
సీజ్ చేసిన పొక్లెయినర్, డోజర్, భవనాలు
ములకలచెరువులో మొన్న నకిలీ మద్యం.. అదే ప్రాంతంలో ఇప్పుడు భూ కబ్జా
వైన్, మైన్‌లపై ‘పెద్దల’ భరోసాతోనే మాఫియాను తలపిస్తూ ఇష్టారాజ్యం
బి.కొత్తకోట: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పెద్దలు శాండ్, ల్యాండ్, మైన్, వైన్ లకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ అడ్డదారుల్లో వీటి ద్వారా వేల కోట్ల రూపాయలు దండుకోవడానికి వ్యూహ రచన చేశారని మరోమారు స్పష్టమైంది. అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఎక్కడికక్కడ మాఫియా ముఠాలుగా మారి ఇసుక దందాకు తెర లేపిన విషయం తెలిసిందే. ఇక భూ దందాలు, పందేరాల గురించి చెప్పనలవికాదు. మొన్నటికి మొన్న అన్నమయ్య జిల్లా ములకలచెరువులో భారీగా ఏర్పాటు చేసిన నకిలీ మద్యం ప్లాంట్ బట్టబయలైంది.
రోజూ వేల లీటర్ల నకిలీ మద్యం.. వివిధ బ్రాండ్ల పేరుతో తయారు చేసి.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మద్యం షాపులు, బెల్ట్ షాపులకు సరఫరా చేశారని నిగ్గు తేలింది. అందుకు సంబంధించిన యంత్ర సామగ్రి, కెమికల్స్, బాటిళ్లు, మూతలు, లేబుళ్లు పట్టుబడటం తెలిసిందే. ఈ దందాకు కింది స్థాయిలో పాత్రధారి తంబళ్లపల్లి టీడీపీ ఇన్‌చార్జ్ జయచంద్రారెడ్డి అని బయటకు పొక్కడంతో ఉలిక్కి పడిన సర్కారు పెద్దలు ఆయనపై హుటాహుటిన సస్పెన్షన్ వేటు వేశారు. అసలైన సూత్రధారులు, పాత్రధారులు వెలుగులోకి రాకుండా కట్టడి చేస్తున్నట్లు నిన్న, మొన్న జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
పై స్థాయిలో ప్రభుత్వ పెద్దల భరోసా ఉండబట్టే ఇంత భారీ స్థాయిలో లిక్కర్ దందా సాగుతోందని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దల అండతో ఇదే జయచంద్రారెడ్డి బి.కొత్తకోట మండలం తుమ్మనంగుట్ట పంచాయతీలోని యాదలగుట్ట వద్ద పది ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి స్టోన్ క్రషర్లు ఏర్పాటు చేసిన విషయం తాజాగా కలకలం రేపుతోంది. నకిలీ మద్యం రాకెట్ బట్టబయలైన నేపథ్యంలో స్థానికులు కొందరు ఈ భూ ఆక్రమణపై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందించి, వారి సూచనల మేరకు బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు తనిఖీలు నిర్వహించారు.
ఐదెకరాల్లో స్టోన్ క్రషర్ యంత్రాలను అక్రమంగా ఏర్పాటు చేసింది నిజమేనని, మరో ఐదు ఎకరాలు ప్రభుత్వ భూమి ఆక్రమణా నిజమేనని ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పై నుంచి వచ్చి న ఆదేశాల మేరకు స్టోన్ క్రషర్లు, కంకర, భవనాలను సీజ్ చేస్తున్నట్లు మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు ప్రకటించారు.
ఫిర్యాదు నేపథ్యంలో హఠాత్తుగా తనిఖీలు
» తుమ్మనంగుట్ట పంచాయతీ టోల్‌గేటు వద్ద యాదలగుట్టపై ఐదెకరాల ప్రభుత్వ స్థలంలో ఎనిమిది నెలల క్రితం స్టోన్ క్రషర్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి మరో ఐదు ఎకరాలు ఆక్రమించారు. భారీ యంత్రాలతో పనులు చేయించి నివాస భవనాలను సైతం నిర్మిoచారు. ఇక్కడికి రాకపోకలు సాగించేందుకు మట్టి రోడ్డు కూడా వేసుకున్నారు. జాతీయ రహదారికి సమీపంలోనే ఈ వ్యవహారం సాగుతున్నా, ఇన్నాళ్లూ ఏ శాఖ అధికారి కూడా కన్నెత్తి చూడలేదు.
