గాల్లో చక్కర్లకు ఇక చెక్‌!

Category 1 Approach Lighting System At Gannavaram International Airport - Sakshi

ఎయిర్‌పోర్టులో కేట్‌–1 అప్రోచ్‌ లైటింగ్‌ సిస్టం

శీతల, వర్షాకాలాల్లోనూ రన్‌వే క్లియరెన్స్‌ 

మేఘాలు, మంచు ఉన్నా స్పష్టత 

తక్కువ విజిబిలిటీలోనూ విమానాల ల్యాండింగ్‌కు వీలు 

పైలెట్లకు ఎంతో వెసులుబాటు  

మూడు నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం 

సాక్షి, అమరావతి బ్యూరో: మేఘాలు ఆవరించినా, పొగమంచు కమ్ముకున్నా విమానాల ల్యాండింగ్‌కు సమస్య తలెత్తుతుంది. రన్‌వే పైకి దిగాలంటే  రిస్క్‌తో కూడుకున్న పని. అందుకే అలాంటి వాతావరణ పరిస్థితులేర్పడినప్పుడు పైలెట్‌లు విమానాలను రన్‌వే పైకి దించకుండా కాసేపు గాల్లోనే చక్కర్లు కొడుతుంటారు. ఆ సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికుల్లో అలజడి, ఆందోళన నెలకొంటుంది. కొంతసేపటికి మేఘాలు/పొగమంచు క్లియర్‌ అయ్యాక రన్‌వేపై ల్యాండ్‌ అవడానికి విమానాశ్రయ అధికారులు అనుమతులిస్తారు. లేదంటే ఆ విమానాన్ని వెనక్కి పంపిస్తారు. 

శీతాకాలం, వానాకాలాల్లో ఇలాంటి పరిస్థితులు సహజంగా ఏర్పడుతుంటాయి. మన విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రంలోనూ తరచూ పొగమంచు కమ్ముకోవడం, మబ్బులు ఆవరించడం సర్వసాధారణంగా మారింది. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టులో సింపుల్‌ అప్రోచ్‌ సిస్టం మాత్రమే ఉంది. దీనివల్ల రన్‌వేపై ల్యాండ్‌ అయ్యే విమానాల పైలట్‌లకు రన్‌వేపై పరిస్థితి కనిపించక (విజిబిలిటీ లేక) సతమతమవుతున్నారు.  

రూ. 2 కోట్లతో.. 
ఈ నేపథ్యంలో ఈ విమానాశ్రయంలో కొత్తగా కేటగిరి–1 (కేట్‌–1) అప్రోచ్‌ లైటింగ్‌ సిస్టంను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు దాదాపు రూ.2 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇటీవలే ఇందుకు అవసరమైన పనులను ప్రారంభించారు. ఈ విద్యుత్‌ లైట్లను రన్‌వేకి ఇరువైపులా రన్‌వే దాటాక దాదాపు 900 మీటర్ల వరకు (బుద్ధవరం–దావాజీగూడెం వైపు) ఏర్పాటు చేస్తారు. కేట్‌–1 అప్రోచ్‌ లైటింగ్‌ సిస్టం మరో మూడు నెలల్లో అందుబాటులోకి రానుంది. ఇది అందుబాటులోకి వస్తే 300–400 మీటర్ల వరకు విజిబిలిటీని పెంచుతుంది. లైటింగ్‌ బ్రైట్‌గా కనిపిస్తుంది. దీంతో పైలెట్‌ దూరం నుంచే రన్‌వేను అంచనా వేయడానికి వీలవుతుంది. వెయ్యి మీటర్ల లోపు విజిబిలిటీ పడిపోతే పైలట్లు ల్యాండింగ్‌కు సాహసం చేయరు. ఇకపై ఇలా వెయ్యి మీటర్లలోపు విజిబిలిటీ తగ్గినా అప్రోచ్‌ లైటింగ్‌ సిస్టం వల్ల రన్‌వే స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పూర్‌ విజిబిలిటీలోనూ విమానాలు ల్యాండ్‌ అవుతాయన్న మాట! 

రాష్ట్రంలోనే మొదటిది.. 
భారత నావికాదళం ఆధీనంలో ఉన్న విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో మినహా రాష్ట్రంలో మరే ఎయిర్‌పోర్టుల్లోనూ ఇప్పటివరకు కేట్‌–1 అప్రోచ్‌ లైటింగ్‌ సిస్టం ఏర్పాటు కాలేదు. దీంతో రాష్ట్రంలో ఈ సిస్టం అందుబాటులోకి రానున్న తొలి ఎయిర్‌పోర్టు ఇదే కావడం విశేషం!!  

విజిబిలిటీ సమస్య ఉండదు 
వర్షాకాలంలో మేఘాలు ఆవరించినప్పుడు, శీతాకాలంలో పొగమంచు ఏర్పడినప్పుడు విజిబిలిటీ సరిగా లేక ఈ విమానాశ్రయంలో విమానాలు ల్యాండ్‌ అవడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టులో సింపుల్‌ అప్రోచ్‌ లైటింగ్‌ సిస్టం ఉంది. విజిబిలిటీ సమస్యను అధిగమించడానికి కొత్తగా కేట్‌–1 అప్రోచ్‌ లైటింగ్‌ సిస్టంను ఏర్పాటు చేస్తున్నాం. ఇది అందుబాటులోకి వస్తే విజిబిలిటీ సమస్యకు చాలా వరకు పరిష్కారం లభించినట్టవుతుంది. మరో మూడు నెలల్లో ఈ సిస్టం అందుబాటులోకి వస్తుంది.  – గిరి మధుసూదనరావు, డైరెక్టర్, విజయవాడ విమానాశ్రయం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top