కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణంపై సీఎం జగన్‌ సమీక్ష

CM YS Jagan Mohan Reddy Review About Kadapa Steel Plant - Sakshi

సాక్షి, అమరావతి: కడప స్టీల్‌ప్లాంట్‌ ప్రయత్నాలు ముమ్మరం చేయాలని, వీలైనంత త్వరగా కంపెనీ ఎంపిక పూర్తి కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కొప్పర్తి ఈఎంసీ ద్వారా 30వేల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యమని ఆయన అన్నారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం, కొప్పర్తి ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌పై అధికారులతో ముఖ్యమంత్రి సోమవారం క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఇండస్ట్రియల్‌ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి 7 ప్రఖ్యాత కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. వాటితో జరిపిన సంప్రదింపుల పురోగతిని సీఎంకు వివరించారు. 

స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణంపై ఆయా కంపెనీల ప్రతిపాదనలు స్వీకరించి తదుపరి ఒక సంస్థను ఎంపిక చేస్తామని తెలిపారు. అందుకు కనీసం ఏడు వారాల సమయం పడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఆ ప్రక్రియ పూర్తి కాగానే తదుపరి 3-4 వారాల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రతిపాదనలు స్వీకరించిన వెంటనే ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సూచించారు. పనులు కూడా వేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. కంపెనీల ప్రతిపాదనల స్వీకరణకు ముందు ప్రభుత్వ పరంగా ఏమైనా పనులు మిగిలిఉంటే వాటిని నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. కరువు పీడిత ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ది, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా స్టీల్‌ప్లాంట్‌ను తీసుకొస్తున్నామని, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పనులు ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. (చదవండి: శరవేగంగా కడప ఉక్కు పనులు)

కొప్పర్తి ఈఎంసీ ద్వారా 30 వేల ఉద్యోగాలు: సీఎం జగన్‌
అనంతరం కడప నగరానికి సమీపంలో కొప్పర్తి వద్ద ఏర్పాటవుతున్న ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌పై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. క్లస్టర్‌ ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. 300 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉద్యోగాల కల్పనకు డిక్సన్‌ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు అధికారులు. ఆ పెట్టుబడి మరింత పెంచే అవకాశం ఉందని తెలిపారు. డిక్సన్‌తో పాటు మరిన్ని కంపెనీలు కూడా పెట్టుబడికి సిద్ధంగా ఉన్నాయన్నారు. పెట్టుబడులను ఆకర్షించేలా చక్కటి ప్రమాణాలతో కొప్పర్తి ఈఎంసీని తీర్చిదిద్దాలని సీఎం జగన్‌ ఆదేవించారు. కొప్పర్తి ఈఎంసీ ద్వారా 30 వేల మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యం కావాలన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top