
దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖ విమానాశ్రయంలో మంత్రులపై దాడి ఘటన సమయంలో బందోబస్తు కల్పనలోను, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పర్యటనలో విధుల నిర్వహణలోనూ విఫలమైన కారణంగా వెస్ట్ డివిజన్ ఏసీపీ టేకు మోహనరావు, అప్పటి ఎయిర్‌పోర్ట్ సీఐ సీహెచ్ ఉమాకాంత్‌లను నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ సస్పెండ్ చేశారు.
గత నెల 15న విమానాశ్రయం వద్ద మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్ల మీద జనసేన కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మంత్రి రోజా వ్యక్తిగత సహాయకుడి తలకు తీవ్ర గాయమైంది. ఘటనలో ఇప్పటికే సుమారు 100 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మరో 80 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. గత నెల 15వ తేదీన పవన్ విశాఖ పర్యటనకు వస్తున్న సందర్భంలో జనసేన కార్యకర్తలు ఎయిర్‌పోర్టులో రచ్చ రచ్చ చేశారు.
పవన్‌కళ్యాణ్ విమానంలో సాయంత్రం 4.30 గంటలకు రాగా.. కార్యకర్తలు మాత్రం మధ్యాహ్నం ఒంటిగంటకే పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకుని హంగామా చేశారు. ఎయిర్‌పోర్టు వద్ద ఉన్న హోర్డింగ్స్ పైకెక్కి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నా పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు.
ఆ రోజున విశాఖ గర్జన ర్యాలీ ముగించుకుని మంత్రులు ఎయిర్‌పోర్టుకు వస్తున్న విషయం తెలిసినప్పటికీ వారికి బందోబస్తు కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపించాయి. దీంతో మంత్రులకు భద్రత, పవన్ పర్యటనకు బందోబస్తు చూసుకోవాల్సిన ఏసీపీ, సీఐలు విఫలమయ్యారని సీపీ వారిపై చర్యలు తీసుకున్నారు. ఎయిర్‌పోర్ట్ పోలీస్‌స్టేషన్ సీఐ ఉమాకాంత్‌ను గత నెల 18నే అక్కడి నుంచి బదిలీ చేసి రేంజ్‌కు సరెండర్ చేశారు.