ఇరాన్‌ యుద్ధంతో భగ్గుమంటున్న ముడిచమురు | Oil Shock Looms, How Rising Crude Prices Could Hit Every Indian Household, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

Crude oil: 100 డాలర్లు దాటేసిన బ్యారెల్‌ ధర

May 15 2026 5:59 AM | Updated on May 15 2026 1:32 PM

Crude oil burning due to Iran war

మన చమురు కంపెనీలకు రోజుకు రూ.1,000 కోట్ల నష్టం 

ఎంతోకాలం దీన్ని భరించలేవంటూ ఆర్‌బీఐ గవర్నర్‌ వార్నింగ్‌ 

పెట్రోల్, డీజిల్‌ జాగ్రత్తగా వాడాలని ఇప్పటికే ప్రధాని సూచన 

ఇప్పటిదాకా భారాన్ని జనంపై మోపకుండా వచ్చిన కేంద్రం

ధరలు పెరిగితే వాహనదారులకే కాదు.. అందరికీ ఇబ్బందే 

కూరగాయల నుంచి నిత్యావసరాల వరకూ అన్నీ పెరిగే అవకాశం 

కంపెనీల లాభాలు తగ్గుతాయి కనుక షేర్‌ మార్కెట్‌కూ కష్టాలే 

ద్రవ్యోల్బణం పెరిగి.. ఈఎంఐలు కూడా ఖరీదయ్యే అవకాశం 

సామాన్యులు జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకోవాలంటున్న నిపుణులు

(రమణమూర్తి మంథా): ఇరాన్‌ యుద్ధం తాత్కాలికంగా ఆగినా.. హార్మూజ్‌ జలసంధిలో మొదలైన చమురు సరఫరా సంక్షోభం ఇంకా మండుతూనే ఉంది. ఫలితం... అంతర్జాతీయంగా ముడి చమురు ధర బీభత్సంగా పెరుగుతోంది. బ్యారెల్‌ ధర 100 డాలర్లు దాటేసింది. ఈ ప్రభావం పెట్రోలు బంకులతో ఆగిపోదు. ప్రతి ఇంట్లోకీ చొరబడుతుంది. వాహనాలు లేనివారిక్కూడా కష్టాలు తప్పవు. ఎందుకంటే మనకు అవసరమైన ముడి చమురులో 85–90 శాతం దిగుమతుల ద్వారా వస్తున్నదే. ధర పెరగటం వల్ల దిగుమతుల బిల్లు పెరిగి.. మన డాలర్ల నిల్వలు తరిగిపోతున్నాయి.

దీంతో డాలర్‌ విలువ మరింత పెరుగుతూ రూపాయి పతనమవుతోంది. ఇదో వలయం. దీనిలో చిక్కి విలవిల్లాడుతున్న దేశాన్ని కాస్త గాడిన పెట్టడానికి బంగారం కొన్నాళ్లు కొనవద్దని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేయాలని ప్రధాని మోదీ సూచించారు. తనవంతుగా బంగారం కొనుగోళ్లను తగ్గించడానికి దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15 శాతానికి పెంచేశారు. పెట్రో ధరలూ పెరగవచ్చన్న సంకేతాలున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ముడిచమురు సామాన్యుల జీవితంలో ఎలాంటి మార్పులు తేబోతున్నదో వివరించేదే ఈ ప్రత్యేక కథనం..

అన్నింటిపై ప్రభాaవం..
సామాన్యుడికి మొదట కనిపించేది పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరగటమే!. నిజానికి సంక్షోభం మొదలయ్యాక ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఈ భారాన్ని తామే మోస్తున్నాయి తప్ప జనంపై మోపలేదు. చమురు కంపెనీలు రోజుకు సుమారు రూ.1,000 కోట్ల నష్టాన్ని భరిస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరీ చెప్పకనే చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపు తప్పదని ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా చెప్పారు. అదే జరిగితే..

