అక్కచెల్లెమ్మలకు అన్ని విధాలా భరోసా

CM YS Jagan Comments In YSR Asara Scheme Launch Event - Sakshi

వైఎస్సార్‌ ఆసరా ప్రారంభ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌

పిల్లల ఉన్నత చదువులకు అండగా ఉంటాం

మద్య నియంత్రణ దిశగా పలు చర్యలు

అక్కచెల్లెమ్మల పేరు మీద 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సంకల్పించాం

గిట్టని వారు భయంతో కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బందులు కల్పిస్తున్నారు0

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు ఈ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు పొదుపు సంఘాల మహిళల అప్పులను నాలుగు దశల్లో తీర్చే వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లోని లబ్ధిదారులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. 

ఉన్నత చదువే భవిష్యత్‌ ఆస్తి
► ఇంటర్‌ తర్వాత ఏ ఒక్కరూ మధ్యలో చదువు ఆపకూడదని, అప్పుడే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయట పడతాయని భావిస్తూ జగనన్న విద్యా దీవెన పథకం అమలు చేస్తున్నాం. ఇందులో భాగంగా గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తం çరూ.1,880 కోట్లు చెల్లించడంతో పాటు, దాదాపు రూ.4,200 కోట్లు నేరుగా అక్క చెల్లెమ్మలు, కాలేజీలకు ఇచ్చాం. ఈ ఏడాది నుంచి ఆ ఫీజు మొత్తం అక్క చెల్లెమ్మలకే ఇస్తాం. 
► ఐటీఐ, ఇంజనీరింగ్, మెడిసిన్, ఇతర డిగ్రీ కోర్సులు చదివే పిల్లలకు హాస్టల్‌ ఖర్చుల కింద ఆర్థిక సహాయం కోసం దాదాపు రూ.1,221 కోట్లు వ్యయం చేశాం. ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశ పెట్టడంతో పాటు, నాడు–నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నాం. 

సీఎంతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న వివిధ జిల్లాల లబ్ధిదారులు, అధికారులు, ప్రజాప్రతినిధులు 

అన్నింటిలో సగం..
► దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం, నామినేషన్‌ విధానంలో ఇచ్చే పనుల్లో 50 శాతం మహిళలకు ఇస్తున్నాం.
► కాపు మహిళలకు ‘కాపు నేస్తం’ ద్వారా ఐదేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సహాయం చేస్తాం. తొలి ఏడాది ఇప్పటికే రూ.15 వేలు ఇచ్చాం.  
► దేశంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడానికి సిద్ధమయ్యాం. అయితే గిట్టని వారు కొందరు తమ పునాదులు కదులతాయనే భయంతో కోర్టులకు వెళ్లడంతో ఆగిపోయింది. దేవుడి దయతో త్వరలోనే పంపిణీ చేస్తాం.
► ఒంటరి మహిళలు, వితంతువులతో పాటు, 60 ఏళ్లు దాటిన ప్రతి అవ్వకు మంచి జరగాలన్న ఉద్దేశంతో పెన్షన్లు ఇస్తున్నాం. గతంలో వారికి రూ.1000 కూడా ఇవ్వలేదు. ఎన్నికల ముందు 44 లక్షల మందికి పెన్షన్‌ ఇస్తే, ఇప్పుడు 60 లక్షల మందికి రూ.2,250 ప్రతి నెలా 1వ తేదీ వారి ఇంటి వద్దే ఇస్తున్నాం. ఇందుకు నెలకు రూ.1500 కోట్లు ఖర్చు చేస్తున్నాం.  
► పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కోసం రూ.1400 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశాం. ఈ పథకాన్ని నిరాటంకంగా కొనసాగిస్తాం.

దిశ చట్టం, మద్యం నియంత్రణ
► మహిళలపై అత్యాచారం చేస్తే, కఠిన చర్యలు తీసుకునే విధంగా దిశ చట్టం తెచ్చాము. 7 పని దినాల్లోనే పోలీసు దర్యాప్తు.. రెండు వారాల్లో న్యాయ విచారణ.. 21 పనిదినాల్లో మరణశిక్ష పడేలా చట్టం చేశాం. 
► అయితే ఈ అంశం ఉమ్మడి జాబితాలో ఉండడంతో, అది ఇప్పుడు కేంద్రం పరిశీలనలో ఉంది. దిశ పోలీస్‌ స్టేషన్లు, దిశ యాప్‌ వల్ల ఎంతో మేలు కలుగుతోంది. 
► మద్యం నియంత్రణలో భాగంగా షాక్‌ కొట్టేలా ధరలు పెంచడంతో పాటు, 43 వేల బెల్టు షాపులు, 4,300 పర్మిట్‌రూమ్‌లను రద్దు చేశాం. మొత్తం మీద 33 శాతం మద్యం దుకాణాలు తగ్గించాం. ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం విక్రయాలు జరిగేలా వేళలు కుదించాం.
► 3 కోట్ల మంది అక్క చెల్లెమ్మలు, అవ్వలు, అమ్మల కోసం.. వారి బిడ్డల భవిష్యత్తు కోసం దేవుడి దయ, అందరి ఆశీస్సులతో ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నాను. 
► ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, పినిపె విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కొడాలి నాని, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్‌కే రోజా, ఎమ్మెల్యే విడదల రజని, సీఎస్‌ నీలం సాహ్ని, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

గర్వంగా ఉంది 
ఎందరో సీఎంలను చూశాను. వారితో కలిసి పని చేశాను. మీ నాన్నగారితో కూడా కలిసి పని చేశాను. ప్రజలందరి కోసం ఆయన ఎన్నో మంచి పనులు చేశారు. అందుకే ఆయన మరణించినా ఇవాళ్టికీ చిరంజీవిగా అందరి మదిలో ఉన్నారు. మీరు నవరత్నాలు ప్రకటించారు. ప్రతి ఒక్కటి అమలు చేశారు. ఏం చేయాలన్నా మనసు ఉండాలి. ఇవాళ రాజకీయ నాయకుడిగా గౌరవం పొందుతున్నందుకు ఎంతో గర్వంగా ఉంది.  
 – బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ మంత్రి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top