
పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పనపై కూటమి ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ భూములను త్యాగం చేసిన పోలవరం నిర్వాసితుల జీవితాలతో రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది. 14 నెలలుగా వారికి పునరావాసం కల్పించడానికి ఒక్క ఇల్లు కూడా కట్టలేదు.. సరికదా గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన 3,114 ఇళ్లను నిర్వాసితులకు ఇచ్చి పునరావాసం కల్పించేందుకు ప్రస్తుత సర్కారుకు మనసొప్పడంలేదు. ఇక 2024, మే నాటికి దాదాపుగా పూర్తయ్యే దశలో ఉన్న 2,279 ఇళ్లను పూర్తిచేసే దిశగా చర్యలూ చేపట్టలేదు. దీంతో.. ఆ పునరావాస కాలనీలు ముళ్లపొదలతో చిట్టడవిని తలపిస్తున్నాయి. ఆ ఇళ్లు 14 నెలలుగా వృథాగా ఉన్నాయి.
ఇక నిర్వాసితుల కోసం ఇంకా 16,170 ఇళ్లను నిర్మించాల్సి ఉండగా.. 14 నెలలుగా ఒక్క ఇంటి నిర్మాణాన్ని కూడా చేపట్టలేదు. నిధులు లేవేమో అనుకుంటే పొరబడినట్లే.. ఎందుకంటే.. కేంద్రం 14 నెలల్లో రెండు విడతలుగా అడ్వాన్సు రూపంలో రూ.5,052.71 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది. వాటిని పోలవరం పనులు, నిర్వాసితులకు పునరావాసం కల్పన, భూసేకరణకు మాత్రమే వినియోగించేలా ఎస్‌ఎన్‌ఏ (సింగిల్ నోడల్ ఏజెన్సీ) ఖాతాలో జమచేయాలని నిర్దేశించింది.
కానీ, రూ.2,135.35 కోట్లను ఇప్పటికీ ఆ ఖాతాలో జమచేయకుండా ఇతర అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించింది. కమీషన్లు రావనే నెపంతోనే పునరావాసం కల్పనపై ముఖ్యనేత పట్టించుకోవడంలేదని నిర్వాసితులు మండిపడుతున్నారు. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వచేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు అవసరమైన రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు 2024, ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వచేయాలంటే.. 121 గ్రామాల్లోని 38,060 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఇందులో 34,360 నిర్వాసిత కుటుంబాలు పునరావాస కాలనీల్లో ప్రభుత్వమే ఇళ్లు నిర్మించాలని కోరగా, మిగతా 3,700 కుటుంబాలు తమకు డబ్బులిస్తే తామే కట్టుకుంటామని చెప్పాయి.
2024, మే నాటికే 12,797 కుటుంబాలకు పునరావాసం.. పోలవరం నిర్వాసితులకు నిర్మించాల్సిన 34,360 ఇళ్లలో 15,911 గృహాలను పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలతో సహా 2024, మే నాటికే గత ప్రభుత్వం పూర్తిచేసింది. మరో 2,279 ఇళ్లను దాదాపుగా పూర్తిచేసింది. వాటికి మౌలిక సదుపాయాలు కూడా కల్పించింది. నిర్వాసితులకు పరిహారం చెల్లించి 2024, మే నాటికే 12,797 కుటుంబాలకు పునరావాసం కల్పించింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. 2014, మే నాటికే పూర్తయిన ఇళ్లలో 3,114 గృహాలు ఖాళీగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ఇక అప్పటికే దాదాపుగా పూర్తయిన 2,279 ఇళ్లను పరిగణనలోకి తీసుకుంటే.. మొత్తం 5,393 ఇళ్లను నిర్వాసితులకు కేటాయించి, పరిహారం చెల్లించి పునరావాసం కల్పించే అవకాశం ఉంది. కానీ, 2024 ఆగస్టు నుంచి కేవలం 1,574 నిర్వాసిత కుటుంబాలకు మాత్రమే కూటమి ప్రభుత్వం పరిహారం చెల్లించి అప్పటికే పూర్తయిన పునరావాస కాలనీల్లోని ఇళ్లకు తరలించింది. దీన్నిబట్టి చూస్తే.. ఇప్పటికీ పునరావాస కాలనీల్లో పూర్తయిన 3,819 ఇళ్లు ఖాళీగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
కమీషన్లు రావనే నెపంతోనే..
