కేసినో వేట.. జీవితాలతో ఆట..! | Casino events target middle class and wealthy classes | Sakshi
Sakshi News home page

కేసినో వేట.. జీవితాలతో ఆట..!

Mar 9 2025 6:04 AM | Updated on Mar 9 2025 6:04 AM

Casino events target middle class and wealthy classes

గోవా, శ్రీలంక, నేపాల్‌ కేంద్రంగా దందా

ఈవెంట్లకు వాట్సప్‌ ద్వారా ఆహ్వానాలు 

నిర్వాహకులు తెలుగు రాష్ట్రాలకు చెందినవారే 

ఈవెంట్లు ఉంటే విమానాలన్నీ ఫుల్‌  

ఒక్కో ట్రిప్‌కి రూ.లక్షన్నర నుంచి రూ. 2 లక్షలు హుష్‌ 

ఒట్టి చేతులతో వస్తున్న వందల మంది బాధితులు 

గోవా అనగానే బీచ్‌లతోపాటు కేసినోలు గుర్తుకొస్తాయి. ఆ కేసినోలపై తెలుగు రాష్ట్రాల్లోని కొందరికి ఉన్న ఆకర్షణను అవకాశంగా చేసుకుని కొన్ని ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఈవెంట్ల పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఏజెంట్లను నియమించుకుని మరీ అమాయకులకు ఎర వేస్తున్నారు. 

గోవాతోపాటు  శ్రీలంక, నేపాల్‌లలో కూడా దందా సాగుతోంది. రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు చెల్లించి వెళ్లేవారు.. ఆటలు ముగిశాక ఒట్టి చేతులతోనో, అప్పుల భారంతోనో, ఆస్తులు రాసేసో.. వెనక్కి రాక తప్పడం లేదు.ఇలా వెళ్లిన వందల మంది సర్వం పోగొట్టుకుని వస్తున్నారు. 

సాక్షి ప్రతినిధి, గుంటూరు : మధ్య తరగతి, సంపన్నవర్గాలకు కేసినో ఈవెంట్లు నిర్వహించే ముఠాలు గాలం వేస్తున్నాయి. గోవాలోని కేసినోలతో చీకోటి ప్రవీణ్‌ తెరపైకి రాగా.. ఆయనను ఆదర్శంగా తీసుకుని మరికొందరు ఈ దందాలో అడుగుపెట్టారు. గోవాలో 13 ముక్కలాటపై నిషేధం ఉన్నా, అద్దెకు తీసుకున్న కేసినోలలో వీటిని నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఎనిమిది మంది సిండికేట్‌గా ఏర్పడ్డారు. 

శ్రీనివాసరెడ్డి, ధన, రఫీ, వీరన్నగౌడ్, ప్రశాంత్‌రెడ్డి, నాగరాజు, పరమేష్, తిరుపతిరెడ్డిలు తమ వాట్సప్‌ గ్రూపుల ద్వారా దందా నడుపుతున్నారు. ఏరియాలవారీగా సభ్యులను ఏర్పాటు చేసుకుని ఎరినైనా గోవా పంపితే కమీషన్‌ ఇస్తున్నారు. ప్రతి నెలలో ఇరవైకిపైగా ఇలాంటి ఈవెంట్స్‌ నిర్వహిస్తున్నారు. గోవాలోని బిగ్‌ బీ, క్యాడీలాక్‌ డైమండ్‌ తదితర కేసినోలను అద్దెకు తీసుకుంటున్నారు. నాలుగు రోజుల ఈవెంట్‌కు రూ.కోటి వరకు అద్దె చెల్లిస్తున్నారంటే వారి రాబడి స్థాయి ఎంతో తెలుసుకోవచ్చు. 

డిపాజిట్‌ మొత్తాన్ని బట్టి ఆఫర్లు 
వెళ్లేవారు రూ.రెండు లక్షల వరకు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు వారికి కాయిన్లు అందిస్తారు. ఈ కాయిన్లతో కేసినోలో ఆడాల్సి ఉంటుంది. వీరికి రానుపోనూ ఉచితంగా విమాన టిక్కెట్లు, గోవాలో బస సదుపాయం, కట్టిన మొత్తాన్ని బట్టి ఫ్రీ మద్యం, వినోద కార్యక్రమాలు వంటి ఆఫర్లు ఉంటాయి. 

గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖ, హైదరాబాద్‌ల నుంచి విమానాల్లో గోవా తీసుకెళ్తున్నారు. ఈవెంట్లు ఉన్న రోజుల్లో గోవా వెళ్లే విమానాలన్నీ రద్దీగా ఉంటున్నాయి. ఒక్కో ఈవెంట్‌కు ఒక్కో ఆర్గనైజర్, అతడికి ఫోన్‌ నెంబర్‌ కేటాయిస్తున్నారు. అందర్‌–బాహర్, బక్కారత్, రౌలెట్టే, బ్లాక్‌జాక్, జండూ, తీన్‌పత్తీ, ర­మ్మీ/సిండికేట్‌తో పాటు 13 ముక్కల ఆట ఆడిస్తున్నారు.  

అప్పులిచ్చి.. ఆస్తులు కొట్టేసి.. 
గెలిచినా ఏదో విధంగా డబ్బులు గుంజి పంపుతున్నారు. డబ్బులు పోతే అక్కడే వీరికి అప్పులు ఇచ్చి మరీ లాగేస్తున్నారు. తర్వాత పొలాలు, స్థలాలు వంటి స్థిరాస్తులు కూడా రాయించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇలా ఈవెంట్లకు వెళ్తున్న వారి సంఖ్య వందల్లో ఉంటోంది. గోవా కేసినోలో ఆడితే జీఎస్‌టీతో కలిపి అక్కడి నిర్వాహకులకు చెల్లించాలి. 

తెలుగు రాష్ట్రాల నుంచి ఈవెంట్లు చేస్తున్న వారు అక్కడ తమ సొంత స్వైపింగ్‌ మిషన్లు పెడుతున్నారు. జీఎస్‌టీ కూడా చెల్లించకుండానే ఈవెంట్లు చేస్తున్నా ప్రభుత్వాలు, నిఘా వర్గాలు పట్టించుకోవడం లేదు. దీంతో దందా యథేచ్ఛగా సాగిపోతోంది. ఈ ముఠాల చేతిలో చిక్కిన వారి కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement