
సాక్షి, పల్నాడు: ఏపీలో బర్డ్‌ఫ్లూ (హెచ్5ఎన్1) వైరస్ కారణంగా ఓ చిన్నారి చనిపోయింది. ఈ విషాదకర ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. బర్డ్‌ఫ్లూ కారణంగానే చిన్నారి మరణించినట్లు భారత వైద్య పరిశోధన మండలి నిర్ధారించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది.
వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి చనిపోయిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. నరసరావుపేటకు చెందిన చిన్నారిని జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పలు ఆరోగ్య సమస్యలు రావడంతో మార్చి నాలుగో తేదీన మంగళగిరిలోని ఎయిమ్స్‌కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో వైద్యులు బాలికకు ఆక్సిజన్ సాయంతో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. దీంతో, మార్చి 16న సదరు చిన్నారి మృతిచెందింది.
అయితే, చికిత్స అందించే సమయంలో మార్చి 7న పాప గొంతు, ముక్కు నుంచి తీసిన స్వాబ్ నమూనాలను ఎయిమ్స్‌లోని వీఆర్‌డీఎల్‌లో పరీక్షించారు. ఈ పరీక్షలో ఇన్‌ఫ్లుయెంజా ఏ పాజిటివ్‌గా తేలింది. అనంతరం మరో నమూనాను 15న ఢిల్లీలో పరీక్షించారు. అక్కడ నివేదిక అనుమానాస్పదంగా రావడంతో అప్రమత్తమైన ఐసీఎంఆర్.. 24న స్వాబ్ నమూనాలను పుణెలోని ఎన్‌ఐవీ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ)కి పంపించింది. అక్కడ హెచ్5ఎన్1 వైరస్‌గా నిర్ధారించారు. పచ్చి కోడి మాంసం తినే అలవాటుతో పాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం చిన్నారి మరణానికి దారితీసిందని వైద్యులు గుర్తించారు.
చిన్నారి మృతి నేపథ్యంలో ఏం జరిగిందనే విషయాన్ని కుటుంబ సభ్యులను అడిగి వైద్యాధికారులు తెలుసుకున్నారు. ఈ క్రమంలో సదరు చిన్నారి.. ఫిబ్రవరి 28న జ్వర లక్షణాలు కన్పించగా, అంతకు రెండు రోజుల ముందు పచ్చి కోడి మాంసం పట్టుకున్నట్టు, కొంచెం మాంసం తిన్నట్లు తెలిపారు. ఇక, పల్నాడు జిల్లాలో ఎక్కడా బర్డ్‌ఫ్లూ వైరస్ వ్యాప్తి లేదని పశు సంవర్ధక శాఖ అధికారులు వివరించారు. బాధిత కుటుంబం నివసించే ఇంటికి కిలోమీటరు దూరంలో ఒకరు మాంసం దుకాణం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇదే సమయంలో పెంపుడు, వీధి కుక్కలతో బాలిక తరచూ ఆడుకునేదని వారు చెప్పారు.

ఇదిలా ఉండగా.. బర్డ్‌ఫ్లూ కారణంగా మనుషుల మరణం సంభవించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేసింది. మరోవైపు.. జబ్బు పడిన పక్షులు, పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని వైద్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. జ్వరంతోపాటు జలుబు, తీవ్రస్థాయిలో దగ్గు తదితర లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలని సూచించారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు, పిల్లలను బర్డ్‌ఫ్లూ ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉంచాలని తెలిపారు.