రేషన్‌ షాపుల్లో సీసీ కెమెరాలు | CCTV cameras in ration shops | Sakshi
Sakshi News home page

రేషన్‌ షాపుల్లో సీసీ కెమెరాలు

May 21 2025 4:54 AM | Updated on May 21 2025 4:54 AM

CCTV cameras in ration shops

ఇంటికే సరుకుల పంపిణీ విధానానికి స్వస్తి

1నుంచి దుకాణాల ద్వారానే రేషన్‌ సరుకులు

65 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే డోర్‌ డెలివరీ

అదానీ పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ ప్రాజెక్టులకు సీమలో భూములు 

భోగాపురం విమానాశ్రయానికి మరో 500 ఎకరాలు

రాజమహేంద్రవరంలో శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం

ఏలూరులో అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 

కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు మనోహర్, పార్థసారథి

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటికే రేషన్‌ సరుకుల డోర్‌ డెలివరీ విధానాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. జూన్‌ 1వతేదీ నుంచి రేషన్‌ దుకాణాల ద్వారానే సరుకులు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. అనంతరం ఈ వివరాలను మంత్రులు నాదెండ్ల మనోహర్, కె.పార్థ్దసార«థి మీడియాకు వెల్లడించారు. 9,260 మొబైల్‌ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్‌ సరుకుల పంపిణీ నిలుపుదల చేస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

రేషన్‌ దుకాణాల్లో సీసీ కెమేరాలు అమర్చి పీడీఎస్‌ పంపిణీ పర్యవేక్షణకు ప్రత్యేక యాప్‌ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో రేషన్‌ బియ్యం పక్కదారి పట్టడం ఆగిపోతుందన్నారు. జూన్‌ 1 నుంచి రేషన్‌ దుకాణాల ద్వారానే సరుకులు పంపిణీ చేస్తామని చెప్పారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే రేషన్‌ సరుకులు డోర్‌ డెలివరీ చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి రేషన్‌ దుకాణాల ద్వారా కిరాణాæ సరుకులు విక్రయించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. 

మొబైల్‌ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్‌ సరఫరాకు గత ప్రభుత్వం రూ.1,860 కోట్లు వ్యయం చేసిందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా పది శాతం డబ్బులు చెల్లించిన వాహనాల లబ్ధిదారులకు ఆయా కార్పొ­రేషన్ల ద్వారా వాటిని ఉచితంగా బదిలీ చేసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. వాహనాలకు సంబంధించి ఇంకా రూ.188 కోట్లు బ్యాంకులకు చెల్లించాల్సి ఉందని, దీనిపై బ్యాంకర్లతో చర్చించి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ చేస్తామన్నారు. దీపం పథకం కింద మూడు సిలిండర్ల సబ్సిడీ డబ్బులను ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. 

మంత్రివర్గం తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు..
»  ఈ నెల 15న సీఎం అధ్యక్షతన ఎస్‌ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం. 
»  భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమా­నాశ్రయం అభివృద్ధికి మరో 500 ఎకరాల భూమి కేటాయించేందుకు ఆమోదం.  
»   వైఎస్సార్‌ కడప జిల్లా కె.బొమ్మపల్లిలో 1000 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు ఎకరం రూ.5 లక్షల చొప్పున 41.99 ఎకరాల ప్రభుత్వ భూమి అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌కు బదిలీ చేసేందుకు ఆమోదం. శ్రీసత్యసాయి జిల్లా పెద్దకొల్ల గ్రామంలో 500 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు ఎకరం రూ.5 లక్షలు చొప్పున 12.87 ఎకరాలు అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌కు బదిలీకి ఆమోదం. 
»  నెల్లూరు జిల్లా  ముత్తుకూరు మండలం పైనాపురంలో పారిశ్రామిక పార్కు స్థాపనకు 615.98 ఎకరాల భూమి ఏపీఐఐసీకి ఉచితంగా కేటాయించేందుకు ఆమోదం.
» పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఘర్షణల్లో మృతి చెందిన తోట చంద్రయ్య కుమారుడు తోట వీరాంజనేయులుకు శాశ్వత ఉద్యోగం కల్పించేందుకు చట్ట నిబంధనలు సవరించేందుకు ఆమోదం. 
»  చిత్తూరు జిల్లా పలమనేరు రెవెన్యూ డివిజన్‌ నుంచి పుంగనూరు, చౌడేపల్లి, సోమల,  సదుం మండలాలు... చిత్తూరు రెవెన్యూ డివిజన్‌ నుంచి రొంపిచర్ల మండలాన్ని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి రెవెన్యూ డివిజన్‌కు బదిలీ చేసేందుకు ఆమోదం.
»  గనుల శాఖలో వివిధ బాండ్లకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం. 
»  హైకోర్టులో 245 పోస్టుల కల్పనకు న్యాయ శాఖ ప్రతిపాదనకు ఆమోదం. 
»  అమరావతిలో ‘ఇండియా ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌’ సంస్థ ఏర్పాటుకు ఆమోదం. 
»  ఏలూరు సమీపంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదం.
» సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా 1,136 ఎస్‌జీటీ, 1,124 పాఠశాల సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్న అదనపు పోస్టులుగా మార్చుతూ జారీ చేసిన జీవోకు ఆమోదం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement