
వైద్య విద్య ప్రవేశాల్లో స్థానిక, స్థానికేతర కోటాపై స్పష్టత ఇవ్వని కూటమి సర్కార్
సిద్ధార్థ మెడికల్ కళాశాలలోని సీట్ల విభజనపైనా అదే పరిస్థితి
జీవోలు విడుదల చేయని ప్రభుత్వం
అవి వస్తేనే ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముందుకు..
సాక్షి, అమరావతి: నీట్ యూజీ–2025 ఫలితాలు ప్రకటించి నెల రోజులు గడిచిపోయాయి.. రాష్ట్ర నీట్ అర్హుల జాబితా వెలువడి పది రోజులు కావస్తోంది. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ కూడా మొదలైంది. కానీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ తీరు వల్ల కౌన్సెలింగ్ ప్రక్రియ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం సిద్ధార్థ వైద్య కళాశాలలో 42:36:22 నిష్పత్తిలో ఆంధ్ర యూనివర్సిటీ(ఏయూ), ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ), శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ(ఎస్వీయూ) ప్రాంతాల వారీగా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను కేటాయించేవారు.
గతేడాది జూన్ నాటికి రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యింది. 2024–25 విద్యా సంవత్సరంలో ఓయూ సీట్లను.. ఏపీలోని ఏయూ, ఎస్వీయూ మెరిట్ విద్యార్థులకు కేటాయించారు. ఇప్పుడు 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి సిద్ధార్థ కళాశాల సీట్ల కేటాయింపు సంగతిని ప్రభుత్వం ఇంకా తేల్చలేదు. అలాగే వైద్య విద్య ప్రవేశాల్లో స్థానిక, స్థానికేతర కోటాపైనా స్పష్టత ఇవ్వలేదు.
వాస్తవానికి గత మే నెలలో ఉన్నత విద్యా ప్రవేశాల్లో స్థానిక, స్థానికేతర కోటా, రాష్ట్ర స్థాయి విద్యా సంస్థల్లో సీట్ల విభజనపై ఉత్తర్వులు వెలువడ్డాయి. వాటికి అనుగుణంగా వైద్య విద్య ప్రవేశాల కోసం ప్రత్యేకంగా జీవోలు విడుదల చేయాలి. కానీ వాటిని జారీ చేయకుండా కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుండడంతో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతోంది.
65.62:34.38 నిష్పత్తిలో..
రాష్ట్ర స్థాయి విద్యా సంస్థల్లో అన్–రిజర్వ్‌డ్ సీట్లు 15 శాతం పోగా.. మిగిలిన 85 శాతం సీట్లను 65.62:34.38 నిష్పత్తిలో ఏయూ, ఎస్వీయూకు విభజించారు. ఇదే విధానం సిద్ధార్థ వైద్య, డెంటల్ కళాశాలకు వర్తింపజేయనున్నారు. ప్రస్తుతం సిద్ధార్థ వైద్య కళాశాలలో 175 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వీటిలో 15 శాతం అంటే 26 సీట్లు ఆలిండియా కోటా కింద భర్తీ చేస్తారు. మిగిలిన 149 సీట్లలో 85 శాతం సీట్లను 65.62:34.38 నిష్పత్తిలో ఏయూ, ఎస్వీయూ విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు.