సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌పై కేసు నమోదు

Case registered against CBI ASP Ramsingh - Sakshi

ఆయన వేధిస్తున్నారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బాధితుడు

న్యాయస్థానం ఆదేశాలతో కేసు నమోదు చేసిన పోలీసులు

సాక్షి, అమరావతి: మేజిస్ట్రేట్‌ ఉత్తర్వుల మేరకు సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్‌పై కడప పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. రామ్‌సింగ్‌ తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నారని వైఎస్సార్‌ జిల్లా వేముల మండలంలోని యురేనియం కార్పొరేషన్‌ ఉద్యోగి గజ్జల ఉదయ్‌భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై మేజిస్ట్రేట్‌ ఉత్తర్వుల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ నెల 18న ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసిన విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. విచారణ పేరుతో రామ్‌సింగ్‌ తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని గజ్జల ఉదయ్‌భాస్కర్‌రెడ్డి ఈ నెల 15న కడప జిల్లా ఏఆర్‌ ఎస్పీ మహేష్‌కుమార్‌కు  ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఇదే విషయమై కడప జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టుకు పిటిషన్‌ ద్వారా విన్నవించారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

విచారణ పేరుతో తనను రామ్‌సింగ్‌ 22సార్లు పిలిచి బెదిరించారని ఉదయ్‌భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తాము చెప్పినట్లుగా స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని ఏడాదిగా బెదిరింపులకు గురి చేస్తూ వేధించారని చెప్పారు. లేకపోతే అక్రమ కేసులు పెడతానని కూడా రామ్‌సింగ్‌ హెచ్చరించినట్టు తెలిపారు. తమ ఇంటికి పోలీసులతో వచ్చి మరీ దౌర్జన్యం చేశారని, అడ్డుకోబోయిన తన తల్లిని నెట్టివేశారని ఉదయ్‌భాస్కర్‌ వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్‌ వేధింపుల నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని ఆయన  ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉదయ్‌భాస్కర్‌రెడ్డి తరఫున న్యాయవాది రాంప్రసాద్‌రెడ్డి న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన మేజిస్ట్రేట్‌ ఎం.ప్రదీప్‌కుమార్‌ సీఐబీ అధికారులపై చట్టపరమైన చర్యల కోసం కడప రిమ్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో వెంటనే కేసు నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 25లోగా దర్యాప్తు పూర్తి చేయాలని కూడా ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రామ్‌సింగ్‌పై కడప రిమ్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఐపీసీ 195ఏ, 323, 506ఆర్‌/డబ్ల్య్లూ 34 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

రామ్‌సింగ్‌పై గతంలోనూ ఇదే తరహా ఫిర్యాదులు
సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్‌పై గతంలోనూ ఇదే తరహాలో పలువురు ఫిర్యాదులు చేయడం గమనార్హం. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తాము చెప్పినట్లు స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని అనంతపురం జిల్లాకు చెందిన గంగాంధరరెడ్డిని ఆయన వేధించినట్టు అనంతపురం పోలీసులకు ఫిర్యాదు అందింది. కాగా, వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో డీఎస్పీ, సీఐలను కూడా రామ్‌సింగ్‌ తీవ్రంగా వేధించారనే విషయం వెలుగుచూసింది. తమతో అవమానకరంగా మాట్లాడారని, తీవ్రంగా బెదిరించారని డీఎస్పీ వాసుదేవన్, సీఐ శంకరయ్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులను ఎస్పీ రాష్ట్ర డీజీపీకి నివేదించారు. ఈ కేసులో రామ్‌సింగ్‌ ఉద్దేశపూర్వకంగా పలువురిని వేధిస్తున్నట్టు.. తాను చెప్పినట్లే చేయాలని బెదిరిస్తున్నట్లుగా ఫిర్యాదులు రావడం చర్చనీయాంశమైంది. రామ్‌సింగ్‌ వివాదాస్పద, ఏకపక్ష వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశమైంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top