శభాష్‌ కలెక్టర్‌: సీఎం జగన్‌ అభినందనలు 

CM YS Jagan Praises West Godavari Collector Muthyala Raju - Sakshi

వరద నివారణ ఏర్పాట్లపై ప్రశంసలు

వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్, అధికారులు 

సాక్షి, ఏలూరు : గోదావరి వరద సహాయక చర్యలు, పునరావాసం ఏర్పాట్లు బాగా చేశారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కలెక్టర్‌ రేవు ముత్యాలరాజును అభినందించారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరద పరిస్థితి, కోవిడ్‌–19, ఇళ్ల పట్టాలు, ఎన్‌ఆర్‌ఈజీఎస్, నాడు–నేడు, వైఎస్సార్‌ చేయూత, ఆర్‌బీకేలకు అనుబంధంగా గిడ్డంగుల నిర్మాణం వంటి అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఏలూరు కలెక్టరేట్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు మాట్లాడుతూ వరద ముంపునకు గరైన ఇళ్ల నష్టం అంచనా నమోదు ప్రారంభించామని వివరించారు. కోతకు గురైన పాత పోలవరం నెక్లెస్‌ బండ్‌ను పటిష్టపరిచే పనులను చేపట్టామని పేర్కొన్నారు.

రానున్న మూడు నెలల్లో వరదలు వచ్చినా ఇబ్బంది లేని పరి స్థితి ఉంటుందని తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఏదైనా సహాయం అవసరమైతే ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డితో మాట్లాడాలని సూచించారు. తొలుత సీఎం జగన్‌ మాట్లాడుతూ వరద సహాయక చర్యల్లో కలెక్టర్‌ కృషి అభినందనీయమన్నారు. సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టడంతోపాటు పునరావాస కేంద్రాల ఏర్పాటు, వారికి అందించాల్సిన సహాయాలు సకాలంలో అందించడంలో తీసుకున్న చొరవ ప్రశంసనీయమన్నారు. ముంపునకు గురైన గృహాల నష్టం అంచనా నివేదికలు త్వరగా పూర్తి చేసి సెప్టెంబర్‌ 7 నాటికి బాధితులకు సహాయం అందేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.

వరద బాధిత కుటుంబాలకు రూ.2 వేలు అందించడంతో పాటు అదనంగా 25 కేజీల బియ్యం, 2 లీటర్ల కిరోసిన్, కేజీ కందిపప్పు, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు, కేజీ పామాయిల్‌ అందజేయాలని పేర్కొన్నారు. దెబ్బతిన్న బ్రిడ్జిలు, డ్రెయిన్లకు మరమ్మతులు చేయించాలన్నారు. ఆరోగ్య శిబిరాలు నిర్వహించడంతోపాటు, ఆరోగ్య బృందాలు కూడా పర్యటించి వైద్యసహాయం అందించాలని ఆదేశించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు, ఎస్పీ కె.నారాయణ నాయక్, జేసీలు హిమాన్షు శుక్లా, ఎన్‌.తేజ్‌భరత్‌ పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top