ముందస్తు బెయిల్‌ ఇవ్వండి | Chandrababu Urgent Lunch Motion Petition in High Court | Sakshi
Sakshi News home page

ముందస్తు బెయిల్‌ ఇవ్వండి

Nov 1 2023 3:40 AM | Updated on Nov 1 2023 7:32 AM

Chandrababu Urgent Lunch Motion Petition in High Court - Sakshi

సాక్షి, అమరావతి: మద్యం కంపెనీలకు అడ్డగోలుగా అనుమతులు మంజూరుకు సంబంధించి సీఐడీ తాజాగా నమోదు చేసిన కేసులో తనకు ముందస్తుగా బెయిల్‌ మంజూరు చేయాలంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు­నాయుడు మంగళవారం హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్‌ దాఖలు చేశారు.

లంచ్‌ మోషన్‌ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ మల్లికార్జునరావు విచారణ జరిపారు. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్‌ ఇస్తే, మరో కేసులో అరెస్టు చేయాలన్న కుట్రతోనే తాజాగా మద్యం కుంభకోణం కేసు నమోదు చేసిందన్నారు.

దీర్ఘకాలం పాటు జైలులోనే ఉంచాలన్న వ్యూహంలో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని ఆయన తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసు నమోదు చేశారన్నారు. స్కిల్‌ కుంభకోణంలోనూ ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఏకపక్షంగా అరెస్టుచేశారని వివరించారు. ఈ కేసులో కూడా అలా అరెస్టుచేస్తారన్న ఆందోళనతోనే ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశామని ఆయన చెప్పారు.

28వరకు అరెస్టు చేయబోం..
అనంతరం.. సీఐడీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ స్పందిస్తూ.. స్కిల్‌ స్కాం కేసులో కంటి శస్త్రచికిత్స నిమిత్తం చంద్రబాబుకు నవంబరు 28 వరకు తాత్కాలిక బెయిల్‌ ఇచ్చిందని, అందువల్ల అప్పటివరకు తాము ఆయనను అరెస్టుచేయబోమని చెప్పారు. ఏజీ చెప్పిన ఈ వివరాలను రికార్డ్‌ చేసిన న్యాయమూర్తి తదుపరి విచారణను నవంబర్‌ 21కి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ తెల్లాప్రగడ మల్లికార్జునరావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

అడ్డగోలుగా అనుమతులతో..
నిజానికి.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా టీడీపీ నేతలకు చెందిన మద్యం కంపెనీలకు అడ్డగో­లుగా అనుమతులు మంజూరుచేశారు. దీనివల్ల ఖజా­నాకు ఏటా రూ.1,300 కోట్ల మేర నష్టం వాటి­ల్లింది. ఈ కుంభకోణంపై ఏపీ బేవరేజస్‌ కార్పొ­రేషన్‌ ఎండీ డి.వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ తాజాగా కేసు నమోదు చేసింది. ఇందులో చంద్రబాబును మూడో నిందితునిగా చేర్చింది. 

Advertisement
 
Advertisement
Advertisement