సాక్షిపై సర్కారు కుట్ర భగ్నం | Delhi High Court Gives Big Shock to TDP Govt | Sakshi
Sakshi News home page

సాక్షిపై సర్కారు కుట్ర భగ్నం

Jul 15 2025 4:12 AM | Updated on Jul 15 2025 8:48 AM

Delhi High Court Gives Big Shock to TDP Govt

విజిలెన్స్‌ నివేదికతో ఇబ్బంది పెడదామనుకున్న కూటమికి చెంపపెట్టు 

ఆ నివేదికను నిర్ద్వందంగా తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు

ఈనాడు పిటిషన్‌ను ముగిస్తూ ఉత్తర్వులు

వలంటీర్లకు దినపత్రిక విషయంలో విజిలెన్స్‌ విచారణ జరిపించామని, ఆ నివేదికను పరిశీలించాలని ఢిల్లీ హైకోర్టును కోరిన కూటమి ప్రభుత్వం 

విజిలెన్స్‌ విచారణ చేయాలని మేం ఆదేశించలేదుగా? 

అలాంటప్పుడు ఆ నివేదికతో మాకేం పని? 

మా భుజంపై తుపాకీ పెట్టి కాల్చడాన్ని మేం అనుమతించబోం.. ఈనాడు వ్యాజ్యంలో విచారించేందుకు ఏమీ లేదు 

ఈనాడుకు ఏమైనా అభ్యంతరాలుంటే సీఎస్‌ వద్దకు వెళ్లాలి.. సీఎస్‌ ఏం చేసినా చట్టప్రకారం చేయాలన్న ఢిల్లీ హైకోర్టు 

ఈనాడు వాదనలను ఆదిలోనే తిరస్కరించిన ఏపీ హైకోర్టు 

దీంతో సుప్రీంకోర్టుకు... పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టుకు బదలాయించిన సుప్రీం 

ఏదైనా ఒక దినపత్రిక కొనుక్కునేందుకు వలంటీర్లకు గత ప్రభుత్వం వెసులుబాటు 

అందుకోసం నెలకు రూ.200 మేర ఆర్థిక సాయం.. దానిపై ఈనాడు, కూటమి యాగీ

సాక్షి, అమరావతి: విజిలెన్స్‌ నివేదిక పేరుతో తన ఆస్థాన పచ్చ పత్రిక ‘ఈనాడు’ కోసం ‘సాక్షి’ని ఇబ్బందిపెట్టేందుకు కూటమి ప్రభుత్వం పన్నిన కుట్రను ఢిల్లీ హైకోర్టు భగ్నం చేసింది. విస్తృత సర్క్యులేషన్‌ ఉన్న ఏదైనా ఒక దినపత్రికను కొనుగోలు చేసుకునేందుకు ప్రతి గ్రామ, వార్డు వలంటీర్, గ్రామ, వార్డు సచివాలయాలకు నెలకు రూ.200 మేర ఆర్థిక సాయాన్ని అందజేస్తూ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విజిలెన్స్‌తో విచారణ జరిపించామని, ఇందుకు సంబంధించిన నివేదికను పరిశీలించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను హైకోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది.

‘మా భుజంపై తుపాకీ పెట్టి కాల్చాలనుకుంటున్నారు. అందుకు మేం ఎంతమాత్రం అనుమతించబోం’ అని స్పష్టం చేసింది. తాము ఆదేశించకపోయినా విజిలెన్స్‌ విచారణ జరిపించడంపై హైకోర్టు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తామేమీ విజిలెన్స్‌ విచారణ కోరలేదని గుర్తు చేస్తూ... అలాంటప్పుడు దాని నివేదికతో తమకు పని లేదని తేల్చి చెప్పింది. ఆ నివేదిక విషయంలో ఏ రకంగానూ స్పందించబోమని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో తాము ఆదేశాలు జారీ చేసేందుకు ఏమీ లేదని తెలిపింది. ఈనాడు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ముగిస్తు్తన్నట్లు పేర్కొంది.

ప్రస్తుతం వలంటీర్ల వ్యవస్థ లేదని గుర్తు చేసిన ఢిల్లీ హైకోర్టు, ఇంకా ఏవైనా అభ్యంతరాలుంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) వద్దకు వెళ్లాలని ఈనాడు యజమాన్యానికి తేల్చి చెప్పింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏం చేసినా చట్ట ప్రకారం చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ దేవేంద్రకుమార్‌ ఉపాధ్యాయ, న్యాయమూర్తి జస్టిస్‌ తుషార్‌కుమార్‌ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.  

ఏదైనా ఒక తెలుగు దిన పత్రిక కొనుగోలుకు గ్రామ, వార్డు వలంటీర్, గ్రామ, వార్డు సచివాలయాలకు నెలకు రూ.200 మేర ఆర్థిక సాయం అందజేస్తూ గత ప్రభుత్వం 2023లో ఉత్తర్వులు జారీ చేసింది. వీటిపై ఈనాడు యాజమాన్యం మొదట ఏపీ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల అమలును నిలిపివేయాలని కోరుతూ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసింది. అలాగే వాలంటీర్లు, సచివాలయాలు చేసే సాక్షి పత్రిక కొనుగోళ్లను పరిగణనలోకి తీసుకోకుండా ఆడిట్‌ బ్యూరో సర్క్యులేషన్‌ (ఏబీసీ)ను ఆదేశించాలని కోరుతూ మరో అనుబంధ పిటిషన్‌ కూడా వేసింది. ఈ రెండు అనుబంధ పిటిషన్లపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ధర్మాసనం వాటిని కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చింది.  

