ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా

Covid Vaccine for these chronic patients - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45–59 ఏళ్ల వయసు వారికి కరోనా టీకా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏయే వ్యాధులు ఆ కేటగిరీలోకి వస్తాయో వెల్లడించింది. వాటిని వైద్యులు ధ్రువీకరించి సర్టిఫికెట్‌ ఇవ్వాల్సి ఉంది. ఆ వ్యాధులు ఏమిటంటే...

1. గుండె వైఫల్యం సమస్యకు గత ఏడాది కాలంలో ఆస్పత్రిలో చేరినవారు.
2. గుండె మార్పిడి లేదా ఒక కవాటం సమస్యకు పరికరాన్ని అమర్చుకున్నవారు.
3. గుండె ఎడమ కవాటం పనిచేయకుండా ఇబ్బంది పడుతున్నవారు.
4. గుండె పని సామర్థ్యం 40 శాతం కంటే తక్కువ ఉన్నవారు లేదా కవాటం సమస్యతో బాధపడుతున్నారు
5. పుట్టుకతో వచ్చిన వివిధ రకాల గుండె సమస్యలతో బాధపడుతున్నవారు.
6. హైపర్‌ టెన్షన్‌ (బీపీ), డయాబెటిస్‌ (షుగర్‌)తో బాధపడుతూ చికిత్స పొందుతున్నవారు.
7. సీటీ స్కాన్‌ లేదా ఎంఆర్‌ఐ పరీక్షలో పక్షవాతం నిర్ధారణ అయి హైబీపీ లేదా డయాబెటీస్‌కు చికిత్స పొందుతున్నవారు.
8. గుండెపోటుకు గురై ఇప్పటికే బైపాస్‌ సర్జరీ లేదా స్టంట్‌ వేయించుకున్నవారు.
9. ఊపిరితిత్తుల్లో రక్తపోటు సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారు.
10. పదేళ్లుగా డయాబెటీస్‌తో బాధపడుతున్నవారు లేదా దాంతోపాటు దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు.
11. కిడ్నీ, లివర్‌ మార్పిడి లాంటి శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు లేదా చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు, స్టెమ్‌ సెల్‌ థెరఫీ తీసుకున్నవారు.
12. తీవ్రమైన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు, ఇప్పటికే డయాలసిస్‌లో ఉన్నవారు.
13. రోగనిరోధక శక్తి తక్కువ కావడం వల్ల వచ్చే జబ్బులతో బాధపడుతున్నవారు.
14. దీర్ఘకాలిక కాలేయ సంబంధ సమస్యతో బాధపడుతున్నవారు.
15. గత రెండేళ్లలో శ్వాసకోశ సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారు.
16. లింఫోమా, లుకేమియా, మైలోమా లాంటి కేన్సర్లతో బాధపడుతున్నవారు.
17. గతేడాది జూలై తర్వాత కేన్సర్‌ బారినపడినవారు లేదా ఇప్పుడు చికిత్స తీసుకుంటున్నవారు.
18. దీర్ఘకాలిక రక్తకణాల సమస్యలతో బాధపడుతున్నవారు, స్టెరాయిడ్స్‌ మాత్రలు దీర్ఘకాలికంగా వాడేవారు.
19. హెచ్‌ఐవీతో బాధపడుతున్నవారు.
20. కండరాల బలహీనతతో బాధపడుతున్నవారు, యాసిడ్‌ దాడికి గురై శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు, మూగ–చెవిటి–అంధత్వ సమస్యలతో బాధపడుతున్న దివ్యాంగులు. 

రాష్ట్రంలో 2,222 ఆస్పత్రుల్లో సీనియర్‌ సిటిజన్లకు నేటి నుంచి టీకా 
సాక్షి, అమరావతి:  నేటి నుంచి రాష్ట్రంలో అతిపెద్ద కోవిడ్‌ టీకా ప్రక్రియ జరగనుంది. రెండు మాసాల పాటు 48 రోజులు ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. రమారమి 60 లక్షల మందికి టీకా వేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో 60 ఏళ్లు దాటిన వారితో పాటు 45–59 ఏళ్లలోపు వయసుండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికీ టీకా వేస్తారు. 28 రోజుల వ్యవధిలో తొలిడోసు, రెండో డోసు వేయడానికి ఏర్పాట్లు చేశారు. మొత్తం 2,222 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సోమవారం ఉదయం 8 గంటల నుంచే ప్రారంభమవుతుంది. దీనికోసం వ్యాక్సినేటర్లను నియమించారు. వ్యాక్సిన్‌ జిల్లాల వారీగా అవసరాన్ని బట్టి అక్కడకు చేర్చారు. కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌ లేదా ఆరోగ్యసేతు యాప్‌లో పేరు నమోదు చేసుకుని టీకా వేయించుకోవచ్చు. లేదా ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్లి ఆయా కేంద్రాలకు వెళ్లి టీకా వేయించుకునే అవకాశమూ ఉంది. ఒకే దశలో ఇంత మందికి టీకా వేయడం అతిపెద్ద ప్రక్రియ అని వైద్యులు చెబుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top