
పోలవరం ఎత్తు తగ్గింపుపై మౌనం
మిర్చి రైతుకు మద్దతు ధర ఇప్పించడంలో విఫలం
ఏడాదిలో 20 సార్లు దేశ రాజధానికి సీఎం–అభివృద్ధి పేరుతో అప్పులు అడగడానికే..!
సాక్షి, న్యూఢిల్లీ: సరిగ్గా ఏడాది కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 20 సార్లు ఢిల్లీకి వచ్చారు. ప్రతిసారీ అభివృద్ధే అజెండా అంటూ ప్రచారం చేసుకుంటున్నా.. కొత్త అప్పులకు మద్దతు కోరడమే లక్ష్యంగా ఆయన పర్యటనలు సాగాయి. ఈ మేరకు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ పెద్దలను కలుస్తూ వచ్చారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిని ధ్వంసం చేసిందని విమర్శిస్తూ.. ఆ వంకతో కేంద్రం మద్దతుతో రూ.కోట్లు అప్పులు తెచ్చారు. అమరావతి పేరుతో ఇప్పటివరకు రూ.31 వేల కోట్లు తీసుకోవడం గమనార్హం. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నుంచి రూ.15 వేల కోట్లు పొందారు. ఇవికాక బడ్జెటేతర అప్పులు రూ.19,410 కోట్లు. ఏడాదిలో భారీగా అప్పు చేయడంలోనే చంద్రబాబు తన మార్క్ చూపారు. ఇకప్రతిసారీ చంద్రబాబు ప్రత్యేక విమానంలోనే ఢిల్లీ వచ్చారు. దాదాపు 15–17 సార్లు రెండు రోజుల పాటు మకాం వేశారు.
ఐదుసార్లు ప్రధాని మోదీని, ఆరుసార్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను, ఐదుసార్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. పోలవరం ఎత్తు 41.15 మీటర్లకు తగ్గిస్తున్నట్లు కేంద్రం పేర్కొన్నా.. చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఎన్‌డీఏ నేతలు ఎవరూ నోరు మెదపలేదు. పైగా దీనిని వ్యతిరేకించిన వైఎస్సార్‌సీపీ ఎంపీలపై కూటమి ఎంపీలు పార్లమెంట్‌లో వ్యక్తిగత దూషణలకు దిగారు. ఎత్తు తగ్గిస్తున్నట్లు కేంద్రం స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొందని మీడియా ప్రశ్నించినా... కూటమి నేతల నుంచి సమాధానం రాలేదు.
మిర్చి రైతులకు మద్దతు ధర కల్పించడంలోనూ చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారు. ఈ విషయంలో ఒక్కోసారి ఒక్కోలా స్పందించారు. క్వింటాకు రూ.11,600 ఇవ్వాలని కేంద్రాన్ని కోరగా... రూ.10,025 కంటే రూపాయి కూడా ఎక్కువ ఇచ్చేది లేదని కేంద్రానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) తేల్చి చెప్పింది. అయినా మిర్చికి మద్దతు ధర లభించిందని, కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. ఏపీలో రేటు పెంచితే దేశం మొత్తం పెంచాల్సి వస్తుందని కేంద్రం చెప్పడంతో... చంద్రబాబు మళ్లీ ఈ విషయం ప్రస్తావించకపోవడం గమనార్హం. ఈ దోబూచులాటల కారణంగా మిర్చి రైతులకు రూ.8,827 కోట్లు నష్టం వాటిల్లింది.
సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల సమయంలో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆపై యూటర్న్ తీసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన సీఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తల ద్వారానే సంపద సృష్టి జరుగుతుందని, వారు పెట్టుబడులు పెడితే తద్వారా వచ్చిన ఆదాయంతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించొచ్చు అని చెప్పుకొచ్చారు.