నిందితులపై కఠిన చర్యలు తీసుకోండి : సీఎం

CM YS Jagan Serious On Gajuwaka Varalaxmi Murder - Sakshi

10లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం

సాక్షి, విశాఖపట్నం : గాజువాక ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌గా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీచేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డీజీపీ, సీఎస్‌ని ఆదేశించారు. బాధితురాలు వరలక్ష్మి కుటుంబసభ్యులకు 10లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మహిళల భద్రత పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని డీజీపీ, సీఎస్‌లను సీఎం జగన్‌ ఆదేశించారు. విద్యార్థినులందరూ దిశా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేవిధంగా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. (గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం)

గాజువాకలోని శ్రీనగర్‌ సుందరయ్య కాలనీలో శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో ప్రేమోన్మాదం ఓ యువతి ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇటీవలే ఇంటర్‌ పూర్తి చేసుకున్న వరలక్ష్మి (17) అనే యువతిని చిట్టినాయుడు కాలనీకి చెందిన అఖిల్‌సాయి వెంకట్‌(21) ప్రేమ పేరుతో వేధించేవాడు. శనివారం రాత్రి రాము అనే స్నేహితుడితో కలిసి ఆమెకు ఫోన్‌చేసి సుందరయ్య కాలనీలోని సాయిబాబా ఆలయం వద్దకు రావాల్సిందిగా చెప్పాడు. అక్కడికి వచ్చిన యువతి ఎందుకు పిలిచావని అఖిల్‌సాయిని నిలదీయగా.. మాట్లాడాలి రా అంటూ తుప్పల్లోకి లాక్కెళ్లాడు. అక్కడి పరిస్థితిని చూసిన వరలక్ష్మి ఆలయం వద్దకు వెంటనే రావాలని తన అన్నకు ఫోన్‌ చేసి చెప్పగా.. కోపోద్రిక్తుడైన అఖిల్‌సాయి తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మెడపై నరికాడు.

హోం మంత్రి మేకతోటి సుచరితకు ఆదేశం..
ఘటన తెలిసిన వెంటనే ఆదివారం ఉదయం సీఎస్, డీజీపీ, ఇంటలిజెన్స్‌ చీఫ్‌ నుంచి సీఎం జగన్‌ వివరాలను తెలుసుకున్నారు. వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించాలని హోం మంత్రి మేకతోటి సుచరిత, దిశ ప్రత్యేక అధికారులు కృతికాశుక్లా, దీపికా పాటిల్‌ను ఆదేశించారు. ప్రతి టీనేజ్‌ బాలిక మొదలు ప్రతి మహిళ వరకు దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఉపయోగించుకునేలా వారిని ఎడ్యుకేట్‌ చేయాలన్నారు. ప్రత్యేకించి పాఠశాలల్లో చదువుతున్న బాలికలు మొదలు కాలేజీ విద్యార్థినుల వరకు వందకు వంద శాతం ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాలను అదుపు చేసే విధంగా పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫలానా వ్యక్తి లేదా వ్యక్తుల నుంచి ముప్పు ఉందని బాలిక లేదా మహిళ ఏదైనా సమాచారం ఇస్తే ఏ మాత్రం ఉదాసీనంగా వ్యవహరించకుండా సీరియస్‌గా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. 

కాగా ఘటనలో ప్రధాన నిందితుడు అఖిల్‌సాయి ఆంధ్రా యూనివర్సిటీలో బీఎల్‌ చదువుతున్నాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రేమోన్మాది అఖిల్ సాయి, రామును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఖిల్‌సాయి - రాముతో వరలక్ష్మికి ఉన్న సాన్నిహిత్యంపై విచారణ చేపడుతున్నారు. రాముతో సాన్నిహిత్యంగా ఉండటంతో అఖిల్  వరలక్ష్మిని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

వరలక్ష్మి హత్యకేసులో లోతుగా విచారణ చేపట్టాము. నిందితుడు అఖిల్ సాయి పై దిశా చట్టం పై కేసు నమోదు చేశాము. వారం రోజుల్లో చార్జిషీట్ కూడా దాఖలు చేస్తాము. ప్రేమ వ్యవహారంలో దారి తప్ప డమే హత్యకు కారణంగా అనుమానం ఉంది. త్వరలో విశాఖ వ్యాప్తంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ మనీష్కుమార్ సిన్హా

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top