పక్కాగా సమగ్ర భూసర్వే.. ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది కలగకూడదు

CM YS Jagan Review On Jagananna Permanent Land Rights Land Protection Scheme - Sakshi

‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష’పై సీఎం వైఎస్‌ జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష  

ఎక్కడా అవినీతికి, అలసత్వానికి తావుండరాదు.. ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది కలగకూడదు

సర్వే రాళ్ల కోసం రూపాయి కూడా తీసుకోవద్దు

సర్వే పూర్తయిన చోట్ల గ్రామస్థాయిలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు

అప్పుడే ఈ ప్రక్రియ అంతా పూర్తయినట్లు భావించాలి

సర్వే ప్రక్రియ సజావుగా జరిగేలా స్టీరింగ్‌ కమిటీ.. వారానికి ఒకసారి సమీక్ష బాధ్యతలు సీసీఎల్‌ఏకి

మూడు దశల్లో సర్వే.. 2023 ఏప్రిల్‌ నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక

సాక్షి, అమరావతి: భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ సర్వేలో ఎక్కడా అవినీతికి, అలసత్వానికి తావుండకూడదని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది కలగకుండా పక్కాగా సర్వే నిర్వహించాలని సూచించారు. సమగ్ర భూసర్వేకి సంబంధించి ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష’ పథకంపై సీఎం జగన్‌ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఏం చెప్పారంటే..

ఎలాంటి రుసుము వసూలు చేయవద్దు..
సర్వే వేగంగా చేపట్టినందున రాళ్ల సరఫరా కూడా అంతే ముఖ్యం. రాళ్ల సరఫరా ఆలస్యం కాకుండా చూడాలి. సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేసేందుకు రైతుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయకూడదు. ప్రతి గ్రామ సచివాలయంతో పాటు వార్డులలో ఒక హోర్డింగ్‌ పెట్టాలి. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై వివరాలు ఉండాలి. ముఖ్య కూడళ్లలో శాశ్వత హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలి.

సర్వే ముగిసిన గ్రామాల్లో సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులు
సమగ్ర సర్వే పూర్తయిన 51 గ్రామాల్లో రికార్డుల ప్యూరిఫికేషన్, రికార్డుల అప్‌డేషన్, సర్వే రాళ్లు పాతడం లాంటివి ముగిసే నాటికి? ఆయా గ్రామాలలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు కూడా ఏర్పాటు కావాలి. ఈ ఏడాది జూలై నాటికి ఆ 51 గ్రామ సచివాలయాల్లో సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులు ప్రారంభం కావాలి. అప్పుడే సమగ్ర భూసర్వే పూర్తైనట్లుగా భావించాలి. ఆ మేరకు సచివాలయాల్లో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం కోసం తగిన ఏర్పాట్లు చేయాలి.

సీసీఎల్‌ఏ కీలకపాత్ర..
సమగ్ర భూ సర్వే సజావుగా జరిగేలా స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేసి వారానికి ఒకసారి సమీక్ష నిర్వహించాలి. ఈ ప్రక్రియ మొత్తంలో భూ పరిపాలన చీఫ్‌ కమిషనర్‌ది కీలకపాత్ర.

వచ్చే జనవరికి తొలిదశ పూర్తి
సమగ్ర భూ సర్వే వివరాలను ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గత మూడు నెలలుగా వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండటం, యంత్రాంగం అంతా ఆ ప్రక్రియలో నిమగ్నం కావడం, దీర్ఘకాలం పాటు ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటం తదితర కారణాల వల్ల సమగ్ర భూ సర్వేలో కొంత జాప్యం జరిగినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1.26 లక్షల కిలోమీటర్ల విస్తీర్ణంలో 17,460 గ్రామాలు, 47,861 ఆవాసాల (హ్యాబిటేషన్స్‌)కు సంబంధించి సమగ్ర సర్వేకు పక్కాగా ఎస్‌వోపీ (ప్రామాణిక యాజమాన్య విధానం) రూపొందించినట్లు తెలిపారు. తొలిదశలో జిల్లాకు ఒక గ్రామం చొప్పున 13 గ్రామాలు, ఆ తర్వాత ప్రతి డివిజన్‌కు ఒక  గ్రామం చొప్పున 51 గ్రామాలు, ప్రతి మండలానికి ఒక గ్రామం చొప్పున 650 గ్రామాల్లో సర్వే ప్రక్రియ చేపట్టనున్నట్లు చెప్పారు. ఇప్పటికే 51 గ్రామాలకు సంబంధించి సమగ్ర సమాచార సేకరణ పూర్తి అయిందని, వచ్చే నెల నుంచి గ్రామ స్థాయిలో సర్వే మొదలు పెట్టి జూలై నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటికే 545 గ్రామాల్లో డ్రోన్లతో సర్వే పూర్తి చేసి ఛాయాచిత్రాలు సేకరించామని, వ్యవసాయ భూములు, హ్యాబిటేషన్ల (నివాస ప్రాంతాలు)కు సంబంధించి 2,693 ఛాయాచిత్రాలు తీశామని వివరించారు. మండలానికి ఒకటి చొప్పున 650 గ్రామాలలో సర్వే మొదలుపెట్టి వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. 

ఫిబ్రవరిలో రెండో దశ సర్వే..
సమగ్ర భూ సర్వే రెండో దశ సర్వేను 2022 ఫిబ్రవరిలో ప్రారంభించి వచ్చే ఏడాది అక్టోబరు నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. 

2022 నవంబరులో మూడో దశ..
మూడో దశను వచ్చే ఏడాది నవంబరులో మొదలు పెట్టి 2023 ఏప్రిల్‌ నాటికి సమగ్ర భూ సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సర్వే సిబ్బందికి సంప్రదాయ, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌లో శిక్షణ ఇచ్చినట్లు వివరించారు.

సమీక్షలో ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్, భూపరిపాలన చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ, పంచాయతీరాజ్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఎం.గిరిజాశంకర్, సర్వే, సెటిల్‌మెంట్స్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌ సిద్దార్ధ జైన్, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, మైన్స్‌ డీఎంజీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

సమగ్ర భూ సర్వే ప్రక్రియలో ఎక్కడా అవినీతికి తావు ఉండకూడదు. ఎక్కడ, ఎవరు ఏ చిన్న అవినీతికి పాల్పడినా మొత్తం కార్యక్రమానికి చెడ్డపేరు వస్తుంది. ఒకటికి రెండుసార్లు చెక్‌ చేయండి. ప్రతిచోటా తనిఖీ పక్కాగా ఉండాలి. ఎక్కడా రాజీ పడొద్దు. 
– సీఎం వైఎస్‌ జగన్‌

రైతుల సమక్షంలోనే సర్వే రాళ్లు...
మొత్తం భూ రికార్డులు, డేటాను అప్‌డేట్‌ చేస్తున్నాం కాబట్టి కేంద్రం నుంచి ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టానికి ఆమోదం లభించేలా చూడాలి. ఆ విధంగా ఒక సంస్కరణల ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నాం. సర్వే ప్రక్రియకు నిధుల కొరత రాకూడదు. సర్వే తర్వాత పక్కాగా సరిహద్దులు చూపాలి. మొత్తం సర్వే పూర్తయిన తర్వాత చెత్తా చెదారం తొలగించి, పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే జంగిల్‌ క్లియరెన్స్‌ కింద వాటన్నింటినీ తొలగించి చివరగా రైతుల సమక్షంలోనే సర్వే రాళ్లు పాతాలి. ఆ విధంగా ఈ ప్రక్రియలో రైతుల ప్రమేయం కూడా ఉండాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top