చెవిరెడ్డికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు | Chevireddy bhaskar reddy hospitalised At Vijayawada | Sakshi
Sakshi News home page

చెవిరెడ్డికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

Jun 21 2025 1:33 PM | Updated on Jun 21 2025 3:01 PM

Chevireddy bhaskar reddy hospitalised At Vijayawada

సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం చెవిరెడ్డికి గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో జిల్లా జైలు నుంచి చెవిరెడ్డిని జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. దాదాపు రెండు గంటల పాటు.. పరీక్షలు చేశారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ ఫిజియోథెరపీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం చెవిరెడ్డిని నేరుగా జిల్లా జైలుకు తరలించారు. 

ఇదిలా ఉండగా.. అంతకుముందు.. విజయవాడ కోర్టులో అక్రమ లిక్కర్ కేసుపై వాదనలు ముగిశాయి.  న్యాయవాదితో పాటు స్వయంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. ఆధారాలు లేకుండానే ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెవిరెడ్డితో పాటు ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

ఈ సందర్భంగా.. 2024 ఎన్నికల సమయంలో జగ్గయ్యపేట చిల్లకల్లు టోల్ గేట్ వద్ద 8.40 కోట్లు సీజ్ చేసిన పోలీసులు.. ఆ డబ్బును ఇప్పుడు లిక్కర్ డబ్బుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చిల్లకల్లు టోల్ గేట్ వద్ద పట్టుకున్న డబ్బు తనదేనని అప్పట్లో ప్రద్యుమ్న అనే వ్యక్తి హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. ఈ డబ్బు విషయాన్ని ఎక్కడా ప్రస్తావించొద్దని హైకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాలున్నా లిక్కర్ కేసులో ప్రస్తావించారు. డబ్బులు తరలించామని గన్ మెన్ గిరి ఒప్పుకున్నాడు. అలాంటపుడు అతనే ప్రధాన ముద్దాయి.

ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఇలా డబ్బులు తరలించినందుకు గిరి నేరం చేసినట్లే కదా. ఇటీవల గిరికి ఆక్టోపస్‌లో ప్రమోషన్ ఇచ్చి రూ. 60 వేలు ఎలా పెంచారు. డబ్బులు తరలించిన వ్యక్తి ముద్దాయి అవుతారు కానీ సాక్షి ఎలా అవుతారు?. అతని సాక్ష్యం ఎలా చెల్లుతుంది. మదన్ అనే గన్ మెన్‌ను సిట్ అధికారులు కొడితే మణిపాల్‌లో చేరాడు. సిట్ అధికారులు భయబ్రాంతులకు గురుచేశారని డీజీపీకి లేఖ రాశాడు. గిరి చెప్పినది వాస్తవమా?. మదన్ చెప్పింది వాస్తవమా?

చెవిరెడ్డి గుండెనొప్పిగా ఉందని చెప్పడంతో ఆస్పత్రికి తరలింపు

చెవిరెడ్డికి స్నేహితుడనే కారణంతో వెంకటేష్ నాయుడు ఇరికించారు. చౌదరి సామాజికవర్గానికి చెందిన వాడివి అయ్యుండి చౌదరి ప్రభుత్వానికి సపోర్ట్ చేయవా అని సిట్ అధికారులు బెదిరించారు. రెండు సార్లు వెంకటేష్ నాయుడిని సిట్ విచారించింది. అబద్ధపు సాక్ష్యం చెప్పమని తీవ్రమైన ఒత్తిడి తెచ్చినా వెంకటేష్ నాయుడు అంగీకరించలేదు. ఈ కేసులో అంతా కట్ అండ్ పేస్ట్ తప్పుల తడకగా ఉంది. వెంకటేష్ నాయుడు వృత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి. కానీ వెంకటేష్ నాయుడిని కేసులో ఐఏఎస్‌గా చూపించారు’ అని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement