మూడో బిడ్డకు రూ.30 వేలు.. నాలుగో బిడ్డకు రూ.40 వేలు.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం చంద్రబాబు
ఎక్కువ మంది పిల్లల్ని కంటే వారి బాగోగులు చూసుకుంటానని వెల్లడి
ఒకరిద్దరు పిల్లల పోషణకే అష్టకష్టాలు పడుతున్న సామాన్యులు
నరసన్నపేట/పోలాకి/సారవకోట/టెక్కలి : రాష్ట్రంలో ఎన్నికలప్పుడు చంద్రబాబునాయుడు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలతో పాటు వైఎస్ జగన్ ప్రభుత్వంలో కొనసాగిన పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక చేతులెత్తేశారు. ఒక్కటంటే ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పిన తరుణంలో ఆయా పథకాల బకాయిలు రూ.వేల కోట్లలో పేరుకుపోయాయి. తల్లికి వందనం పథకాన్ని కొందరికే ఇవ్వడంతో పాఠశాలల్లో పిల్లల చేరికలు తక్కువైపోయాయి.
విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల బాట పట్టారు. మధ్యాహ్న భోజనం, విద్యార్థులకు ఇచ్చే కిట్‌లో నాణ్యత కొరవడింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలన్నింటినీ నీరుగార్చేసింది. ప్రజలకు ఏ పథకాలూ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న ఒకరిద్దరు పిల్లల పోషణకే అష్టకష్టాలు పడుతున్నారు. ఈ తరుణంలో ముగ్గురు, నలుగురిని కనాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునివ్వడం విస్తుగొలుపుతోంది. ఒకప్పుడు కుటుంబ నియంత్రణకు కృషి చేశామని, ఇప్పుడు పరిస్థితులు మారినందున ఎక్కువ మంది పిల్లలను కనాలని.. పిల్లల బాగోగులు తాను చూస్తానని తాజాగా సెలవిచ్చారు.
స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు వచ్చారు. నరసన్నపేటలోని పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదికలో మాట్లాడుతూ.. స్త్రీలు సృష్టికర్తలని, ఎంత మందికి వీలైతే అంతమందిని కనాలని అన్నారు. మూడో బిడ్డ పుడితే రూ.30 వేలు, నాలుగో బిడ్డ పుడితే రూ.40 వేలు ప్రభుత్వ పరంగా పురిటి మంచంçపైనే ఇస్తానని చెప్పారు. పనుల కోసం శ్రీకాకుళం వాసులు వలసలకు వెళ్లాల్సిన పని లేకుండా చేస్తానన్నారు. శ్రీకాకుళం జిల్లావాసులు లిటిగెంట్లని పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
జిల్లా అభివృద్ధి కాకపోవడానికి మీరే కారణమంటూ ప్రజలపై నింద వేశారు. ప్రజలు సహకరిస్తే పలాసలో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేస్తానని చెప్పారు. 23 నెలల్లో రూ. 24 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, వీటి ద్వారా 24 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. నెల వారీ పింఛన్, ఇతర సంక్షేమ పథకాల కోసం పన్నులు పెంచాల్సి వస్తుందని చెప్పారు. అన్ని రంగాల్లో ప్రైవేటు పబ్లిక్ పీపుల్ పార్టనర్‌షిప్ (పీపీపీ) అమలు చేస్తామని, దీని ద్వారానే సంపద సృష్టిస్తామని చెప్పారు.
మా భూమిని టీడీపీ ఎమ్మెల్యే వియ్యంకుడు ఆక్రమించారు
సాక్షి, నెట్‌వర్క్: నరసన్నపేటలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి వియ్యంకుడిపై నేరుగా సీఎంకు ఫిర్యాదు చేసేందుకు ఓ మహిళ సిద్ధమైంది. అయితే సీఎంను కలిసేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో ఆవేదనతో వెనుదిరిగారు. పోలాకి మండలం కుసుమపోలవలసకు చెందిన ఆర్మీ జవాను కొయ్యాన లక్ష్మణరావుకు చెందిన దాదాపు 60 సెంట్ల పొలం ఎమ్మెల్యే వియ్యంకుడు భైరి వెంకటరావు కబ్జా చేసి, ఇటీవల నిర్వహించిన రీసర్వేలో రికార్డులు మార్పించుకున్నారని జవాను భార్య భవానీ ఆరోపించారు.
కలెక్టర్‌ను సంప్రదించినా ఫలితం లేదని, ఎమ్మెల్యే రమణమూర్తి దగ్గరకు వెళ్లి ఆయన వియ్యంకుడి తీరుపై ఫిర్యాదు చేస్తే, కోర్టుకు వెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారని తెలిపారు. ఒక ఆర్మీ జవానుకు చెందిన భూమిని ఇలా లాక్కోవడంపై సీఎంకు ఫిర్యాదు చేద్దామని వస్తే దగ్గరకు వెళ్లనివ్వలేదని, న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.