అన్నిరకాల ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి..
 బైక్‌పై, కార్లపై ఆఫీసుకెళ్లేవారికి నెల ఖర్చు పెరుగుతుంది
ఆటో, క్యాబ్‌ చార్జీలు పెరుగుతాయి
బస్సు చార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది

కూరగాయలు, నిత్యావసరాలు కూడా...
డీజిల్‌ ధర పెరిగితే రైతు ఖర్చు పెరుగుతుంది. ఎందుకంటే.. ట్రాక్టర్లు డీజిల్‌పైనే నడుస్తాయి. బోర్లు, నీటి పంపులు ఇంధనంపై ఆధారపడతాయి. ఎరువుల తయారీ ఖర్చు పెరుగుతుంది. రవాణా ఖర్చు భారీగా పెరుగుతుంది. దీంతో కూరగాయలు, ఇతర నిత్యావసరాల సరుకుల ధరలు పెరుగుతాయి. పాల ధరలు పెంచుతున్నట్లు ఇప్పటికే కొన్ని కంపెనీలు ప్రకటించాయి. రవాణా ఖర్చు పెరగటమనేది ప్రతి వస్తువు ధరనూ ప్రభావితం చేస్తుంది. 

ఎల్పీజీ, హోటల్‌ బిల్లులు కూడా పెరుగుతాయి
దేశానికి అవసరమైన ఎల్పీజీలో అత్యధిక భాగం దిగుమతుల ద్వారా వస్తున్నదే. సరఫరా ఇబ్బందుల వల్ల అంతర్జాతీయ గ్యాస్‌ ధరలు పెరిగాయి. దీంతో ఇప్పటికే కమర్షియల్‌ సిలిండర్‌ ధరలను కేంద్రం ఏకంగా 30 శాతానికి పైగా పెంచేసింది. ఇళ్లలో వాడే సాధారణ సిలిండర్లు ఇప్పటికీ ఏజెన్సీల నుంచి సకాలంలో సరఫరా కావటం లేదు. ఈ గ్యాస్‌ ఇబ్బందులతో.. ఇప్పటికే చాలా టిఫిన్‌ సెంటర్లతో సహా రెస్టారెంట్లు, హోటళ్లు ధరలను పెంచేశాయి. ఇళ్లలో వండి సరఫరా చేసే హోమ్‌ కిచెన్‌లు కూడా మెనూను తగ్గించేయడంతో పాటు ధరలను స్వల్పంగా పెంచి ఈ ఇబ్బందిని తట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. 

విమాన టికెట్ల ధరలూ నింగిలోకి..
విమానాల్లో వాడే జెట్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌) కూడా క్రూడ్‌ ఆయిల్‌ నుంచే వస్తుంది. కాబట్టి విమాన కంపెనీలు తమపై పడ్డ భారాన్ని అంతిమంగా ప్రయాణికుడిపైనే వేస్తాయి. ఫలితంగా ట్రావెల్‌ ప్యాకేజీలు ఖరీదవుతాయి. టూరిజం రంగంపై ప్రభావం పడుతుంది. ఈ ప్రభావం వల్ల హోటల్‌ పరిశ్రమ కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలుంటాయి. కొన్ని ఎయిర్‌లైన్స్‌ ఇప్పటికే తాము విమానాలు నడిపే రూట్లను తగ్గించేశాయి. ధరలనూ పెంచవచ్చన్న సంకేతాలిస్తున్నాయి. 

రూపాయి విలువ పడిపోతుంది
కేంద్ర ప్రభుత్వం చమురును డాలర్లలో కొంటుంది. క్రూడ్‌ ధర పెరిగితే ఎక్కువ డాలర్లు అవసరం అవుతాయి. అప్పుడు ఉన్న డాలర్లను (ఫారెక్స్‌ నిల్వలు) వెచ్చించటంతో పాటు కొత్త డాలర్లు కొనాల్సి ఉంటుంది. డాలర్‌ను కొంటూ ఉంటే దాని విలువ పెరిగిపోతూ.. మనం వెచ్చించే రూపాయి విలువ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు రూపాయి కనిష్ట స్థాయిలకు చేరటానికి ఇదే కారణం.

ఈఎంఐలు పెరగొచ్చు!
ముడిచమురు వల్ల అన్ని ధరలూ పెరిగితే... ద్రవ్యోల్బణం పెరిగినట్లే. ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పుడు దాన్ని నియంత్రించడానికి రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించకుండా జాగ్రత్తపడుతుంది. ఒకవేళ వడ్డీ రేట్లు పెంచితే తదనుగుణంగా హోమ్‌ లోన్‌ ఈఎంఐలు పెరిగే అవకాశం ఉంటుంది. పైపెచ్చు వ్యాపార రుణాలు ఖరీదవుతాయి. వినియోగం మందగిస్తుంది. ఇది మళ్లీ ఆర్థిక మందగమనానికి దారితీస్తుంది. 

