వాయుగుండంగా బలహీనపడిన జవాద్‌

Cyclone Jawad Was weakened Will no longer have an impact on AP - Sakshi

ఇక రాష్ట్రంపై ప్రభావం ఉండదు

పదిరోజులు పొడి వాతావరణం 

8, 9 తేదీల్లో రాయలసీమలో ఒకటిరెండు చోట్ల వర్షాలు

పెరగనున్న చలి తీవ్రత

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు)/మహారాణిపేట(విశాఖ దక్షిణ): బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్‌ తుపాను ఆదివారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడింది. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో పూరి తీరం వైపు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇది విశాఖపట్నానికి తూర్పు ఈశాన్యంగా 370 కిలోమీటర్లు, ఒడిశాలోని పూరికి 50, గోపాల్‌పూర్‌కు 130, పారదీప్‌కు 100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి పశ్చిమ బెంగాల్‌ వైపు వెళుతుందని వాతావరణశాఖ తెలిపింది.

ఆ తరువాత 24 గంటల్లో పూరి సమీపంలో తీరం దాటుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు మినహా రాష్ట్రమంతా పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. రాష్ట్రంపై ఇక జవాద్‌ ప్రభావం ఉండదని పేర్కొంది. వచ్చే పదిరోజులు రాష్ట్రంలో సాధారణ వాతావరణమే ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈశాన్య గాలుల ప్రభావంతో ఈ నెల 8, 9 తేదీల్లో రాయలసీమలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వానలు కురిసే సూచనలున్నాయని చెప్పారు. చలి తీవ్రత పెరగనుందని, రాత్రి సమయంలో శీతల గాలుల ప్రభావం ఉంటుందని వెల్లడించారు.
కూలిన ఆర్కే బీచ్‌ వద్ద చిల్డ్రన్‌ పార్కు గోడ  

140 బోట్లు, మత్స్యకారులు సురక్షితం
తుపాను బలహీనపడటంతో అధికారులు, మత్స్యకారులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 140 మరబోట్లు పారదీప్, గంజాంలో చిక్కుకుపోవడంతో మత్స్యకారుల్లో తీవ్రమైన ఆందోళన నెలకొంది. కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి, మత్స్యశాఖ కమిషనర్‌ కన్నబాబు తదితరులు ఒడిశా అధికారులు, పోర్టు అధికారులను సంప్రదించారు. దీంతో 140 బోట్లకు పారదీప్, గంజాంలలో ఆశ్రయం కల్పించారని మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మణరావు తెలిపారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని మత్స్యకారులకు అందించి మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు ఎంతో సహకారం అందించారని విశాఖ డాల్ఫిన్‌ బోటు సంఘం అధ్యక్షుడు చోడిపల్లి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. మరోవైపు ఆదివారం అర్ధరాత్రి ఎగసిపడిన అలలతో సముద్రం దూసుకొచ్చింది. అలల దాటికి విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌ వద్ద చిల్డ్రన్స్‌ పార్కు గోడ కూలిపోయింది. దీంతో సుమారు రూ.1.5 కోట్ల నష్టం వాటిల్లిందని జీవీఎంసీ అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఆర్కే బీచ్‌ నుంచి గోకుల్‌ పార్క్‌ వరకు ప్రవేశాన్ని నిషేధించారు.

200 ఏళ్లలో ఇలా సాగిన తుపాను లేదు
జవాద్‌ తుపాను ప్రయాణం భిన్నంగా సాగింది. దక్షిణ చైనా సముద్రంలో మొదలైన దీని ప్రయాణం.. పశ్చిమ బెంగాల్‌ వైపు సుదీర్ఘంగా సాగింది. పైగా సముద్రంలోనే పూర్తిగా బలహీనపడుతోంది. ఇలా సుదీర్ఘ ప్రయాణం చేసి.. తీరం దాటకుండానే బలహీనపడిన తుపాను గడిచిన 200 ఏళ్లలో లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top