సీఎం జగన్‌ కీలక ప్రకటన.. సెప్టెంబర్‌ నుంచి విశాఖ నుంచే పాలన

Cm Jagan Announced Will Rule From Visakha From September - Sakshi

సాక్షి, శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళం పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్‌ నుంచి విశాఖ నుంచే పాలన సాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సెప్టెంబర్‌ నుంచి విశాఖలోనే ఉంటానని వెల్లడించారు. రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్య నగరం విశాఖ అని సీఎం అన్నారు.

‘‘మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. అంతా ఏకమై నాతో చీకటి యుద్దం చేస్తున్నారు. రాష్ట్రంలో పెత్తందార్లు, పేదల పక్షాన నిలబడిన నాకు మధ్య యుద్ధం జరుగుతోంది. ఒకే అబద్ధాన్ని పదేపదే చెబుతున్నారు. వాళ్లలా అబద్ధాలు చెప్పే అలవాటు నాకు లేదు. ఈ యుద్ధంలో నా ధైర్యం, నమ్మకం, ఆత్మ విశ్వాసం మీరే. దేవుని దయ.. మీ చల్లని ఆశీస్సులే కోరుకున్నా. తోడేళ్లనీ ఏకమైనా నాకేమీ భయం లేదు’’ అని సీఎం పేర్కొన్నారు.

‘‘ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలనే అని జిల్లాల అభివృద్ధి. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నదే తపన. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే.. మీ బిడ్డకు మీరే తోడుగా నిలవండి. మీ బిడ్డకు మీరే సైనికులుగా కదలండి’’ అంటూ సీఎం పిలుపునిచ్చారు.

మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్ట్‌ నిర్మాణం, నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి సీఎం జగన్‌ బుధవారం శంకుస్థాపన చేశారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్‌ సహా హిర మండలం వంశధార లిప్ట్‌ లిరిగేషన్‌ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

‘‘పోర్టుల ద్వారా జిల్లా అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది. పోర్టులకు అవకాశం ఉన్నా దశాబ్ధాలుగా పట్టించుకోలేదు. శ్రీకాకుళం జిల్లా భవిష్యత్ లో మహానగరంగా ఎదగాలి. మూలపేట మూలన ఉన్న పేటకాదు.. అభివృద్ధికి మూలస్తంభం. రాబోయే రోజుల్లో శ్రీకాకుళం జిల్లా ముఖచిత్రం మారుతుంది. మూలపేట పోర్టు పూర్తయితే దాదాపు 35 వేల మందికి ఉపాధి లభిస్తుంది. పోర్టు వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం. భవిష్యత్ లో శ్రీకాకుళం మరో ముంబై, మద్రాస్ కాబోతుంది’’ అని సీఎం అన్నారు.
చదవండి: ‘జగన్‌బాబు దేవుడయ్యా.. మాలాంటి ముసలోళ్ల కడుపులు నింపుతున్నాడు’

‘‘పోర్టు సామర్ధ్యం 100 మిలియన్ టన్నులకు పెరగనుంది. గంగపుత్రుల కళ్లలో కాంతులు నింపడానికే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. గంగపుత్రుల వేరే ప్రాంతాలకు వలసలు పోకుండా ఉండేందుకు కృషి. పోర్టుతోపాటు మరో రెండు ఫిషింగ్ హార్బర్ల  నిర్మాణం. బుడగట్లపాలెం తీరంలో రూ.365 కోట్లతో ఫిషింగ్ హార్బర్‌. మన అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 4 పోర్టులకు శ్రీకారం చుట్టాం. బుడగట్లపాలెం తీరంలో రూ.365 కోట్లతో ఫిషింగ్ హార్బర్‌. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 4 పోర్టులకు శ్రీకారం చుట్టాం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top