అప్పులు తెచ్చి.. అడుగడుగునా దోపిడీ! | Chandrababu Debts For Capital City Amaravati | Sakshi
Sakshi News home page

అప్పులు తెచ్చి.. అడుగడుగునా దోపిడీ!

Mar 23 2026 5:30 AM | Updated on Mar 23 2026 8:12 AM

Chandrababu Debts For Capital City Amaravati

రాజధాని పేరుతో అధిక వడ్డీలకు అప్పులు చేసి బాబు దుబారా

హైకోర్టుకి రూ.556 కోట్లు.. అసెంబ్లీకి రూ.424.34 కోట్లతో ఎలక్ట్రికల్, హెచ్‌వీఏసీ, ఫైర్, ప్లంబింగ్, ఈఎల్‌వీ పనులు.. 

హైకోర్టు నిర్మాణ వ్యయం రూ.1,480.69 కోట్లు.. అసెంబ్లీ నిర్మాణ ఖర్చు రూ.1,149.36 కోట్లు

అసెంబ్లీ నిర్మాణ వ్యయం చ.అడుగుకు రూ.10,244.07.. హైకోర్టుకి చ.అడుగుకు రూ.7,286.03

అమరావతి పేరుతో అంతులేని దుబారాపై ఇంజనీరింగ్‌ వర్గాల విస్మయం

ఇప్పటికే తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు పేరుతో రూ.వందల కోట్ల వ్యయం 

ఇప్పుడు శాశ్వత భవనాల నిర్మాణంతో ఆ  ఖర్చంతా వృథానే..

అప్పట్లో వాటి నిర్మాణానికి చదరపు అడుగు రూ.3,350 చొప్పున అప్పగింత

చివరకు పనులు పూర్తయ్యేసరికి చ.అ. ఏకంగా రూ.19,183కి పెరిగిన నిర్మాణ వ్యయం 

ఇక ఇప్పుడు హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణాలు పూర్తయ్యేసరికి ఎంతకు చేరుతుందో?

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో చంద్రబాబు సర్కారు దుబారా వ్యయానికి హైకోర్టు, అసెంబ్లీ శాశ్వత భవనాల నిర్మాణ పనులు మరో నిదర్శంగా నిలుస్తున్నాయి. అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ (ఏజీసీ)  ‘ఎఫ్‌’ బ్లాక్‌లో నిర్మిస్తున్న హైకోర్టు భవనానికి హైసైడ్‌ ఎలక్ట్రికల్, హెచ్‌వీఏసీ (హీటింగ్‌ వెంటిలేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండీషనింగ్‌), అగ్నిమాపక వ్యవస్థ, ప్లంబింగ్, ఈఎల్‌వీ (సీసీటీవీ, ఫైర్‌ అలారమ్‌తో కూడిన భద్రత వ్యవస్థ) పనులను రూ.556 కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

ఇక ఏజీసీ ‘ఈ’ బ్లాక్‌లో నిర్మిస్తున్న అసెంబ్లీ భవనానికి ఎలక్ట్రికల్, హెచ్‌వీఏసీ, అగ్నిమాపక వ్యవస్థ, ప్లంబింగ్, ఈఎల్‌వీ పనులు రూ.424.34 కోట్లతో చేపట్టడానికి ఆమోదం తెలిపింది. ఇప్పటికే హైకోర్టు భవన నిర్మాణ పనులను రూ.924.64 కోట్లకు.. అసెంబ్లీ నిర్మాణ పనులు రూ.724.69 కోట్లకు కాంట్రాక్టు సంస్థలకు సీఆర్‌డీఏ అప్పగించింది.. తాజాగా ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను పరిగణనలోకి తీసుకుంటే.. హైకోర్టు నిర్మాణ వ్యయం రూ.1,480.69 కోట్లకు, అసెంబ్లీ నిర్మాణ వ్యయం రూ.1,149.36 కోట్లకు చేరుకుంది.

దీంతో  చదరపు అడుగు నిర్మాణ వ్యయం అసెంబ్లీ భవనానికి రూ.10,244.07, హైకోర్టు భవనానికి రూ.7,286.03కి పెరిగింది. గతంలో తాత్కాలిక సచివాలయ భవనాల నిర్మాణ పనులను చదరపు అడుగుకు సగటున రూ.3,350 చొప్పున కాంట్రాక్టర్లకు అప్పగించారు. కానీ వాటి నిర్మాణం పూర్తయ్యేసరికి చదరపు అడుగు వ్యయం రూ.19,183కు చేరింది. ఇప్పుడు శాశ్వత అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తయ్యే నాటికి ఈ వ్యయం ఇంకెంతకు చేరుతుందోనని అధికార వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.