ఇక పోలవరం ప్రాజెక్టు పనుల్లో 2014–19 తరహాలోనే ముఖ్యనేత ఇప్పుడు కూడా కమీషన్లు అధికంగా వచ్చే పనులకే ప్రాధాన్యం ఇస్తున్నారని.. పునరావాసం కల్పనపై దృష్టిసారించకపోవడమే అందుకు నిదర్శనమని నిర్వాసితులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. కేంద్ర జల్‌శక్తి శాఖ రెండు విడతలుగా రూ.5052.71 కోట్లు విడుదల చేసింది. రెండో విడత కింద ఇందులో రూ.2704.71 కోట్లను అడ్వాన్సుగా మార్చి 11న విడుదల చేసింది. ఇందులో కేవలం రూ.569.36 కోట్లను ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమచేసింది.
మిగతా రూ.2,135.35 కోట్లను ఇప్పటికీ జమచేయలేదు. వాటిని ఇతర అవసరాలకు మళ్లించింది. దీన్నిబట్టి చూస్తే నిధులున్నప్పటికీ నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదన్నది స్పష్టమవుతోంది. మరోవైపు.. గోదావరి వరదలకు ముంపు గ్రామాల్లోకి నీళ్లు చేరడం.. రాకపోకలకు వీల్లేకుండా పోవడంతో నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కళ్ల ముందు నిర్వాసితులు వరదలతో సతమతమవుతున్నప్పటికీ వారికి పునరావాసం కల్పించాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వేధింపులు ఆపాలి
ప్రభుత్వం పునరావాసం కల్పించకపోవడంతో పోలవరం మండలం తెల్లవరం గ్రామానికి చెందిన మేం వింజరం గ్రామం వద్ద పాకలు నిర్మించుకుని జీవిస్తున్నాం. గ్రామంలోకి వెళ్లి వ్యవసాయం చేస్తుంటే మాపై అటవీ శాఖ అధికారులు వేధింపులకు దిగుతున్నారు. వేధింపులను తక్షణం నిలుపుదల చేయాలి. ఉపాధి హామీ పనులు కల్పించాలి. –కుంజం రామారావు, నిర్వాసితుడు, తెల్లవరం
భూమికి హక్కులు కల్పించాలి
పోలవరం మండలం తూటిగుంట, కొండ్రుకోట, సింగనపల్లి తదితర రెవెన్యూ గ్రామాల్లో ఏజెన్సీ గిరిజన సంఘం ఉమ్మడిగా సంఘ సభ్యుల సాగును నమోదు చేసింది. దాని ప్రకారం ఆర్ అండ్ ఆర్‌లో పరిహారం, భూమికి భూమి హక్కులు కల్పించాలి. డీ ఫాం పట్టా భూములకు పరిహారం చెల్లించాలి. – మిడియం పోసిరావు, నిర్వాసితుడు, చేగొండపల్లి
ఉపాధి పనులు లేవు
పోలవరం ప్రాజెక్ట్ వల్ల సర్వం కోల్పోయి వేరే ప్రాంతంలో తలదాచుకుంటున్న మాకు కనీసం ఉపాధి హామీ పనులు కల్పించకపోవడం దారుణం. తక్షణం జిల్లా అధికారులు జోక్యం చేసుకుని నిర్వాసితులకు పనులు కల్పించాలి. 18 ఏళ్లు నిండిన వారందరికీ ప్యాకేజీ ఇప్పించాలి. – మాడే పోశమ్మ, నిర్వాసితురాలు, తెల్లవరం
లేబర్ అడ్డాలుగా కాలనీలు
నిర్వాసితులకు భూమికి భూమి, ఆర్ అండ్ ఆర్ ఇవ్వకపోవడంతో పునరావాస కాలనీలు తక్కువ కూలికి దొరికే లేబర్ అడ్డాలుగా మారాయి. చాలా బాధాకరం. –షేక్ బాషా, రైతు కూలీ సంఘం, ఏలూరు జిల్లా కార్యదర్శి