ఏపీ హైకోర్టులో చుక్కెదురుతో సుప్రీంకు
ఏపీ హైకోర్టులో చుక్కెదురవడంతో ఈనాడు యాజమాన్యం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టులో ఈనాడు వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ 2023 ఏప్రిల్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఢిల్లీ హైకోర్టు విచారణ మొదలుపెట్టింది. సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది.

ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది అనురాగ్‌ అహ్లువాలియా వాదిస్తూ.. గ్రామ, వార్డు వలంటీర్, గ్రామ, వార్డు సచివాలయాలకు ఏదైనా ఒక దినపత్రిక కొనుగోలుకు నెలకు రూ.200 ఆర్థిక సాయంపై విజిలెన్స్‌ విభాగం విచారణ జరిపి నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమరి్పంచిందని తెలిపారు. దానిని పరిశీలించాలని కోరారు. కానీ, ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. తమ ఆదేశాల మేరకు విజిలెన్స్‌ విచారణ జరగలేదని.. అలాంటప్పుడు దాని నివేదికతో పని లేదంది.  

విచారించేందుకు ఏమీ లేదు.. 
జగతి పబ్లికేషన్స్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది నంద్రాజోగ్, రాజశేఖరరావు స్పందిస్తూ మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ వ్యాజ్యంలో తేల్చేందుకు ఏమీ లేదని తెలిపారు. పిటిషన్‌ నిరర్ధకమైందన్నారు. అహ్లువాలియా మాత్రం.. తమ వ్యాజ్యంలో విచారించాల్సింది ఇంకా ఉందన్నారు. వలంటీర్లు, సచివాలయాలు చేసిన సాక్షి దిన పత్రిక కొనుగోళ్లను పరిగణనలోకి తీసుకోకుండా ఆడిట్‌ బ్యూరో సర్క్యులేషన్‌ (ఏబీసీ)ను ఆదేశించాలని కోరామని, దానిపై విచారణ జరపాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఈ వ్యాజ్యంలో విచారించేందుకు ఏమీ లేదని తేల్చి చెప్పింది.  

ఏపీ హైకోర్టు ఏం చెప్పిందంటే..
నిర్దిష్టంగా ఫలానా పత్రికను మాత్రమే కొనాలంటూ గ్రామ, వార్డు వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాలను ప్రభుత్వం ఆదేశిస్తున్నట్లు ఎలాంటి ఉత్తర్వులు లేవని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వం విడుదల చేసే నిధులతో వాలంటీర్లు, సచివాలయాలు ఓ పత్రికను కొనుగోలు చేసినంత మాత్రాన సర్క్యులేషన్‌ గణాంకాలను విడుదల చేయకుండా ఏబీసీని ఏ రకంగానూ నిరోధించలేమని స్పష్టం చేసింది.

కూటమి ప్రభుత్వానిదే అసలు వివక్ష
ఏడాదికి పైగా సాక్షికి ప్రకటనలు ఇవ్వకుండా కుతంత్రం 
ఇప్పటికే దీనిపై కోర్టును ఆశ్రయించిన సాక్షి 
 సాక్షి, ఈనాడును ఒకేలా చూసిన గత ప్రభుత్వం

వాస్తవానికి ప్రభుత్వ ప్రకటనల విషయంలో గత ప్రభుత్వం ‘సాక్షి’, ఈనాడును ఒకేలా చూసింది. ఎలాంటి వివక్ష లేకుండా రెండు పత్రికలకు సమానంగా ప్రకటనలు ఇచ్చింది. కానీ, చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మాత్రం  ‘సాక్షి’ పట్ల వివక్ష చూపుతూ వస్తోంది. ఏడాదికి పైగా ‘సాక్షి’కి ఒక్క ప్రభుత్వ ప్రకటన కూడా ఇవ్వలేదు. ఈనాడుకు అడ్డదిడ్డంగా ప్రకటనలు కట్టబెడుతోంది.

చివరకు మూడో స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి కూడా ఎక్కువగా ప్రకటనలు ఇస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ ‘సాక్షి’ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారం హైకోర్టు ముందు పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వం తన వివక్షకు న్యాయస్థానం వేదికగా సమాధానం చెప్పి తీరాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు అంటున్నారు.  

ఈనాడుకు ఎంత పెరిగిందో ‘సాక్షి’కీ అంతే పెరిగింది.. 
ఏబీసీ గణాంకాలను పరిశీలిస్తే... ఆ సమయంలో ఈనాడు సర్క్యులేషన్‌ ఎంత పెరిగిందో.. సాక్షి సర్క్యులేషన్‌ కూడా అంతే పెరిగింది.. గ్రామ, వార్డు వాలంటీర్, గ్రామ, వార్డు సచివాలయాలకు నెలకు రూ.200 మేర ఆర్థిక సాయం అందజేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల వల్ల సాక్షి దినపత్రిక అదనంగా లబ్ధి పొందింది ఏమీ లేదు.  కానీ, సాక్షికి ఏదో లబ్ధి జరిగిపోతోందంటూ ఈనాడు రాద్ధాంతం చేసింది. సర్క్యులేషన్‌ గణాంకాలను విడుదల చేయకుండా ఏబీసీని నిరోధించాలని ప్రయత్నించి బొక్కబోర్లా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement