ఉప్పుతో ముప్పే | Sakshi
Sakshi News home page

ఉప్పుతో ముప్పే

Published Thu, Nov 24 2022 4:56 AM

Consuming too much salt can cause heart attack and brain stroke - Sakshi

లబ్బీపేట (విజయవాడ తూర్పు): కూరయినా, పప్పయినా, చారయినా... ఏ వంటకమైనా ఉప్పు వేయనిదే రుచి ఉండదు. ఉప్పు లేని పదార్థం చప్పగా ఉంటుంది. కానీ, రుచినిచ్చే ఈ ఉప్పే ఎక్కువ అయితే ప్రమాదకరమే అంటున్నారు వైద్య నిపుణులు. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు.

అది వైట్‌ పాయిజన్‌లా మారి జీవితకాలాన్ని తగ్గిస్తుందని, గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌తో పాటు లంగ్, గ్యాస్ట్రిక్, కిడ్నీ క్యాన్సర్లకు దారి తీస్తుందని యూకే పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం వివరాలను యూరోపియన్‌ హార్ట్‌ జర్నల్‌ ప్రచురించింది. మన దేశంలో యూకే కంటే రెట్టింపు మొత్తంలో ఉప్పు తీసుకోవడంతో దుష్ఫలితాలు మరింత ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

జీవిత కాలం తగ్గుతోంది..
యూకే పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ 5,01,379 మందిని పదేళ్ల పాటు పరిశీలించి, ఈ వివరాలు వెల్లడించింది. వీరిలో 18,474 మంది వేర్వేరు కారణాలతో మరణించారు. మూత్రంలో సోడియం శాతం ఆధారంగా నిర్వహించిన అధ్యయనాల్లో ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్న వారు హైపర్‌ టెన్షన్‌ (బీపీ), గుండె జబ్బులు, బ్రెయిన్‌ స్ట్రోక్, గ్యాస్ట్రిక్, లంగ్, కిడ్నీ క్యాన్సర్లకు గురవుతున్నట్టు గుర్తించారు. మహిళల్లో 1.5 సంవత్సరాలు, పురుషుల్లో 2.28 సంవత్సరాల జీవిత కాలం తగ్గినట్టు తేలింది. ఉప్పు ఎక్కువగా తీసుకున్నప్పటికీ, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకునే వారిలో దాని దుష్ఫలితాలు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు.

ఎంత తీసుకోవాలంటే.. 
సోడియం అయితే రోజూ 2.30 గ్రాములు, సాల్ట్‌ అయితే 5 గ్రాముల వరకు తీసుకోవచ్చు. కానీ మన దేశంలో రెట్టింపు మొత్తంలో తీసుకుంటున్నారు. ప్యాక్ట్, బేకరీ ఫుడ్, నిల్వ పచ్చళ్లు వంటి వాటిలో ఉప్పు ఎక్కువుగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. 40 ఏళ్లు కూడా నిండకుండానే గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురవుతున్న వారిని ఇక్కడ మనం చూస్తున్నాం. ముప్పై ఏళ్ల వయస్సులోనే రక్తపోటు అదుపులో ఉండటంలేదు. ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడమే ఇందుకు ఓ కారణమని వైద్యులు అంటున్నారు.

ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ప్రమాదం
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం ప్రమాదకరమని యూకే అధ్యయనాల్లో తేలింది. మన ప్రాంతంలో అయితే తీసుకోవాల్సిన దానికంటే రెట్టింపు స్థాయిలో ఉప్పు తీసుకుంటున్నాం. దీంతో హైపర్‌టెన్షన్‌తో పాటు 40 ఏళ్లకే గుండెపోటుకు గురవుతున్నారు. జీవిత కాలాన్ని తగ్గించి,  ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్న ఉప్పును తగిన మోతాదులోనే తీసుకోవాలి. లేదంటే ప్రమాదమే.    
    –  డాక్టర్‌ జె. శ్రీమన్నారాయణ, కార్డియాలజిస్‌ 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement