చకచకా దిగువ కాఫర్‌ డ్యాం పనులు

Cofferdam works speedup - Sakshi

కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే పనులు ప్రారంభం.. మేలోగా పూర్తి 

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు డిజైన్లు కొలిక్కివస్తున్నాయి. దీంతో పనులు ఊపందుకుంటున్నాయి. గత ప్రభుత్వ చర్యల కారణంగా పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్‌డ్యామ్, ప్రధాన డ్యామ్‌లో కొంత భాగం వరదలకు కోతకు గురయ్యాయి. వీటిని పూడ్చడానికి రూపొందించిన డిజైన్లు పోలవరం పీపీఏ, సీడబ్ల్యూసీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని వెంటనే ఆమోదించాలని ఇటీవల పోలవరం పరిశీలనకు వచ్చిన కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి తదనుగుణంగా చర్యలు చేపట్టారు.

దిగువ కాఫర్‌ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చేందుకు ఇక్కడ డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించి, దానికి ఇరువైపులా ఇసుక, జియోమెంబ్రేన్‌ బ్యాగ్‌లతో పూడ్చే విధానానికి సీడబ్ల్యూసీ ఆమోదించింది. రెండ్రోజుల్లోగా జియోమెంబ్రేన్‌ బ్యాగ్‌లను తెప్పించి, కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చనున్నారు. మేలోగా ఈ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు.  దిగువ కాఫర్‌ డ్యామ్‌ కోతకు గురైన సమయంలోనే ప్రధాన డ్యామ్‌ కూడా గ్యాప్‌–2 ప్రాంతంలో కూడా 12 మీటర్ల లోతుకు కోతకు గురయింది.

ఈ ప్రాంతం పూడ్చివేత విధానాన్ని రూపొందించేందుకు ఢిల్లీ ఐఐటీ రిటైర్డు డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వీఎస్‌ రాజు నేతృత్వంలో కేంద్రం నిపుణుల కమిటీని నియమించింది. ఈనెల 25లోగా ఈ కమిటీ విధానాన్ని రూపొందిస్తే.. దానిపై 28 లేదా 29న కేంద్ర మంత్రి షెకావత్‌ నేతృత్వంలో సీడబ్ల్యూసీ, పీపీఏ, డీడీఆర్పీలు సమావేశమై కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే విధానంతోపాటు ప్రధాన డ్యామ్‌ డిజైన్‌లను కొలిక్కి తేనున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top