సింపుల్‌గా కోట్లు కొట్టేస్తున్నారు.. టాప్‌లో మహారాష్ట్ర | Sakshi
Sakshi News home page

సింపుల్‌గా కోట్లు కొట్టేస్తున్నారు.. టాప్‌లో మహారాష్ట్ర

Published Thu, Apr 20 2023 5:05 AM

Cyber crimes are recorded high in India  - Sakshi

సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని వణికిస్తున్న సైబర్‌ నేరాలు భారత దేశంలోనూ లెక్కకు మిక్కిలిగా నమోదవుతున్నాయి. చిరు ఉద్యోగుల నుంచి బడా పారిశ్రామికవేత్తల వరకు ఎవరినీ సైబర్‌ నేరగాళ్లు వదలడంలేదు. కంప్యూటర్, ఫోన్లతోనే సింపుల్‌గా పని కానిచ్చేస్తూ ఏటా వందల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. ఇలా గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా సైబర్‌ మోసగాళ్లు రూ.731.27 కోట్లు దోచేశారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మూడేళ్లలో 2.13 లక్షల సైబర్‌ మోసాలు జరిగినట్లు తెలిపింది. ఏటీఎం, డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, మొబైల్‌ అప్లికేషన్, బ్యాంక్‌ సర్వర్‌ నుంచి కస్టమర్ల సమాచారాన్ని హ్యాకింగ్‌ చేయడం ద్వారా సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఈ మోసాలను అరికట్టడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రజ­లను హెచ్చరిస్తూ అప్రమత్తం చేస్తోందని, డిజిటల్‌ చెల్లింపు భద్రతా నిబంధనలను అమలు చేయాలని  బ్యాంకులకు సూచించినట్లు పేర్కొంది.

డిజి­టల్‌ చెల్లింపుల వ్యవస్థల సైబర్‌ భద్రతను మెరుగుపరిచేందుకు, సైబర్‌ మో­సాల నిరోధం, కంప్యూటర్‌ భద్రతపై జాతీయ నోడల్‌ ఏజెన్సీ అయిన కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ వివిధ చర్యలను చేపట్టినట్లు తెలిపింది.

మహారాష్ట్రలో అత్యధికం
గత మూడేళ్లలో మహారాష్ట్రలో అత్యధికంగా 83,974 సైబర్‌ మోసాలు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మహారాష్ట్రలో రూ.240 కోట్లు కొట్టేసినట్లు చెప్పింది. ఆ తరువాత తమిళనాడులో 18,981 సైబర్‌ మోసాల్లో రూ.69.84 కోట్లు దోచుకున్నారు. హరియాణలో 18,573 కేసుల్లో రూ.66.98 కోట్లు, కర్ణాటకలో 11,916 మోపాల్లో రూ.60.75 కోట్లు కాజేశారు. తెలుగు రాష్ట్రాల్లో సైబర్‌ మోసాల సంఖ్య తక్కువగానే ఉంది. తెలంగాణలో 6,900 మోసాల్లో రూ.21.76 కోట్లు కాజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 1,885 సైబర్‌ మోసాల్లో రూ.5.69 కోట్లు కాజేసినట్లు పేర్కొంది.

సైబర్‌ మోసాల కట్టడికి తీసుకున్న చర్యలు
అన్ని రకాల సైబర్‌ నేరాలపై ఫిర్యాదులకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ ప్రారంభం
 బాధితులకు సహాయం చేయడానికి టోల్‌ ఫ్రీ నంబర్‌
 వినియోగదారుల డేటాను గోప్యంగా ఉంచాలని బ్యాంకులకు సూచన
డిజిటల్‌ సేవల ప్రక్రియను సురక్షితంగా ఉంచడానికి నియంత్రణ చర్యలు చేపట్టాలని బ్యాంకులకు ఆదేశం
సైబర్‌ మోసాలపై అవగాహన కల్పించేందుకు బ్యాంకులు, ఏటీఎంలలో పోస్టర్లు 
అన్ని లావాదేవీలకు ఆన్‌లైన్‌ హెచ్చరికలను తప్పనిసరి
లావాదేవీల మొత్తంపై రోజువారీ పరిమితులు

Advertisement
 
Advertisement
 
Advertisement