దీర్ఘకాలం నాణ్యంగా ఉండాలి | CM Jagan Orders Officials On Ambedkar Statue At Vijayawada Swaraj Maidan | Sakshi
Sakshi News home page

దీర్ఘకాలం నాణ్యంగా ఉండాలి

Nov 4 2020 4:20 AM | Updated on Nov 4 2020 4:20 AM

CM Jagan Orders Officials On Ambedkar Statue At Vijayawada Swaraj Maidan - Sakshi

విజయవాడ స్వరాజ్‌ మైదాన్‌లో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుపై సమీక్షలో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌లో చూపిన నమూనా

సాక్షి, అమరావతి: విజయవాడ స్వరాజ్‌ మైదాన్‌లో అంబేడ్కర్‌ స్మృతివనంలో ఏర్పాటు చేసే విగ్రహాన్ని దీర్ఘకాలం నాణ్యంగా ఉండేలా రూపొందించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. స్ట్రక్చర్‌లో మెరుపు, కళ తగ్గకుండా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ స్వరాజ్‌ మైదాన్‌లో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుపై సీఎం జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు భారీ అంబేడ్కర్‌ కాంస్య విగ్రహం, స్మృతివనానికి సంబంధించిన రెండు రకాల ప్లాన్లను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సీఎంకు చూపించారు.
క్యాంపు కార్యాలయంలో సమీక్షిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌  

నాగపూర్‌లోని అంబేడ్కర్‌ దీక్ష భూమి, ముంబైలోని చైత్యభూమి, లఖ్‌నవూలోని అంబేడ్కర్‌ మెమోరియల్, నోయిడాలోని ప్రేరణాస్థల్‌లను ఆయనకు చూపారు. గ్యాలరీ, ఆడిటోరియం ఎలా ఉంటుందన్న దానిపైనా ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అంబేడ్కర్‌ కాంస్య విగ్రహం తయారీకి 14 నెలలు పడుతుందని, ఈ నేపథ్యంలో విగ్రహం, స్మృతివనం పనులను డిసెంబర్‌లో మొదలుపెట్టి 14 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. 2022 ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి రోజున విగ్రహావిష్కరణ, స్మృతివనం ప్రారంభించాలని నిర్ణయించారు. స్మృతివనం వద్ద కన్వెన్షన్‌ సెంటర్, పబ్లిక్‌ గార్డెన్, ధ్యాన స్థూపం, బౌద్ధ శిల్పాల ఏర్పాటుతోపాటు రెస్టారెంట్, లాబీ, ధ్యాన కేంద్రం, చి్రల్డన్‌ ప్లే ఏరియా, వాకర్స్‌ ట్రాక్, ఫౌంటెయిన్స్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు.

‘‘ల్యాండ్‌స్కేప్‌లో గ్రీనరీ బాగా ఉండాలి. అది ఏమాత్రం చెడిపోకుండా చూడాలి. అంబేడ్కర్‌ స్మృతివనం వద్ద లైబ్రరీ, మ్యూజియం, గ్యాలరీ ఏర్పాటుతోపాటు ఆయన జీవిత విశేషాలు ప్రదర్శించాలి. అలాగే అంబేడ్కర్‌ సూక్తులను కూడా ప్రదర్శించాలి. పార్కు వద్ద రహదారిని విస్తరించి, ఫుట్‌పాత్‌ను అభివృద్ధి చేయాలి. రెండింటినీ ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి’’ అని సీఎం ఆదేశించారు. సమీక్షలో మంత్రి మేకపాటి, సీఎస్‌ నీలం సాహ్ని, అధికారులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement