
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదు ప్రచారంపై కడప డీహెచ్‌ఎంవో నాగరాజు స్పందించారు. కరోనా పాజిటివ్ నిర్ధారణపై డీహెచ్‌ఎంవో నాగరాజు కీలక ప్రకటన చేశారు.
తాజాగా ఆయన మాట్లాడుతూ..‘కడప జిల్లాలో ఎక్కడా కోవిడ్ కేసులు లేవు. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న చాగలమర్రి మహిళకు కోవిడ్ లేదు. ఆమెకు కొంత ఊపిరితిత్తుల సమస్య మాత్రమే ఉంది. అందుకే ఆమెను కోవిడ్ వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నాం. ఆమెకు కరోనా నిర్ధారణ కాలేదు. వదంతులను నమ్మవద్దు అని తెలిపారు. ఇదిలా ఉండగా.. విశాఖలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన విషయం తెలిసిందే.
వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ..
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రార్థన సమావేశాలు, సామాజిక సమావేశాలు, పార్టీలు, ఇతర కార్యక్రమాల వంటివి వాయిదా వేసుకోవాలని కోరింది. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు వంటి స్థలాల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలి. ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా వాడాలి.

జ్వరం లేదా చలి, దగ్గు, అలసట, గొంతునొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం, తలనొప్పి, కండరాలు లేదా శరీర నొప్పులు, ముక్కు కావడం లేదా ముక్కుదిబ్బడ, వికారం, వాంతులు, విరోచనాలు ఉంటే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి. ఆరోగ్యశాఖ అన్ని పరీక్ష సౌకర్యాలతో కూడిన 24 గంటలు పని చేసే ల్యాబ్‌లో మాస్కులు, పీపీఈ కిట్ త్రిబుల్ లేయర్ మాస్కులను తగిన పరిణామంలో ఉంచుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది.
