కౌలు రైతులకు చకచకా కార్డులు | Crop Cultivars Card to Lease Farmers | Sakshi
Sakshi News home page

కౌలు రైతులకు చకచకా కార్డులు

Aug 4 2020 4:54 AM | Updated on Aug 4 2020 4:54 AM

Crop Cultivars Card to Lease Farmers - Sakshi

సాక్షి, అమరావతి: కౌలు రైతులు, వాస్తవ సాగుదార్లకు పంట సాగుహక్కుల కార్డు (సీసీఆర్‌సీ) అందచేయాలనే లక్ష్యంతో వ్యవసాయ శాఖ చేపట్టిన ప్రత్యేక ప్రచారోద్యమానికి పెద్దఎత్తున స్పందన లభిస్తోంది. జూలై 20న ప్రారంభించిన ఈ కార్యక్రమం ఈనెల 7న ముగియనుంది. కౌలు రైతులు ప్రైవేట్‌ అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఆదుకోవాలన్నది ఈ కార్డుల ఉద్దేశమని సీఎం వైఎస్‌ జగన్‌ పలు సందర్భాలలో స్పష్టం చేశారు. భూ యజమానుల హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా కేవలం 11 నెలల కాలానికి ఇచ్చే ఈ కార్డులతో కౌలు రైతులు ప్రభుత్వం అందించే రాయితీ పథకాలు, వ్యవస్థాగత పరపతి పొందుతారు. ఏపీ పంట సాగుదారుల చట్టం–2019 ప్రకారం ఈ కార్డులు జారీ చేస్తారు.

11 నెలలు మాత్రమే చెల్లుబాటు..
► పంట సాగుదారు కార్డుపై భూ యజమాని లేదా ప్రతినిధి, సాగుదారు, గ్రామపరిపాలనాధికారి (వీఆర్‌వో) సంతకాలు ఉంటాయి.
► 11 నెలల తరువాత సాగుదారు మళ్లీ కొత్తకార్డు పొందాల్సిందే.
► కార్డు పొందిన వారికి భూమిపై ఎటువంటి హక్కులు ఉండవు.
► ఈ కార్డుపై పంట రుణం తీసుకుంటే పూర్తిగా చెల్లించాల్సిన బాధ్యత సాగుదారుదే. ఒకవేళ రుణం కట్టకుంటే ఆ బాధ్యత భూ యజమానిపై ఉండదు. రుణం ఇచ్చిన బ్యాంకు భూ యజమానికి ఇబ్బంది కలిగించకుండా ప్రభుత్వం తగిన ఏర్పాటు చేసింది
► సాగుదారుడు భూమికి నష్టం కలిగించే చర్యలకు పాల్పడితే ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు.
► భూ యజమాని కుటుంబ సభ్యుల పేర్లతో సాగుదారు కార్డులు ఇవ్వరు.
► దేవదాయ భూములను సాగు చేస్తున్న వారు కూడా కార్డు పొందవచ్చు.
► దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లో సాగుదారు కార్డు లభిస్తుంది. ఏదైనా ఇబ్బంది ఉంటే ఎమ్మార్వో కార్యాలయం దృష్టికి తేవాలి.
► ప్రస్తుత ఖరీఫ్‌లో సీసీఆర్‌సీ కార్డుదారులందరికీ నూటికి నూరు శాతం పంట రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తోంది.
► రైతు భరోసా కేంద్రాలలో వాస్తవ సాగుదారులు, భూ యజమానులను సమావేశపరచి కార్డుల జారీ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు భూ యజమానులు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement