CM YS Jagan: మొక్కులు చెల్లించి.. చరిత్రలో నిలిచి..

CM YS Jagan Two Days Tirumala Tour Went on Enthusiastically - Sakshi

ఆహ్లాదకర వాతావరణంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన 

పలు ప్రారంభోత్సవాలు.. ఒప్పందాలు 

టీటీడీ చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలు 

రేణిగుంట విమానాశ్రయంలో సాదర వీడ్కోలు పలికిన ప్రజాప్రతినిధులు, అధికారులు 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భక్తిప్రపత్తులతో శ్రీవారిని సేవించుకున్నారు.. సంప్రదాయ దుస్తులు ధరించి సపరివారంగా మంగళవారం ఉదయం మలయప్పను దర్శించుకున్నారు.. దేవదేవుని తీర్థప్రసాదాలను స్వీకరించి ఆనంద పరవశులయ్యారు.. వడ్డికాసులవానికి తులాభారం సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. కోనేటిరాయుని వైభవాన్ని మరింత మంది భక్తులు వీక్షించేలా ఎస్వీబీసీలో కన్నడ, హిందీ ప్రసారాలకు శ్రీకారం చుట్టారు.. ఆలయ సమీపంలో అత్యాధునికంగా నిర్మించిన బూందీ పోటును ప్రారంభించారు.. ఆధ్యాత్మిక క్షేత్రంతో అన్నదాతలను అనుసంధానం చేసేలా రైతుసాధికార సంస్థతో టీటీడీకి ఒప్పందం కుదిర్చారు.. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులనే శ్రీనివాసుని నిత్య కైంకర్యాలకు వినియోగించేలా చర్యలు చేపట్టారు. రెండు రోజుల తిరుమల పర్యటనను ఆహ్లాదకర వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేసుకుని తిరుగుపయనమయ్యారు. 

సాక్షి, తిరుపతి: జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండురోజుల పర్యటన ఉత్సాహంగా సాగింది. తొలిరోజు తిరుపతిలో కొన్ని అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయగా, మంగళవారం తిరుమలలో మరికొన్నింటిని ప్రారంభించారు. అలాగే స్థానిక అన్నమయ్యభవన్‌లో టీటీడీ, రైతుసాధికార సంస్థ మధ్య కీలక ఒప్పందం చేయించారు. ఏడుకొండలస్వామికి బ్రహ్మోత్సవాల సమయంలో పట్టువస్త్రాలను సమర్పించే అదృష్టం కొందరికే దక్కుతుంది. అయితే టీటీడీ చరిత్రలో తొలిసారిగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి ఈ మహద్భాగ్యం దక్కడం విశేషం. నాడు ఉమ్మడి ఆంధ్రపదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఐదు పర్యాయాలు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. నేడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా మూడుసార్లు దేవదేవునికి పట్టువస్త్రాలు అందించి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. 

అన్నదాతతో ఒప్పందం 
తిరుమల అన్నమయ్యభవన్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో రైతు సాధికార సంస్థతో టీటీడీ ప్రతిష్టాత్మకమైన ఒప్పందం కుదుర్చుకుంది.  ఈ మేరకు గోశాల అభివృద్ధి, గోఆధారిత నైవేద్యం, గుడికో గోమాత, అగరబత్తుల తయారీ, గో ఆధారిత వ్యవసాయ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అలాగే డ్రై ఫ్లవర్‌ టెక్నాలజీతో  వివిధ ఆలయాల్లో వినియోగించిన పుష్పాలతో విశిష్ట సామగ్రి తయారీని ముఖ్యమంత్రి ప్రారంభించారు.  

చదవండి: (దుర్గమ్మ సేవలో ఏపీ సీఎం)

ముఖ్యమంత్రికి సాదర వీడ్కోలు 
రేణిగుంట: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటన పూర్తి చేసుకుని మంగళవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కోనేటి ఆదిమూలం, కలెక్టర్‌ హరినారాయణన్, డీఐజీ క్రాంతిరాణా టాటా, తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ సురేష్, స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మ, ఏపీఎంఐడీసీ చైర్మన్‌ షమీమ్‌ అస్లాం, తిరుపతి కార్పొరేషన్‌ కమిషనర్‌ పీఎస్‌ గిరీష, ఆర్డీవో కనక నరసారెడ్డి, తహసీల్దార్‌ శివప్రసాద్‌ సాదరంగా వీడ్కోలు పలికారు.  

ఎస్వీబీసీ విస్తరణకు శ్రీకారం 
శ్రీవేంకటేశ్వర భక్తిచానల్‌కు గతంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. నాడు టీటీడీ బోర్డు చైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకరరెడ్డి చొరవ తీసుకుని అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ చేతుల మీదుగా ఎస్వీబీసీని ప్రారంభించారు. తదనంతర కాలంలో తమిళ ప్రసారాలను కూడా మొదలుపెట్టి విశేష భక్తజన ఆమోదం పొందింది. ఈ క్రమంలో మంగళవారం ఎస్వీబీసీ కన్నడ, హిందీ ప్రసారాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. టీటీడీ ధార్మిక కార్యక్రమాలు, శ్రీవారి వైభవాన్ని దశదిశలా చాటేలా మంగళవారం సువర్ణ అధ్యాయానికి తెరతీశారు.  

                         ఎస్వీబీసీ నూతన చానళ్లను ఆవిష్కరిస్తూ..

విరివిగా లడ్డూ ప్రసాదం 
శ్రీవారి ఆలయం వెలుపల రూ.12 కోట్లతో నూతనంగా నిర్మించిన బూందీపోటును సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. అత్యాధునిక వసతులతో సిద్ధం చేసిన ఈ పోటు ద్వారా నిత్యం సుమారు 6లక్షల లడ్డూ ప్రసాదాలు తయారు చేసే వెసులుబాటు ఉంటుంది. గతంలో లడ్డూ ప్రసాదాల కోసం భక్తులు  తీవ్రంగా ఇబ్బంది పడేవారు. చాలినన్ని లడ్డూలు లభించక నిరాశచెందేవారు. ఇకపై ప్రతి భక్తునికీ కోరినన్ని లడ్డూలు అందుబాటులోకి రానున్నాయి.  

   బూందీ పోటును ప్రారంభిస్తూ..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top