రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్‌.. పునఃభిక్ష పెట్టింది వైఎస్‌ జగన్‌ 

CM Jagan Has Given Political Re Birth Says Tammineni Seetharam - Sakshi

సాక్షి, అమరావతి: ‘నాకు ఆనాడు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు. మళ్లీ రాజకీయంగా పునఃభిక్ష పెట్టింది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి..’ అని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం చెప్పారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు తానే రాజకీయ భిక్ష పెట్టానని చంద్రబాబు శాసనసభలో శుక్రవారం వ్యాఖ్యానించారు. దీనిపై శుక్రవారం సభను వాయిదా వేసేముందు స్పీకర్‌ తమ్మినేని సీతారాం స్పందించారు. ‘నాకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు కాదు. నేను టీడీపీలో చేరేనాటికి చంద్రబాబు ఆ పార్టీలో లేరు. కాంగ్రెస్‌లో ఉన్నారు. ఎన్టీ రామారావు పిలిచి నన్ను పార్టీలోకి ఆహ్వానించి ప్రజాప్రతినిధిని చేశారు. ఆ తరువాత చంద్రబాబు టీడీపీలో చేరారు.

ఆయనకు కూడా ఎన్టీ రామారావే రాజకీయ భిక్ష పెట్టారు’ అని చెప్పారు. ఆ తరువాత వివిధ అంశాలపై విభేదించి తాను టీడీపీ నుంచి బయటకు వచ్చేశానన్నారు. తాను వరుసగా ఎన్నికల్లో ఓడిపోయి 15 ఏళ్లు రాజకీయంగా వెనుకబడి ఉన్నప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనను పిలిపించి పార్టీలో చేరాలని ఆహ్వానించడంతో ఆయన సూచనల మేరకు వైఎస్‌ విజయమ్మ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరానన్నారు. మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించి స్పీకర్‌గా అత్యున్నత స్థానానికి చేరుకున్నానన్నారు. కాబట్టి తనకు రాజకీయంగా పునర్జన్మనిచ్చింది     వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని చెప్పారు.  సభాపతి స్థానంలో ఉన్న తనను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు కాబట్టే  వాస్తవాలపై సభలోనే వివరణ ఇస్తున్నానని స్పీకర్‌ చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top