
కాంక్రీట్ లైనింగ్‌కు బదులు సిమెంటు పూతలా చేస్తున్న షార్ట్ క్రీటింగ్ లైనింగ్
పుంగనూరు ఉపకాలువ లైనింగ్ పనుల్లో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం
కాంక్రీట్ లైనింగ్‌కు బదులు సిమెంట్ పూతతో సరిపెడుతున్న వైనం
పనుల వద్ద కనిపించని ప్రాజెక్టు అధికారులు
నీళ్లు ప్రవహిస్తే కొట్టుకుపోవడం ఖాయం
మదనపల్లె: హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండో దశలో భాగంగా అన్నమయ్య జిల్లాలో చేపట్టిన పుంగనూరు ఉపకాలువ (పీబీసీ) లైనింగ్ పనుల పర్యవేక్షణను ప్రభుత్వం గాలికి వదిలేసింది. కాంట్రాక్టు సంస్థ ఏ పనులు చేస్తోంది, ఒప్పందం మేరకు పనులు సాగుతున్నాయా లేదా అనే అంశాన్ని పట్టించుకోవడం లేదు. ఆదివారం తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట శివారులో నిర్వహించిన లైనింగ్ పనులే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
పీబీసీకి ఇరువైపులా కాంట్రాక్టు సంస్థ రూ.366 కోట్లతో కాంక్రీట్ లైనింగ్, బండరాళ్లపై షార్ట్ క్రీటింగ్ పనులు చేయాలి. షార్ట్ క్రీటింగ్ చేయాల్సిన చోట నిబంధనలకు తిలోదకాలిచ్చారు. మట్టిపై చేయాల్సిన కాంక్రీటు లైనింగ్ పనులనే మార్చేశారు. భవనాలకు రంగులు వేసినట్టుగా.. గోడలకు సిమెంట్ పూత పూసినట్టుగా లైనింగ్ పనులు చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం నాలుగు అంగుళాల మందంతో కాంక్రీట్‌తో లైనింగ్ పనులు చేయాలి. కానీ, ఇది కనీసం ఒక అంగుళం మందం కూడా లేదు.
నీరు ప్రవహిస్తే అంతే!
కాంక్రీట్ లైనింగ్ చేయకుండా షార్ట్ క్రీటింగ్‌తో కాలువకు సిమెంట్ పూత కారణంగా కాలువలో ఒక్కసారిగా నీళ్లు ప్రవహిస్తే కొట్టుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. సిమెంట్ పూత పూస్తున్న కారణంగా అది మట్టిపై నిలబడేలా లేదు. నీళ్లు పడితే సిమెంటు జారి పడిపోయే అవకాశం ఉంది. ఫలితంగా ప్రభుత్వం రూ.366 కోట్లతో పనులు చేపట్టినా నిష్ఫలమయ్యే దుస్థితి దాపురించింది. ఇక్కడ సాంకేతిక సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ఒప్పందానికి విరుద్ధంగా పనులు సాగిపోతున్నాయి. పర్యవేక్షించాల్సిన ప్రాజెక్టు అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. గత వారం ఇక్కడి పనులను క్వాలిటీ కంట్రోల్ సీఈ శేషుబాబు పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేసినా అధికారుల్లో కదలిక కనిపించడం లేదు.