇకపై ఓఎల్‌డీ, ఆన్‌లైన్‌లో అందించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

ఈ కోర్సుల్ని ఓఎల్‌డీ, ఆన్‌లైన్‌లో అందించేందుకు ఆయా సంస్థలకు ఇచ్చిన గుర్తింపులను వెంటనే రద్దుచేస్తున్నట్టు ప్రకటించింది. ఇకపై విద్యార్థులకు ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించవద్దని ఆదేశాలు జారీచేసింది. 

అనుమతులు లేని ప్రోగ్సామ్స్‌కు అడ్డుకట్ట  
యూజీసీ నిర్ణయంతో మల్టీ స్పెషలైజేషన్‌ డిగ్రీల్లో హెల్త్‌కేర్‌కు సంబంధించిన భాగాలు మాత్రమే ప్రభావితం కానున్నాయి. ఉదాహరణకు సైకాలజీతో సహా బహుళ మేజర్‌లతో కూడిన బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో ఓఎల్‌డీ, ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్స్‌ నుంచి సైకాలజీ స్ట్రీమ్‌ను మాత్రమే తొలగిస్తోంది. గతంలో ప్రకటించిన ఉమ్మడి, ద్వంద్వ–డిగ్రీ ఫ్రేమ్‌వర్క్‌ల కింద యూజీసీ ఆమోదం లేకుండా దేశీయ విద్యాసంస్థల భాగస్వామ్యాల్లోకి ప్రవేశించే సంస్థలు వాటి ప్రోగ్రామ్‌లను గుర్తింపులేనివిగా పరిగణించాలని సూచించింది.

ఈ మార్గదర్శకాలున్నప్పటికీ అనేక కళాశాలలు, ఎడ్యుటెక్‌ ప్లాట్‌ఫామ్‌లు యూజీసీ గుర్తింపు లేని భాగస్వామ్యాలతో ఆన్‌లైన్‌/ఉమ్మడి కార్యక్రమాలను అందిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు యూజీసీ తెలిపింది.వీటికి అడ్డుకట్ట వేయడంతోపాటు నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ అలైడ్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొఫెషన్స్‌ చట్టం–2021 కింద ఉన్న హెల్త్‌కేర్‌ కోర్సులపై ఈ నిషేధం విధించింది.    

విద్య ప్రమాణాల్లో నాణ్యత లోపం  
హెల్త్‌కేర్‌ కోర్సులను అందించడంలో ప్రొఫెషనల్‌ శిక్షణలో నాణ్యత ప్రమాణాలపై ఆందోళనలు వ్యక్తంకావడంతోనే యూజీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇటీవలి కాలంలో సైకాలజీ కోర్సులకు డిమాండ్‌ పెరిగింది. దీనివల్ల అనేక ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు ఈ కోర్సును అందిస్తున్నాయి. కానీ దేశంలోని అనేక ప్రాంతాలలో విద్య నాణ్యతను కొనసాగించడంలో విఫలమైనట్టు యూజీసీ గుర్తించడంతో ఈ నిషేధం అమలు చేస్తున్నట్టు చెబుతున్నారు. వాస్తవానికి క్లినికల్‌ సైకాలజీకి కఠినమైన ఆచరణాత్మక శిక్షణ (ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌) అవసరం.

దీనికోసం 2:1 విద్యారి్థ–ఉపాధ్యాయ నిష్పత్తి అవసరం. దూరవిద్య విధానంలో ఇటువంటి శిక్షణ సాధ్యం కాదు. ఈ క్రమంలో నాణ్యత లేని డిగ్రీలు, డిప్లొమాలు జారీచేయడాన్ని కట్టడి చేసేందుకు యూజీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యావేత్తలు చెబుతున్నారు. అయితే.. ఈ కోర్సుల్లో దేశవ్యాప్తంగా పరిమిత సీట్లు అందుబాటులో ఉండటం వల్ల ఎదురయ్యే సవాళ్లను కూడా యూజీసీ పరిష్కరించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement