హోంమంత్రి అమిత్ షాకు సీఎం జగన్‌ లేఖ‌

CM Jagan Letter To Home Minister Amit Shah On Floods - Sakshi

సాక్షి, అమరావతి : భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. వరద బాధితులను ఆదుకునేందుకు, నష్ట నివారణ చర్యలకు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.4450 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని, తక్షణ సాయంగా రూ.1000 కోట్లు మంజూరు చేయాలని కోరారు. అంతేకాకుండా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని ఏపీకి పంపాలని శనివారం రాసిన లేఖ ద్వారా సీఎం విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని వరదలు ముందచెత్తడంతో తీవ్రంగా నష్టపోయామని అమిత్‌ షా దృష్టికి తీసుకుపోయారు.

కేంద్ర హోం మంత్రికి సీఎం రాసిన లేఖలోని ముఖ్యాంశాలు:

  • బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయు గుండం కారణంగా రాష్ట్రంలో ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు భారీ వర్షాలు కురిశాయి.
  • ఒక్క 13వ తేదీనే తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరంలో అత్యధికంగా 265.10 మి.మీ వర్షపాతం నమోదు కాగా, అదే జిల్లాలోని కాట్రేనికోనలో 228.20 మి.మీ, తాళ్లరేవులో 200.50 మి.మీ, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో 205.30 మి.మీ, పేరవల్లిలో 204.02 మి.మీ వర్షం కురిసింది.
  • ఎగువన తెలంగాణ, మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురవడంతో కృష్ణా నదికి వరద పొటెత్తింది.
  • దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీతో సహా, పలు చోట్ల గత మూడు రోజులుగా తీవ్ర ప్రమాద హెచ్చరికలు జారీ చేసి, లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు (సహాయ శిబిరాలకు) తరలించాము
  • భారీ వర్షాలు, వరదలతో జన జీవితం అస్తవ్యస్తమైంది.
  • గత ఆగస్టు, సెప్టెంబరులోనూ భారీ వర్షాలు కురవడం, ఇప్పుడు సంభవించిన వరదలతో నష్టం మరింత పెరిగింది.
  • వరసగా కురిసిన వర్షాలు రాష్ట్రంలో రహదారులను తీవ్రంగా దెబ్బతీశాయి. పలు చోట్ల చెరువులు, కాల్వలకు గండ్లు పడ్డాయి. విద్యుత్‌ ఉత్పత్తిపైనా వర్షాలు ప్రభావం చూపాయి.
  • ఎక్కడికక్కడ వాగులు ఉప్పొంగడంతో రవాణా వ్యవస్థ కూడా నిల్చిపోయింది.
  • ఈ వర్షాల వల్ల రైతులు కూడా చాలా నష్టపోయారు. ముఖ్యంగా చేతికొచ్చే దశలో ఉన్న వరి, పత్తి, మొక్కజొన్న, చెరకు పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. అదే విధంగా కూరగాయలు, అరటి, బొప్పాయి తోటలు కూడా దారుణంగా దెబ్బ తిన్నాయి.
  • వరద సహాయ కార్యక్రమాల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది నిర్విరామంగా పని చేసినప్పటికీ, 14 మంది చనిపోయారు.
  •  వివిధ శాఖల ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు రూ.4450 కోట్ల మేర నష్టం జరిగింది.
  • ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం అండగా నిలవాల్సి ఉంది.
  • పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టి, తిరిగి సాధారణ పరిస్థితికి తీసుకు రావడం కోసం తక్షణమే ముందస్తుగా కనీసం రూ.1000 కోట్లు మంజూరు చేయాలి.
  • అదే విధంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడం కోసం వెంటనే కేంద్ర బృందాన్ని పంపించాలి.
  • ఇప్పటికే కోవిడ్‌–19తో ఆర్థికంగా నష్టపోయి ఉన్న రాష్ట్రంలో, ఇప్పుడు ఈ వర్షాలు, వరదలు పరిస్థితిని మరింత దారుణంగా మార్చాయి.
  • కాబట్టి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు మీ అండ, చేయూత ఎంతో అవసరమని విజ్ఞప్తి చేస్తున్నాను.. అని లేఖలో కోరారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top