ఎస్సీ, ఎస్టీ ఉపాధి కూలీలకు వేరుగా వేతనాలు

Central Has Made Key Change In Payment Of Wages To Employment Guarantee Workers - Sakshi

‘కూలి’ చెల్లింపులో కేంద్రం మార్పు

సాక్షి, అమరావతి: ఉపాధి హామీ కూలీలకు వేతనాల చెల్లింపులో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. వీరిని ఎస్సీ, ఎస్టీ, ఇతర తరగతుల వారీగా విభజించి, వారు చేసిన పనికి ఎప్పటికప్పుడు వేతనాలను వేర్వేరుగా విడుదల చేసేలా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా ఒకేరోజు.. ఓ గ్రూపులో ఉంటూ, ఒకే పనిచేసిన కూలీలందరికీ ఒకేసారి కాకుండా ఎస్సీ కూలీలకు ఒకసారి, ఎస్టీ సామాజికవర్గం వారికి మరోసారి, ఇతరులకు ఇంకో విడతలో కూలీ డబ్బులు విడుదలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయా రాష్ట్రాల్లో పనిచేసిన కూలీలను ఎస్సీ, ఎస్టీ, ఇతరుల వారీగా పే ఆర్డర్లను తయారుచేసి కేంద్రానికి పంపుతున్నాయి.

ఆ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి
కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఈ ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఆక్షేపించింది. ఈ ఉత్తర్వులు పేదల మధ్య చిచ్చుపెట్టి వారి ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు, అధ్యక్షులు దడాల సుబ్బారావులు ఓ ప్రకటనలో తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుని పాత పద్ధతిలోనే అందరికీ ఒకేసారి వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అలాగే, ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ సంఘం ప్రతినిధులు శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి వినతిపత్రం అందజేశారు.

చదవండి: వంద శాతం విద్యుదీకరణ భేష్‌: ఏపీకి నీతి ఆయోగ్‌ ప్రశంస  
‘గారాల పట్టి.. మేము ఎలా బతికేది తల్లీ’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top