నిర్వహణ భారంగా కృష్ణపట్నంలోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం
2,400 మెగావాట్ల సామర్థ్యం ఉన్నా రూ.7,500 కోట్ల నష్టాలు
బూడిదను తరలించడానికే ఏటా రూ.14.56 కోట్ల ఖర్చు
ఏపీ విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించిన నివేదికలో బయటపడ్డ వాస్తవాలు
రూ.302.04 కోట్ల ట్రూ–అప్ కోరిన ఏపీ పవర్ డెవలప్‌మెంట్ కంపెనీ
పరిశీలన తర్వాత రూ.236.20 కోట్లకు అనుమతించిన ఏపీఈఆర్‌సీ
మిగిలిన మొత్తాన్ని ప్రజల నుంచి చార్జీల రూపంలో వసూలు చేసి చెల్లించనున్న డిస్కంలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్ వ్యవస్థలో కీలకమైన శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్‌డీఎస్‌టీపీఎస్) ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 2,400 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్‌కు సుమారు రూ.7,500 కోట్ల మేర పేరుకుపోయిన బకాయిలు, నష్టాలు ఉన్నట్టు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి సమర్పించిన నివేదికలో వెల్లడైంది. మరమ్మతులు, నిర్వహణకు కేటాయించే నిధులు కూడా తగ్గుతున్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ కేంద్రాన్ని నిర్వహించే ఏపీ పవర్ డెవలప్‌మెంట్ కంపెనీ (ఏపీపీడీసీఎల్) బొగ్గు, విద్యుత్ ఉత్పత్తి, బూడిద రవాణా, వేతన సవరణల పేరుతో రూ.302.04 కోట్ల ట్రూ అప్‌కు అనుమతించాల్సిందిగా ఏపీఈఆర్‌సీని కోరింది. ఇందులో ఏపీఈఆర్‌సీ రూ.236.20 కోట్లకు అనుమతించింది. అంటే క్లెయిమ్ చేసిన మొత్తంలో రూ.65.84 కోట్లను తిరస్కరించింది. ఈ మొత్తాన్ని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రజల నుంచి చార్జీల రూపంలో వసూలు చేసి ఏపీపీడీసీఎల్‌కు చెల్లించాల్సి ఉంటుంది.
వేతన క్లెయిమ్‌కు చుక్కెదురు..
వేతన సవరణ పేరుతో ఏపీపీడీసీఎల్ రూ.46.98 కోట్లు కోరింది. కానీ రూ.1,523.98 కోట్ల ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్‌ఎం) వ్యయానికి అనుమతి ఉండగా.. వాస్తవ ఖర్చు రూ.972.03 కోట్లు మాత్రమే జరిగింది. అంటే రూ.551.95 కోట్లు ఖర్చు కాలేదు. దీంతో రూ.46.98 కోట్లు అదనంగా అవసరం లేదని ఏపీఈఆర్‌సీ తేల్చి చెప్పింది. అయితే ప్లాంట్ పనితీరును మెరుగుపరిచేందుకు 2024–25 వేతన సవరణలోని రూ.16.28 కోట్లను ప్రత్యేక కేసుగా ఆమోదించింది. ఆ మొత్తాన్ని 2026–27లో అదనంగా మరమ్మతులు, నిర్వహణ పనులకే ఖర్చు చేయాలని ఆదేశించింది.
ఉద్యోగుల తప్పనిసరి ఖర్చుల తర్వాత మరమ్మతులు, నిర్వహణకు తక్కువ నిధులు కేటాయిస్తున్నారని, దీంతో ప్లాంట్ పనితీరు మరింత దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మొత్తంగా రూ.వేల కోట్ల నష్టాలు, పెరుగుతున్న ఇంధన వ్యయం, తక్కువ ప్లాంట్ అందుబాటు, నిర్వహణకు తగ్గుతున్న నిధులు.. ఇవన్నీ ఎస్‌డీఎస్‌టీపీఎస్ ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. రాష్ట్ర విద్యుత్ భద్రతకు కీలకమైన ఈ ప్లాంట్ పనితీరు మెరుగుపడకపోతే భవిష్యత్తులో ఆర్థిక భారం మరింత పెరగడంతో పాటు విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఇంధన రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బొగ్గు ఖర్చే పెద్ద భారం..
ప్లాంట్ ఖర్చులు పెరగడానికి బొగ్గు ధరలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. దేశీయ బొగ్గు ధర టన్నుకు రూ.4,700 నుంచి రూ.5,308కు పెరిగింది. 2024–25లో ప్లాంట్ ఇంధన వినియోగంలో సుమారు 24 శాతం ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ బొగ్గు, దిగుమతి బొగ్గు కలిపి వాడారు. 2024–25లో స్టేజ్–2 వేరియబుల్ కాస్ట్ యూనిట్‌కు రూ.3.20గా అనుమతించగా, వాస్తవ ఇంధన ధరల సర్దుబాటు (ఫ్యూయల్ కాస్ట్ అడ్జస్ట్‌మెంట్–ఎఫ్‌సీఏ) లెక్కల్లో అది రూ.3.41కు చేరింది. దీంతో ఒక్క ఏడాదికే స్టేజ్–2కు రూ.104.76 కోట్ల ట్రూ–అప్ అనుమతించాల్సి వచి్చంది. ఇక బూడిదను తరలించడానికే 2024–25లో రూ.14.56 కోట్లు ఖర్చయ్యాయి. అయితే బూడిద అమ్మకం ద్వారా రూ.10.17 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ ఆదాయాన్ని తీసివేసిన తర్వాత రూ.4.40 కోట్లను వసూలు చేసుకోవడానికి ఏపీఈఆర్‌సీ అనుమతించింది.


