ప్రమాణాలు ప్రధానం.. పేదల ఇళ్లు పటిష్టం

Department Of Housing Agreement With IIT Tirupati - Sakshi

సాక్షి, అమరావతి: పేదలకు నిర్మించే ఇళ్లు మరింత పటిష్టంగా ఉండటంపై ప్రభుత్వం దృష్టి సారించింది. నాణ్యత ప్రమాణాలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇంజినీర్లకు శిక్షణ ప్రారంభించింది. పేదలకు నాలుగేళ్లలో 30 లక్షల ఇళ్లు నిర్మించాలని గృహనిర్మాణశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. దీన్లో భాగంగా మొదటి విడత 15 లక్షల ఇళ్లు నిర్మించనున్నారు. ఇళ్ల నిర్మాణాలు దేశానికే ఆదర్శంగా ఉండేలా నాణ్యత ప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే అధికారుల్ని ఆదేశించారు. దీంతో తమశాఖ ఇంజినీర్లకు ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు గృహనిర్మాణశాఖ తిరుపతి ఐఐటీతో ఒప్పందం కుదుర్చుకుంది. వివిధ స్థాయిలకు చెందిన 1,100 మంది ఇంజినీర్లకు బృందాలుగా నాలుగురోజులు ఆన్‌లైన్‌లో ఇచ్చే శిక్షణ కార్యక్రమాలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లాల్లో గృహనిర్మాణశాఖ కార్యాలయాల్లో హాజరైన ఇంజినీర్లకు తిరుపతి ఐఐటీ నుంచి ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా తిరుపతి ఐఐటీ డైరెక్టర్‌ కేఎస్‌ సత్యనారాయణ మాట్లాడుతూ సివిల్, పర్యావరణ విభాగానికి చెందిన సీనియర్‌ ప్రొఫెసర్లతో శిక్షణ ఇస్తామని చెప్పారు. గృహనిర్మాణశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్, గృహనిర్మాణసంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నవీన్‌కుమార్‌ మాట్లాడారు. వారు ఏమన్నారంటే..

పేదలందరికీ ఇళ్లు నిర్మించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు.
ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. ఈ శిక్షణ నిరంతరం కొనసాగుతుంది.
నిర్మాణంలో ఇనుము, సిమెంట్, ఇతర ముడిపదార్థాలు నాణ్యమైనవి సరఫరా చేస్తాం.
కాలుష్య రహితంగా, పూర్తి భద్రత ప్రమాణాలతో ఇళ్లు నిర్మించేలా ఇంజినీర్లు చొరవ చూపాలి.
ఇంజనీర్ల బృందాలను తిరుపతి ఐఐటీ ప్రాంగణానికి పంపిస్తాం. అక్కడి ల్యాబ్‌లు తదితరాలు పరిశీలించి మరింత అవగాహన పెంచుకోవచ్చు.
గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లకు కూడా శిక్షణ ఇస్తాం.
గృహనిర్మాణసంస్థ చీఫ్‌ ఇంజనీర్‌ సీహెచ్‌ మల్లికార్జునరావు కూడా పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top