» వాస్తవానికి అక్రమ స్టోన్ క్రషర్‌పై ఫిర్యాదు రావడంతో బుధవారం మైనింగ్ శాఖ మల్లగుల్లాలు పడింది. తర్జనభర్జనల అనంతరం ప్రభుత్వ పెద్దలకు సమాచారం ఇచ్చి.. తర్వాత దాడులు చేయడమే శ్రేయస్కరం అన్న నిర్ణయానికి వచ్చి ంది. పై నుంచి వచ్చి న ఆదేశాల మేరకు మైనింగ్ అధికారులు బి.కొత్తకోట, ములకలచెరువు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మైనింగ్ ఏడీ రంగకుమార్, తహసీల్దార్లు బావాజాన్, శ్రీనివాసులు, ఆర్‌ఐలు, సర్వేయర్లు, వీఆర్‌ఓలు, ఎస్ఐలు, పోలీసులు యాదలగుట్టకు చేరుకున్నారు.
» రాత్రి 10.30 గంటలకు మొదలైన తనిఖీలు తెల్లవారుజాము మూడు గంటల వరకు కొనసాగాయి. ఈ తనిఖీల్లో తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డికి రెవెన్యూ తరఫున భూ కేటాయింపు లేకపోయినా ఐదెకరాలకుపైగా ప్రభుత్వ భూమిని ఆక్రమించడం, అందులో భవనాలు, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడం, స్టోన్ క్రషర్ ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్దమని నిర్ధారించారు.
» మైనింగ్ శాఖ నుంచి క్వారీ నిర్వహణ, స్టోన్ క్రషర్ నడుపుకునేందుకు ఎలాంటి అనుమతి లేనందున వాటిని సీజ్ చేశారు. 6,415 క్యూబిక్ మీటర్ల.. 40, 20, 6, 5 ఎంఎం కంకరను సీజ్ చేశారు. దాంతో పాటే రెండు పొక్లెయినర్లు, ఒక డోజర్, ఒక వాటర్ ట్యాంకర్, స్టోన్ క్రషర్‌ను సీజ్ చేశామని మైనింగ్ ఏడీ రంగకుమార్, బి.కొత్తకోట తహసీల్దార్ ఎ.బావాజాన్ ప్రకటించారు.
అక్రమ దందాకు దర్జాగా విద్యుత్ లైన్
» జయచంద్రారెడ్డి అక్రమ స్టోన్ క్రషర్‌కు ఒక్క అనుమతి లేకపోయినా డిస్కం అధికారులు విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక లైను ఏర్పాటు చేయడంపై విస్తుగొలుపుతోంది. గంటకు 300 టన్నులకుపైగా కంకరను కొట్టే సామర్థ్యం ఉందని అధికారులు చెబుతున్నారు.
» అక్రమ స్టోన్ క్రషర్ కోసం సమీపంలోని కొండను పగలగొట్టిన ప్రదేశాన్ని ఇన్‌స్పెక్టర్ పి.విజయకుమారి, మైనింగ్ సర్వేయర్ మాధవీలత, రెవెన్యూ సర్వేయర్ ముబారక్‌లు గురువారం పరిశీలించారు. ఎంత మేరకు రాళ్లను ఉపయోగించారనే దానిపై సర్వే చేస్తున్నారు. మొత్తంగా పది ఎకరాలు ఆక్రమించారని ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.
» స్టోన్ క్రషర్ ఏర్పాటుకు 14 శాఖల అనుమతులు అవసరం. ఈ అనుమతులు లేకుండా మైనింగ్ శాఖ అనుమతి ఇవ్వదు. క్వారీ అప్పగించేందుకు రెవెన్యూ అధికారులు ఎన్‌ఓసీ ఇస్తే దానికి అనుమతి ఇవ్వాల్సింది మైనింగ్ శాఖ. భూమి సొంతమా, లీజునా, ఏ సామర్థ్యంతో స్టోన్ క్రషర్ ఏర్పాటు చేస్తున్నారు.. అగ్నిమాపక, అటవీ, రెవెన్యూ, విద్యుత్, గ్రామ పంచాయతీ, ప్రజల నుంచి ఎన్‌వోసీ, రైల్వే, హైవే, పొల్యూషన్, కార్మిక శాఖ, ఇలా పలు శాఖల నుంచి ఎన్‌ఓసీలు, అనుమతులు పొందాక వాటిని పరిశీలించి మైనింగ్ శాఖ చివరగా అనుమతి ఇస్తుంది. ఇక్కడ ఇవేవీ లేకుండానే భారీ స్థాయిలో క్రషర్ కొనసాగిందంటే ప్రభుత్వ పెద్దల అందడండలు లేకుండా సాధ్యం కాదని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.