తాజాగా రూ.556 కోట్లు..
హైకోర్టు భవనాన్ని ఏజీసీ ‘ఎఫ్‌’ బ్లాక్‌లో 42.36 ఎకరాల్లో బేస్‌మెంట్, గ్రౌండ్‌ ఫ్లోర్, ఏడు అంతస్తులు (బీ+జీ+7)లో 20,32,231 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఫోస్టర్స్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ ఈ భవన నిర్మాణ డిజైన్‌ను రూపొందించింది. ఈ భవన  పనులను రూ.752.06 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్‌ విధానంలో 24 నెలల్లో పూర్తిచేసి మరో మూడేళ్లు భవనాన్ని నిర్వహించాలన్న షరతులతో గతేడాది మార్చి 1న సీఆర్‌డీఏ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. 4.52 శాతం అధిక (ఎక్సెస్‌) ధరకు అంటే రూ.786.05 కోట్లకు ఎన్‌సీసీ లిమిటెడ్‌ సంస్థ కోట్‌ చేసి టెండర్‌ దక్కించుకుంది.

జీఎస్టీ, న్యాక్, సీనరేజీ లాంటి పన్నుల రూపంలో రూ.138.64 కోట్లు అదనంగా ఇస్తామని టెండర్‌లో పేర్కొన్నారు. అంటే.. హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనుల కాంట్రాక్టు విలువ రూ.924.69 కోట్లన్న మాట. తాజాగా.. ఈ భవనం పనులకు రూ.556 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో హైకోర్టు భవన నిర్మాణ వ్యయం రూ.1,480.69 కోట్లకు చేరుకుంది. 

అసెంబ్లీ నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.10,244.07
అసెంబ్లీ భవనాన్ని ఏజీసీ ‘ఈ’ బ్లాక్‌లో బేస్‌మెంట్, గ్రౌండ్‌ఫ్లోర్, 3 అంతస్తులు (బీ+జీ+3)లో 11,21,975 చ.అడుగుల్లో ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ భవన డిజైన్‌ను కూడా ఫోస్టర్స్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థే రూపొందించింది. ఈ పనులకు రూ.590.86 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్‌ విధానంలో 24 నెలల్లో పూర్తిచేసి, మరో మూడేళ్లు నిర్వహించాలనే షరతుతో గతేడాది మార్చి 1న సీఆర్‌డీఏ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది.

4.48 శాతం అధిక ధరకు అంటే.. రూ.617.33 కోట్లకు ఎల్‌అండ్‌టీ లిమిటెడ్‌ సంస్థ చేజి­క్కించుకుంది. జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.107.69 కోట్లు అదనంగా ఇస్తామంది. అంటే.. అసెంబ్లీ శాశ్వత భవనం నిర్మాణ కాంట్రాక్టు విలువ రూ.725.02 కోట్లు. తాజాగా.. ఈ పనులకు రూ.424.34 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. దాంతో ఈ భవనం నిర్మాణ వ్యయం రూ.1,149.36 కోట్లన్నమాట. అసెంబ్లీ భవన నిర్మాణ వ్యయం చ.అడుగుకు రూ.10,244.07కు చేరుకుంది.

అసలే అప్పులు.. ఆపై దుబారా..
ఇప్పటికే తాత్కాలిక అసెంబ్లీ,  తాత్కాలిక హైకోర్టు భవనాలను చంద్రబాబు ప్రభుత్వ రూ.వందల కోట్లు వెచ్చించి నిర్మించింది. ఇప్పుడు శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టడంతో తాత్కాలిక భవనాలకు వెచ్చించిన ఖర్చంతా వృథానే. అది కూడా అప్పు తెచ్చిందే కావడం గమనార్హం. ఇక అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవనాలను నిర్మిస్తున్నది కూడా అప్పుగా తెచ్చిన నిధులతోనే. అవసరమైన మేర కంటే భారీగా నిర్మిస్తుండటం వల్ల భవనాల నిర్మాణ వ్యయం పెరుగుతోంది. రాజధానిలో వెలగపూడి వద్ద 2015లో ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్‌ అండ్‌ టీ సంస్థలకు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింది.

కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యేసరికి అంచనా వ్యయం రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ఇప్పుడు అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవనాలు పూర్తయ్యేసరికి నిర్మాణ వ్యయం ఇంకెంతకు చేరుతుందో ఊహించుకోవచ్చని ఇంజనీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి మహానగరాల్లో ఫైవ్‌స్టార్‌ సదుపాయాలతో ఇటాలియన్‌ మార్బుల్స్‌తోనూ భవనాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4 వేలకు మించదని గుర్తు చేస్తున్నారు.

అలాంటిది రాజధాని నిర్మాణం పేరుతో అధిక వడ్డీలకు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పు తెచ్చి చేపట్టిన భవనాల నిర్మాణ వ్యయం ఎక్కడా లేనట్లు చదరపు అడుగు రూ.పది వేలతో నిర్మిస్తుండడం చూస్తుంటే నీకింత.. నాకింత అన్నట్లుగా దోచుకోవడానికేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement