రూ.పది వేల కోట్ల విలువైన 8,844 ఎకరాల లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములపై గురి
వాటిని కాజేసేందుకు తన బినామీలను రంగంలోకి దించిన ‘ముఖ్య’నేత
ముఖ్యనేతకు అత్యంత సన్నిహితుడైన బీఎస్సార్ ఇన్‌ఫ్రా అధినేత బలుసు శ్రీనివాసరావు తెరపైకి
ఆ భూములను నయాన భయాన గుప్పిట పట్టే కుట్రలు వేగవంతం..
ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న రూ.వేల కోట్ల విలువైన ఆస్తిని స్వాదీనం చేసుకునే కుట్ర
ఎన్‌సీఎల్‌టీ నుంచి వేలంలో దక్కించుకున్నవారు వాటిని బలుసుకు విక్రయించేలా ఉన్నత స్థాయిలో తీవ్ర ఒత్తిళ్లు.. నేడో రేపో ఒప్పందానికి యత్నాలు
రాజధాని, సాగునీటి ప్రాజెక్టుల్లో రూ.8,300.12 కోట్ల విలువైన పనులు బీఎస్సార్ ఇన్‌ఫ్రాకు అప్పగింత
మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో రూ.830 కోట్లు బీఎస్సార్‌కు చెల్లింపులు
ఆ నిధులతో లేపాక్షి భూములను హస్తగతం చేసుకునే దిశగా ముఖ్యనేత వడివడిగా అడుగులు
అధికారంలోకి రాగానే తనకు సన్నిహితుడైన సెల్‌కాన్ అధినేత గురుస్వామినాయుడు ద్వారా ప్రణాళికకు వ్యూహరచన అమలు
ముఖ్యనేత పరం చేసేందుకు కలెక్టర్, పరిశ్రమల శాఖ కార్యదర్శితో చర్చలు.. ఫీల్డ్ విజిట్ పేరుతో లేపాక్షి భూముల పరిశీలన.. ఆపై అగ్రిమెంట్ కూడా
20 వేల ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ పార్క్.. డిఫెన్స్ హబ్ అంటూ భూదోపిడీకి అడుగులు
గత ప్రభుత్వంలో లేపాక్షి భూములను కాజేస్తున్నారంటూ ఎల్లోమీడియాతో కలసి టీడీపీ దుష్ప్రచారం
ఇప్పుడు అవే భూములను బలుసు ద్వారా ముఖ్యనేత దక్కించుకుంటున్నారంటున్న పారిశ్రామికవర్గాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విలువైన భూములను సొంతం చేసుకుంటూ బంధుగణానికి, కుటుంబానికి లబ్ధి చేకూరుస్తున్న ‘ముఖ్య’నేత రూ.వేల కోట్ల విలువైన మరో భూదోపిడీకి స్కెచ్ వేశారు! బెంగళూరుకు అత్యంత సమీపంలో శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో 44వ జాతీయ రహదారికి పక్కనే ఉన్న లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు చెందిన 8,844 ఎకరాల భూములను కాజేసేందుకు తన బినామీలను రంగంలోకి దించారు. రూ.పది వేల కోట్ల విలువైన ఆ భూములను సొంతం చేసుకునేందుకు ముఖ్యనేత తనకు అత్యంత సన్నిహితుడైన బీఎస్సార్ ఇన్‌ఫ్రా అధినేత బలుసు శ్రీనివాసరావును తెరపైకి తెచ్చి నయాన భయాన గుప్పిట పట్టే కుట్రలు వేగవంతం చేశారు. ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న రూ.వేల కోట్ల విలువైన ఆస్తిని బరి తెగించి స్వా«దీనం చేసుకునే కుట్ర పన్నారు. ఎన్‌సీఎల్‌టీ నుంచి వేలంలో దక్కించుకున్నవారు వాటిని బలుసుకు విక్రయించేలా ఉన్నత స్థాయిలో తీవ్ర ఒత్తిళ్లు తెచ్చారు. ఇప్పటికే మూడు నాలుగు దఫాలు సమావేశాలు జరిగాయి.
ఆ భూములను బలుసుకు అప్పగించాలని ముఖ్యనేత స్వయంగా ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నేడో రేపో ఒప్పందానికి శతవిధాలా యత్నాలు జరుగుతున్నాయి. రాజధాని, సాగునీటి ప్రాజెక్టుల్లో రూ.8,300.12 కోట్ల విలువైన పనులను బీఎస్సార్ ఇన్‌ఫ్రాకు ఇప్పటికే అప్పగించడం గమనార్హం. దీనికి సంబంధించి మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో రూ.830 కోట్లు బీఎస్సార్‌కు చెల్లింపులు జరిగాయి. ఆ నిధులతోనే లేపాక్షి భూములను హస్తగతం చేసుకునే దిశగా ముఖ్యనేత వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యనేత అధికారంలోకి రాగానే తనకు సన్నిహితుడైన సెల్‌కాన్ అధినేత గురుస్వామినాయుడు ద్వారా తొలుత కథ నడిపించారు.
ఫీల్డ్ విజిట్ పేరుతో లేపాక్షి భూముల్లో కాలుమోపిన ఆయన వాటిని ముఖ్యనేత పరం చేసేందుకు కలెక్టర్, పరిశ్రమల శాఖ కార్యదర్శితో చర్చలు జరిపారు. తమకు ఇంకా భూములు కావాలని అధికారులకు చెప్పారు. లేపాక్షి భూములకు సంబంధించి గురుస్వామినాయుడు దాదాపు రూ.150 కోట్ల మేర చెల్లింపులు జరిపి అగ్రిమెంట్ కూడా చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వాటిని కొట్టేయటానికి 20 వేల ఎకరాల్లో మెగా ఇండ్రస్టియల్ పార్క్.. డిఫెన్స్ హబ్ ఏర్పాటు అంటూ ప్రచారానికి తెర తీశారు. గత ప్రభుత్వంలో లేపాక్షి భూములను కాజేస్తున్నారంటూ ఎల్లోమీడియాతో కలసి టీడీపీ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది. ఇప్పుడు అవే భూములను అధికారంలోకి రాగానే బలుసు ద్వారా ముఖ్యనేత దక్కించుకుంటున్నారని పారిశ్రామికవర్గాలు చర్చించుకుంటున్నాయి. ముఖ్యనేత స్వయంగా బరి తెగించి సాగిస్తున్న ఈ దోపిడీ బాగోతం ఇలా ఉంది..!
ఎల్లో మీడియా లెక్క ప్రకారమే రూ.10 వేల కోట్లు!
బెంగళూరుకు అత్యంత సమీపంలో శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో 44వ జాతీయ రహదారికి పక్కనే ఉన్న లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు చెందిన 8,844 ఎకరాల భూముల విలువ రూ.పది వేల కోట్లకు పైమాటేనని 2023లో టీడీపీ నేతలతోపాటు ఎల్లో మీడియా పేర్కొంది. ఇప్పుడు విలువైన ఆ భూములను తనకు అత్యంత సన్నిహితుడైన బలుసు శ్రీనివాసరావు పేరుతో కారుచౌకగా కొట్టేయడానికి ‘ముఖ్య’నేత స్కెచ్ వేశారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన 23 నెలల్లోనే రాజధానిలో రూ.7,440.08 కోట్ల విలువైన పనులతోపాటు సాగునీటి ప్రాజెక్టుల్లో (హంద్రీ–నీవా రెండో దశ కాలువ లైనింగ్‌లో రెండు ప్యాకేజీలు.. పోలవరం ఎడమ కాలువ ఆరు, ఎనిమిదో ప్యాకేజీలు) రూ.860.04 కోట్లు.. వెరసి రూ.8,300.12 కోట్ల విలువైన పనులను బలుసు శ్రీనివాసరావుకు చెందిన బీఎస్సార్ ఇన్‌ఫ్రాకు కట్టబెట్టింది.
కాంట్రాక్టు పనుల అగ్రిమెంటు విలువలో పది శాతం అంటే రూ.830 కోట్లను ఇప్పటికే బలుసుకు మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో ఇచ్చేసింది. అవే నిధులతో ఇప్పుడు లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారని.. ఇప్పటికే డబ్బులు చేతులు మారాయని విశ్వసనీయ సమాచారం. ఆ భూముల అప్పగింత ఒప్పందంపై నేడో రేపో ఒప్పందాలు జరగనున్నట్లు పారిశ్రామికవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. రూ.పది వేల కోట్ల విలువైన లేపాక్షి నాలెడ్జ్ భూములను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి రూ.500 కోట్లకే కాజేస్తున్నారంటూ ప్రస్తుత ఆరి్థక మంత్రి పయ్యావుల కేశవ్ 2023లోతీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఇదే అదునుగా ఎల్లో మీడియా వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం చేసింది. కానీ.. అవన్నీ పచ్చి అబద్ధాలేన్నది తేలిపోయింది. ఇప్పుడు అవే భూములను బలుసు శ్రీనివాసరావు ద్వారా ముఖ్యనేత కాజేస్తున్నారంటూ పారిశ్రామికవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 
లేపాక్షి నాలెడ్జ్ హబ్ కోసం నిర్మించిన భవనం
ఎన్‌సీఎల్‌టీలో రూ.401 కోట్లకు దక్కించుకున్న సుబ్బారెడ్డి, సీవీ రెడ్డి..
