వైఎస్‌ జగన్‌: అన్ని ఆస్పత్రుల్లో ఉన్నత ప్రమాణాలు | YS Jagan Review Meeting on Preventive Measures of Covid-19 - Sakshi
Sakshi News home page

అన్ని ఆస్పత్రుల్లో ఉన్నత ప్రమాణాలు

Sep 19 2020 3:37 AM | Updated on Sep 19 2020 4:38 PM

CM YS Jagan Comments In High Level Review On Covid‌-19 Preventive Measures - Sakshi

ప్రతి ఆరోగ్యశ్రీ ఆస్పత్రికి గ్రేడింగ్‌ తప్పనిసరి. అక్కడ సదుపాయాలు, సేవల ఆధారంగా వాటి నిర్ధారణ జరుగుతుంది. అన్ని ఆస్పత్రులు ఏ–కేటగిరీలోకి రావాలి. ఇందుకోసం 6 నెలల సమయం ఇవ్వాలి. ఆలోగా అవి ప్రమాణాలు పెంచుకోకపోతే జాబితా నుంచి తొలగించే అంశం పరిశీలించాలి. అన్ని ఏ–కేటగిరీ ఆస్పత్రులు ఏడాదిలోగా ఎన్‌ఏబీహెచ్‌ గుర్తింపు పొందాలి.    

హోం ఐసొలేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా కిట్లు ఇవ్వాలి. ఆ మేరకు అధికారులు పక్కాగా పర్యవేక్షించాలి. కరోనా వైద్య సేవలు అందించడంలో ఎక్కడా లోటు ఉండకూడదు. అన్ని కోవిడ్‌ ఆస్పత్రుల్లో ప్లాస్మా థెరపీ నిర్వహించాలి. ఆ దాతలను ప్రోత్సహించే విధంగా రూ.5 వేలు ఇవ్వాలి.  
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కోవిడ్‌ ఆస్పత్రులతో సహా అన్ని ఆస్పత్రుల్లో ప్రమాణాలు మరింతగా పెరగాలని, తద్వారా మంచి గ్రేడింగ్‌ వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఐవీఆర్‌ఎస్‌లో అడిగే ప్రశ్నలు ఇంకా స్పష్టతతో ఉండాలని, ముఖ్యంగా వైద్య సేవలు, శానిటేషన్‌పై పూర్తి వివరాలు ఆరా తీయాలని సూచించారు. ఆ మేరకు ప్రశ్నలు మార్చాలని నిర్దేశించారు. కోవిడ్‌–19 నివారణ చర్యలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. 
కోవిడ్‌–19 నివారణ చర్యలపై ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. చిత్రంలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ భాస్కర్‌ తదితరులు 

ఆస్పత్రులు, ప్రమాణాలు 
► ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటు, ఆహారం, శానిటేషన్, యాంబియెన్స్‌ (ఆస్పత్రి చూడగానే చక్కగా ఉండేలా) బాగా ఉండేలా చూడాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా అవే ప్రమాణాలు ఉండాలి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ పరిధిలో ఉన్న ఆస్పత్రులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నాం. అందువల్ల ప్రమాణాలపై రాజీ పడం.  
► రాష్ట్రంలో ఇప్పుడున్న 11 టీచింగ్‌ ఆస్పత్రులతో పాటు, కొత్తగా ఏర్పాటు కానున్న 16 ఆస్పత్రులు, ఐటీడీఏల పరిధిలో ఏర్పాటవుతున్న ఆస్పత్రులలో తప్పనిసరిగా ప్రమాణాలు ఉండేలా చూడాలి.  అన్ని ఆస్పత్రుల్లో మంజూరు చేసిన పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.  
► ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఆరోగ్య ఆసరా కింద సాధారణ కాన్పుకు ఇక నుంచి రూ.5 వేలు, అదే విధంగా సిజేరియన్‌ కాన్పుకు రూ.3 వేలు ఇవ్వాలి.  
► మెగా వైద్య శిబిరాలు నిర్వహించాలి. ప్రతి నియోజకవర్గంలో ఆ శిబిరాలు ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత వైద్య సదుపాయాల కల్పనపై ఎస్‌ఓపీ రూపొందించాలి.  

రెండు వారాల్లో అన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలు 
► భవిష్యత్తులో విలేజ్‌ క్లినిక్‌లు ఆరోగ్యశ్రీకి రెఫరల్‌గా ఉంటాయి. ఆ తర్వాత కోవలో పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్‌ ఆస్పత్రులు రెఫరల్‌గా ఉంటాయి. ఆరోగ్య మిత్రకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆస్పత్రి బయట, లోపల తప్పనిసరిగా ప్రదర్శించాలి. రెండు వారాల్లోగా అన్ని ఆస్పత్రులలో వారి నియామకాలు పూర్తి కావాలి.  
► రాష్ట్రంలోని అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో వెంటనే ఆరోగ్య మిత్రల (హెల్ప్‌ డెస్క్‌)ను ఏర్పాటు చేయాలి. వీరు ప్రధానంగా ఆస్పత్రిలో వైద్య మౌలిక సదుపాయాలు, వైద్యుల అందుబాటు, ఆహారంలో నాణ్యత, శానిటేషన్, వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా అందజేయడం, పేషెంట్‌ కేరింగ్‌.. వంటి 6 బాధ్యతలను నిర్వర్తించాలి. 
► ఏదైనా ఆస్పత్రిలో రోగికి అవసరమైన వైద్య సదుపాయం లేకపోతే అంబులెన్స్‌ ఏర్పాటు చేసి.. ఆ సేవ అందించే ఆస్పత్రికి పంపించాలి. 
► జిల్లా స్థాయిలో ఆరోగ్యశీ పథకం సమన్వయ బాధ్యతలను ఇక నుంచి ఒక జేసీకి అప్పగించాలి. 

ఆరోగ్యశ్రీ కార్డులు 
► ఆరోగ్యశ్రీ క్యూఆర్‌ కోడ్‌ కార్డులతో పాటు, యాప్‌పై సమావేశంలో అధికారులు వివరించారు. ఆ కార్డులో రోగి బ్లడ్‌ గ్రూప్‌ సమాచారం కూడా ఉండాలని సీఎం సూచించారు. ఆ కార్డుల పంపిణీలో గ్రామ సచివాలయాల సేవలు వినియోగించుకోవాలన్నారు.  
► రాష్ట్రంలోని 540 ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో ఇప్పటికే హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు కాగా, మిగిలిన 27 ఆస్పత్రుల్లో కూడా త్వరలో ఏర్పాటు కానున్నాయని అధికారులు వివరించారు.  
► సమీక్షలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ భాస్కర్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement