ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును ప్రారంభించిన సీఎం జగన్

CM YS Jagan Mohan Reddy Kurnool Tour To Inaugurate Orvakal Airport - Sakshi

సాక్షి, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించిన కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి పి హర్‌దీప్‌సింగ్‌కు కూడా ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్, కేంద్రమంత్రితో కలిసి‌‌ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ముందుగా సీఎం జగన్‌ జాతీయ జెండాను, ఆ తర్వాత దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. కర్నూలుకు రోడ్డు, రైలు మార్గంలోనే ప్రయాణం ఉండేదని, ఇక నుంచి విమాన ప్రయాణం కూడా జరగబోతోందని సీఎం జగన్‌ తెలిపారు. ఈనెల 28 నుంచి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని చెప్పారు. ప్రారంభంలో బెంగళూరు, చెన్నై, విశాఖకు విమానాలు అందుబాటులో ఉంటాయిని తెలిపారు. ఓర్వకల్లుతో రాష్ట్రంలో ఆరో ఎయిర్‌పోర్టు ప్రారంభమవుతోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు రిబ్బన్‌ కటింగ్‌తో హడావుడి చేసిందని, రూ.110 కోట్లు ఖర్చు చేసి కేవలం ఏడాదిన్నరలోనే పనులు పూర్తి చేశామని సీఎం జగన్‌ తెలిపారు. అధునాతన అగ్నిమాపక కూడా అందుబాటులో ఉంటుందని, ఈ గడ్డ నుంచే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వచ్చారని తెలిపారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును సీఎం జగన్‌ ప్రకటించారు.

ఇండిగో సంస్థ ఈనెల 28 నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు కర్నూలు నుంచి సర్వీసులు నడపనుంది. 1,008 ఎకరాల్లో రూ.153 కోట్లతో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి చేశారు. విమాన సర్వీసులు ప్రాంభించడానికి డీజీసీఏ ఈ ఏడాది జనవరి 15న లైసెన్స్‌ జారీ చేయగా.. బీసీఏఎస్‌ సెక్యూర్టీ క్లియరెన్స్‌ జనవరి 27న మంజూరైంది. 2,000 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పులో ఇక్కడి రన్‌వేను అభివృద్ధి చేశారు. నాలుగు విమానాలకు పార్కింగ్‌తో పాటు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top