ఇందూ ప్రాజెక్ట్స్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ యాజమాన్యం ఒక్కరే. తీసుకున్న రుణాలను ఇందూ ప్రాజెక్ట్స్ చెల్లించలేకపోవడంతో 2018లో ఎన్‌సీఎల్‌టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)లో క్రిప్ (కార్పొరేట్ ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్) కింద బ్యాంకులు పిటిషన్లు దాఖలు చేశాయి. దాంతో ఈ వ్యవహారంపై ఎన్‌సీఎల్‌టీ ఒక రిజల్యూషన్ ప్రొఫెషనల్‌ను నియమించింది. ఇందూ ప్రాజెక్ట్స్‌పాటు దాని అనుబంధ సంస్థలను విక్రయించడానికి 2020లో ఎన్‌సీఎల్‌టీ బిడ్డింగ్ నిర్వహించింది. ఈ బిడ్డింగ్‌లో రూ.500 కోట్లకు ఎర్లిన్ ప్రాజెక్ట్స్ అనే సంస్థ ఇందూ ప్రాజెక్ట్స్, దాని అనుబంధ సంస్థలను దక్కించుకుంది. అయితే ఎన్‌సీఎల్‌టీలో సకాలంలో ఎర్లిన్ ప్రాజెక్ట్స్ డబ్బులు డిపాజిట్ చేయకపోవడంతో ఆ బిడ్డింగ్‌ను రిజల్యూషన్ ప్రొఫెషనల్ రద్దు చేశారు. దాంతో 2023లో మళ్లీ బిడ్డింగ్ నిర్వహించగా రూ.401 కోట్లకు ఇందూ ప్రాజెక్ట్స్‌తోపాటు దాని అనుబంధ సంస్థలను బి.సుబ్బారెడ్డి, సీవీ రెడ్డి దక్కించుకున్నారు. 2024 మార్చిలో ఎన్‌సీఎల్‌టీలో రూ.401 కోట్లను డిపాజిట్ చేసి ఇందూ ప్రాజెక్ట్స్, లేపాక్షి నాలెడ్జ్ హబ్‌తోపాటు అనుబంధ సంస్థలను వారిద్దరూ సొంతం చేసుకున్నారు.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ‘లేపాక్షి’పై కన్ను
రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములపై ‘ముఖ్య’నేత కన్నేశారు. సెల్‌ఫోన్లు, ఎల్రక్టానిక్ ఉపకరణాల తయారీ సంస్థ ‘సెల్‌కాన్’ అధినేత గురుస్వామినాయుడును ముందుపెట్టి కథ నడిపించారు. ఈ క్రమంలో సుబ్బారెడ్డి, సీవీ రెడ్డిలతో ఆయన ద్వారా చర్చలు సాగించారు. గురుస్వామినాయుడు లేపాక్షి భూముల వద్దకు వెళ్లి కలియతిరిగారు. అప్పటి శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్, పరిశ్రమల శాఖ కార్యదర్శితోనూ చర్చలు జరిపారు. అయితే తాజాగా తనకు అత్యంత సన్నిహితుడైన బలుసు శ్రీనివాసరావును ముందుపెట్టి ఆ భూములను సొంతం చేసుకునేలా ముఖ్యనేత మరింత పకడ్బందీగా ప్రణాళిక అమలు చేశారు. సుబ్బారెడ్డి, సీవీ రెడ్డిలతో ముఖ్యనేత నేరుగా సంప్రదించి.. కారు చౌకగా తమకు ఆ భూములు అప్పగించాలని ఒత్తిడి తెచ్చినట్లు పారిశ్రామికవర్గాలు చర్చించుకుంటున్నాయి. ఉన్నత స్థాయి నుంచి తీవ్రంగా వస్తున్న ఒత్తిళ్లకు తాళలేక లేపాక్షి భూములను బలుసు శ్రీనివాసరావుకు విక్రయించడానికి అంగీకరించినట్లు పారిశ్రామికవర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అడ్వాన్స్‌గా కొంత డబ్బు కూడా చెల్లించారని.. భూముల విక్రయం ఒప్పందంపై ఏ క్షణమైనా సంతకాలు చేయటానికి రంగం సిద్ధం అయినట్లు చెబుతున్నాయి.
నాడు వద్దు.. నేడు ముద్దు
దేశంలో అత్యంత వెనుకబడిన ఉమ్మడి అనంతపురం జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా.. భారీ ఎత్తున ఉపాధి అవకాలు కల్పించడమే లక్ష్యంగా పారిశ్రామికాభివృద్ధికి 2006లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో బెంగళూరుకు అత్యంత సమీపంలో కర్ణాటక–ఏపీ సరిహద్దులో గోరంట్ల–చిలమత్తూరు మండలాల్లో ఎన్‌హెచ్–44 పక్కనే ఏపీఐఐసీ ద్వారా 8,844 ఎకరాల భూమిని సేకరించారు. ఆ భూములను తమకు కేటాయిస్తే డిఫెన్స్, ఏరోస్పేస్, ఎల్రక్టానిక్, ఐటీ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటుచేస్తామని లేపాక్షి నాలెడ్జ్ హబ్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఆ సంస్థకు ఉన్న అర్హత ఆధారంగా 8,844 ఎకరాల భూమిని 2008లో ప్రభుత్వం కేటాయించింది. పరిశ్రమల కోసం అంత భారీ ఎత్తున భూములు కేటాయించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు రాద్ధాంతం చేశారు.
ఈ భూముల్లో పరిశ్రమల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ క్షిపణుల తయారీ పరిశ్రమ కోసం బీడీఎల్(భారత్ డైనమిక్స్ లిమిటెడ్), హెలికాఫ్టర్, విమానాల తయారీ పరిశ్రమ కోసం హెచ్‌ఏఎల్(హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్), ఈసీఐఎల్(ఎల్రక్టానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్), బీఈఎల్(భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్) సంస్థలు లేపాక్షి నాలెడ్జ్ హబ్‌తో ఒప్పందాలు చేసుకున్నాయి. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐఐఎస్‌సీ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్) సంస్థ లేపాక్షి నాలెడ్జ్ హబ్‌లో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. పలు ప్రైవేటు పారిశ్రామిక దిగ్గజాలు పరిశ్రమల స్థాపన కోసం లేపాక్షి నాలెడ్జ్ హబ్‌తో ఒప్పందాలు చేసుకున్నాయి. 2009 సెపె్టంబరు 2న వైఎస్సార్ హఠాన్మరణం చెందారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్‌ను రాజకీయంగా అణచివేసేందుకు సోనియాగాంధీ, చంద్రబాబు కుమ్మక్కై కుట్రలు చేస్తూ వచ్చారు. జగన్‌పై అక్రమ కేసులు బనాయించారు.
అందులో భాగంగా ఇందూ ప్రాజెక్ట్స్, లేపాక్షి నాలెడ్జ్ హబ్‌లపై కూడా కేసులు పెట్టారు. 2013లో నాటి కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు కేటాయించిన భూములను రద్దు చేసింది. దీనిపై లేపాక్షి నాలెడ్జ్ హబ్ హైకోర్టును ఆశ్రయించింది. కిరణ్ సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది. అక్రమ కేసుల విచారణలో భాగంగా లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను ఈడీ అటాచ్ చేసింది. చంద్రబాబు, కాంగ్రెస్ అధిష్టానం సైంధవుల్లా అడ్డుపడకపోయి ఉంటే శ్రీసిటీని తలదన్నే రీతిలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ సెజ్ అభివృద్ధి చెందేదని.. వెనుకబడిన అనంతపురం జిల్లా రూపురేఖలు మారేవని.. ప్రజల జీవనప్రమాణాలు పెరిగేవని పారిశ్రామికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. నాడు వద్దన్న భూములే ఇప్పుడు చంద్రబాబు సర్కార్‌కు ముద్దయ్యాయి. లేపాక్షి భూములతోపాటు 20 వేల ఎకరాల్లో మెగా ఇండ్రస్టియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తుండటం గమనార్హం. 2022–23లో పరిశ్రమల ఏర్పాటు కోసం చిలమత్తూరు మండలం టేకులోడులో ఎకరం ధర రూ.25 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయిస్తే.. ఇప్పుడు ఎకరానికి రూ.12.50 లక్షలను పరిహారంగా ముట్టజెప్పి చంద్రబాబు సర్కార్ లాక్కుంటోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


