విద్యార్థులకు అన్యాయం జరగరాదు

CM YS Jagan Discuss On DIET CET Students Admission Issue In AP Cabinet Meeting - Sakshi

డైట్‌ విద్యార్థుల భవితవ్యంపై మంత్రివర్గ సమావేశంలో చర్చ

యాజమాన్యాల తప్పునకు విద్యార్థులను శిక్షించకూడదన్న సీఎం

నిబంధనలు ఉల్లంఘిస్తే అనుమతి రద్దు చేయాలని ఆదేశం

సాక్షి, అమరావతి: డైట్‌సెట్‌ రాయకుండా డైట్‌ కళాశాలల్లో అడ్మిషన్‌ తీసుకుని విద్యనభ్యసించిన విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. డైట్‌సెట్‌ ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించని విద్యార్థులు, అసలు పరీక్షకే హాజరు కాని విద్యార్థులను సైతం ప్రైవేటు డైట్‌ కళాశాలల యాజమాన్యాలు చేర్పించుకున్నాయి. అలా చేరిన వేలాది మంది విద్యార్థులను ప్రస్తుతం కోర్సు పూర్తయ్యాక పరీక్షలకు అనుమతించని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఇదే అంశం గురువారం మంత్రివర్గ సమావేశంలో అధికారిక అజెండా ముగిశాక మంత్రుల మధ్య చర్చకు వచ్చింది. ముఖ్యమంత్రి వద్ద ఓ మంత్రి ఈ విషయం ప్రస్తావించగా యాజమాన్యాలు చేసిన పనికి విద్యార్థులను శిక్షించరాదని జగన్‌ అభిప్రాయపడినట్లు సమాచారం. అక్రమంగా విద్యార్థులను చేర్చుకున్న యాజమాన్యాలపై నిఘా పెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో విద్యార్థులకు నష్టం జరక్కుండా ఈ ఏడాదికి చూడాలని ముఖ్యమంత్రి అన్నారని తెలిసింది. నిబంధనలను ఉల్లంఘించి యాజమాన్యం కోటాలో అర్హత లేని విద్యార్థులను చేర్చుకున్న కళాశాలల అనుమతి రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన అన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

నవంబర్‌ 24 తర్వాత అసెంబ్లీ?
అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే తేదీల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిసింది. రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్‌ సమావేశాలు గత జూన్‌లో జరిగాయి. ఆరు నెలలలోపు అంటే ఈ ఏడాది డిసెంబర్‌ 14వ తేదీలోపు మళ్లీ సమావేశాలు నిబంధనల ప్రకారం జరగాల్సి ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని నవంబర్‌ 24వ తేదీ తర్వాత నిర్వహించే విషయం పరిశీలించాలని, ఆ మేరకు తేదీలను ఖరారు చేసే బాధ్యతను ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి అప్పగించినట్లు సమాచారం. రాష్ట్రంలో కోవిడ్‌–19 ముప్పు తీవ్ర స్థాయిలోనే ఉన్నందున, ఆ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని తేదీలను ఖరారు చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలున్నట్లు చెబుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top