స్టాక్‌ మార్కెట్‌ షేక్‌
చమురు ధరల కారణంగా సామాన్యులకు మాదిరిగానే కంపెనీలకూ ఖర్చులు పెరుగుతాయి. దీంతో లాభాలు తగ్గుతాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడ సరిగ్గా  లాభాలుండవేమోనన్న భయాలతో పెట్టుబడుల్ని వెనక్కి తీసుకుంటారు. దీంతో షేర్లు పతనమవుతాయి. ఈ ఏడాది ఇప్పటికే విదేశీ ఇన్వెస్టర్లు రికార్డు స్థాయిలో పెట్టుబడుల్ని వెనక్కి తీసుకోవటం తెలిసిందే. 


నోట్‌: పర్యాటక ప్రదేశాలు ఎక్కువగా ఉండటం, వాహనాల రద్దీ వంటి కారణాల వల్ల ఆయా రాష్ట్రాల్లో పెట్రోలు లేదా డీజిల్ వినియోగం ఎక్కువగా ఉంది. బిహార్‌ దేశంలోనే అత్యంత తక్కువగా పెట్రోలు (3 లీటర్లు), డీజిల్‌(6 లీటర్లు) వినియోగిస్తోంది.  

కంపెనీలకు తిప్పలు 
చమురు ధరలు పెరిగితే ఎక్కువగా పెయింట్స్, సిమెంట్, కెమికల్స్, ఎయిర్‌లైన్స్, లాజిస్టిక్స్‌ రంగాలు దెబ్బతింటాయి. అయితే ఆయిల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ కంపెనీలు, కొన్ని ఎగుమతి సంస్థలు లాభపడే అవకాశం ఉంది. కాకపోతే ఇలా లాభపడే సంస్థలతో పోలిస్తే ఇబ్బందిపడే సంస్థలే ఎక్కువ. 

ప్రభుత్వానికి ఇబ్బందులు..
చమురు ధరలు పెరిగితే ప్రభుత్వానికి ఆప్షన్లు చాలా తక్కువ ఉంటాయి. అయితే ధరలు పెంచాలి..లేదంటే పన్నులు తగ్గించాలి. ఈ రెండూ కాదంటే చమురు కంపెనీల నష్టాల్ని తానే భరించాలి. ఈ మూడింట్లో ఏది చేసినా కష్టమే. ధరలు పెంచితే ప్రజల్లో వ్యతిరేకత పెరగవచ్చు. పన్నులు తగ్గించినా, కంపెనీల నష్టాలను తాను భరించినా తన ఆర్థిక పరిస్థితి దెబ్బతినవచ్చు.

ఉపశమనం కలిగిస్తున్న అంశాలివే...
ఇరాన్‌ యుద్ధం కారణంగా హార్మూజ్‌ జలసంధి ద్వారా సరఫరా ఆగిపోయింది. దీంతో భారత్‌ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోంది. ఇది కొంత ఉపశమనం ఇస్తోంది.
మన దేశం ప్రపంచంలోని అతిపెద్ద రిఫైనింగ్‌ దేశాల్లో ఒకటి. అందుకే సరఫరా నిర్వహణలో కొంత వెసులుబాటు ఉంది.
ప్రస్తుతానికి మన దేశానికున్న ఫారెక్స్‌ నిల్వలు రక్షణ కవచంలా పనిచేస్తున్నాయి.

సామాన్యులు చేయాల్సిందేంటి?
అవసరం లేని ప్రయాణాలు తగ్గించుకోవాలి
 కుటుంబ బడ్జెట్‌ను ముందే ప్లాన్‌ చేసుకోవాలి
ఈఎంఐల విషయంలో జాగ్రత్తగా ఉండాలి
సిప్‌లు, బంగారం, డిఫెన్సివ్‌ పెట్టుబడులపై దృష్టి పెట్టాలి
పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చులు నియంత్రించుకోవాలి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement