వైద్య, ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్‌మెంట్‌కు సీఎం జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌

CM YS Jagan Review Meeting On Medical and Health Department - Sakshi

సాక్షి, తాడేపల్లి: వైద్య, ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్‌మెంట్‌కు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. సుమారు 14,200 పోస్టుల భర్తీకి సీఎం జగన్‌ ఆమోదం తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత ఉండకూడదనే ఉద్దేశంతో వైద్య, ఆరోగ్యశాఖలో రిక్రూట్‌మెంట్‌ చేపట్టాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.  ఈ మేరకు అక్టోబరు 1 నుంచి ప్రక్రియ మొదలుపెట్టి నవంబరు 15 నాటికి పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. 

కోవిడ్‌–19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌తో పాటు వైద్య, ఆరోగ్యశాఖపై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శుక్రవారం సమీక్ష చేపట్టారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ వివిధ స్థాయిల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బంది, కావాల్సిన సిబ్బందిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ స్థాయిలో ప్రమాణాలు, ప్రస్తుతం ఉన్న అవసరాలు తదితర వివరాలను కూడా సీఎం తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండకూడదు. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఆస్పత్రులను నిర్మిస్తున్నాం, తీరా అక్కడ చూస్తే.. సిబ్బంది లేక రోగులకు సేవలు అందని పరిస్థితి. సంవత్సరాల తరబడి ఇలాంటి సమస్యలే మనం నిత్యం చూస్తున్నాం. ఇకపై దీనికి చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉంది. వైద్యం కోసం భారీగా ఖర్చులు చేయాల్సిన పరిస్థితి పోవాలి. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందాలి. ఈ లక్ష్యం దిశగా అడుగులు వేయాలని' అధికారులకు సీఎం జగన్‌ నిర్దేశం చేశారు.

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తోపాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు సరిపడా సిబ్బందితో సమర్థవంతంగా నడపాలి. ఒక డాక్టరు సెలవులో వెళ్తే ఆ స్థానంలో మరో డాక్టరు విధులు నిర్వహించేలా.. తగిన సంఖ్యలో వైద్యులను నియమించండి. డాక్టరు సెలవు పెడితే.. రోగులకు వైద్యం అందని పరిస్థితి కానీ, తోటి డాక్టర్లపై భారం పడే పరిస్థితి కానీ ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. 

వైద్య ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్‌మెంట్‌
వైద్య ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్‌మెంట్‌కు సీఎం జగన్‌ ఆమోదం తెలిపారు. పీహెచ్‌సీల నుంచి బోధనాసుపత్రుల వరకూ దాదాపు 14,200కు పైగా పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ తెలిపారు. ఈ ప్రక్రియను అక్టోబర్‌ 1న మొదలు పెట్టి నవంబర్‌ 15 నాటికి కార్యాచరణ పూర్తిచేసేలా ఉండాలన్నారు. 

కోవిడ్‌-19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎంకు వివరాలందించిన అధికారులు
ఏపీలో యాక్టివ్‌ కేసులు - 13,749 
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు - 2787
కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్నావారు - 562
రికవరీ రేటు 98.60 శాతం
పాజిటివిటీ రేటు 2.12 శాతం
3 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు - 10
3 నుంచి 5 శాతం లోపు పాజిటివిటీ ఉన్న జిల్లాలు - 2
ఐదు శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ ఉన్న జిల్లా - 1
రాష్ట్ర వ్యాప్తంగా జీరో కేసులు నమోదైన సచివాలయాలు - 10,921
నెట్‌ వర్క్‌ ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న బెడ్స్‌ - 91.33 శాతం
ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న బెడ్స్‌ - 72.64 శాతం

థర్డ్‌ వేవ్‌ పై సన్నద్ధత
అందుబాటులో ఉన్న డీటైప్‌ సిలెండర్లు -  27,311
మొత్తం అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ - 20,964
ఇంకా రావాల్సినవి - 2493
128 ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ఫైప్‌లైన్‌ వర్క్‌ పూర్తి
ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లు 143 చోట్ల ఏర్పాటు 
అక్టోబరు 10 నాటికి అందుబాటులోకి రానున్న మొత్తం ప్లాంట్లు 

వ్యాక్సినేషన్‌
ఇప్పటివరకు వ్యాక్సినేషన్‌  చేయించుకున్నవారి సంఖ్య - 2,61,56,928
సింగిల్‌ డోసు వ్యాక్సినేషన్‌ పూర్తయినవారు - 1,34,96,579
రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తిచేసుకున్నవారు - 1,26,60,349
వ్యాక్సినేషన్‌ కోసం ఉపయోగించిన మొత్తం డోసులు - 3,88,17,277

కోవిడ్‌ నిబంధనలు, వ్యాక్సినేషన్‌పై అధికారులకు సీఎం ఆదేశం
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాల్లో వ్యాకినేషన్‌ కార్యక్రమంపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించండి
ఈ మూడు జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కోసం ప్రత్యేక అధికారులను నియమించండి
కోవిడ్‌ ప్రోటోకాల్‌కు సంబంధించి గైడ్‌లైన్స్‌ పై అధికారులకు సీఎం ఆదేశం 
రాత్రిపూట కర్ఫ్యూ యధావిధిగా అమలు చేయాలన్న సీఎం
పాజిటివిటీ రేటు ఎక్కుగా ఉన్న జిల్లాల్లో అంక్షలు కొనసాగుతాయి
కోవిడ్‌ నిబంధనలును కచ్చితంగా, కఠినంగా అమలు చేయాలి
వ్యాక్సినేషన్‌ ప్రక్రియే కోవిడ్‌ సమస్యకు పరిష్కారం.. కనుక దీనిని వేగవంతం చేయాలని ఆదేశం
కొత్తగా నిర్మిస్తున్న బోధనాసుపత్రుల పనుల ప్రగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి(వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల నాని, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సలహాదారు గోవిందహరి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జి ఏ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌ చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌ రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ (డ్రగ్స్‌) రవిశంకర్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చదవండి: అన్ని ప్రాంతాల సుస్థిరాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top