ప్రజాధనం దోపిడీకే తెరపైకి ‘సీమెన్స్‌’  The cost of the project was artificially inflated in the skill scam | Sakshi
Sakshi News home page

ప్రజాధనం దోపిడీకే తెరపైకి ‘సీమెన్స్‌’ 

Published Sat, Mar 11 2023 4:11 AM

The cost of the project was artificially inflated in the skill scam - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజాధనాన్ని కొల్లగొట్టాలన్న ముందస్తు పథకంలో భాగంగానే గత సర్కారు పెద్దలు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో సీమెన్స్‌ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్‌ ఇండియా లిమిటెడ్‌ను తెరపైకి తెచ్చారని సీఐడీ తరఫున రాష్ట్ర అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ప్రాజెక్టు వ్యయాన్ని రూ.3,356 కోట్లకు కృత్రిమంగా పెంచారని, ఇందులో సీమెన్స్‌ మాజీ ఉద్యోగి జీవీఎస్‌ భాస్కర్‌ ప్రసాద్‌ కీలక పాత్ర పోషించారని నివేదించారు.

ఇలా పెంచిన మొత్తాన్ని పెద్దల అండతో దారి మళ్లించేందుకు భారీ కుట్రకు తెర తీశారని తెలిపారు. అందులో భాగంగానే ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌–సీమెన్స్‌ మధ్య ఒప్పందం కుదరగానే యూపీలో ఐఏఎస్‌ అధికారిగా ఉన్న భాస్కర్‌ ప్రసాద్‌ భార్య ఊర్మిళను ఇంటర్‌ కేడర్‌ డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ సీఈవోగా నియమించారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇదో భారీ కుంభకోణమని, ఇంత తీవ్రమైన కేసులో మేస్ట్రేస్టేట్‌ చాలా యాంత్రికంగా భాస్కర్‌ ప్రసాద్‌ రిమాండ్‌ను తిరస్కరించారని తెలిపారు. కింది కోర్టులో ఏం జరుగుతోందో తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

భాస్కర్‌ ప్రసాద్‌పై ఐపీసీ సెక్షన్లు 409, 120 (బీ) కింద సీఐడీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే మేస్ట్రేస్టేట్‌ విస్మయకరంగా రిమాండ్‌ సమయంలోనే మినీ ట్రయల్‌ నిర్వహించి సెక్షన్‌ 409 వర్తించదని తేల్చడంతోపాటు భాస్కర్‌ ప్రసాద్‌ రిమాండ్‌ను తిరస్కరించారని వివరించారు. ఏ సెక్షన్‌ వర్తిస్తుంది? ఏ సెక్షన్‌ వర్తించదు? అనే అంశాలను దర్యాప్తు పూర్తై చార్జిషీట్‌ దాఖలు చేసిన తరువాత చేపట్టే తుది విచారణలో తేల్చాలే కానీ రిమాండ్‌ సమయంలో కాదన్నారు.

రాష్ట్రంలోని కింది కోర్టుల్లో రిమాండ్‌ సమయంలోనే ఫలానా సెక్షన్‌ వర్తించదంటూ రిమాండ్‌ను తిరస్కరించే ట్రెండ్‌ నడుస్తోందని, దీనిపై హైకోర్టు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన సమయం వచ్చిందని సుధాకర్‌రెడ్డి నివేదించారు. ఈ కుంభకోణం వెనుక దాగిన పెద్దల పాత్ర బహిర్గతం కావాలంటే భాస్కర్‌ ప్రసాద్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించడం సీఐడీకి అనివార్యమన్నారు. సీఐడీ తరఫున వాదనలు ముగియడంతో భాస్కర్‌ ప్రసాద్‌ తరఫు న్యాయవాది వీఆర్‌ మాచవరం వాదనల నిమిత్తం తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బీఎస్‌.భానుమతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement