విశాఖలో కలకలం | Car loses control at Jagadamba Junction several vehicles damaged | Sakshi
Sakshi News home page

విశాఖలో కలకలం

Mar 27 2026 4:11 AM | Updated on Mar 27 2026 5:26 AM

Car loses control at Jagadamba Junction several vehicles damaged

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బస్సు దిగిన ప్రయాణికులు (ఇన్‌సెట్‌లో) బస్సు బస్సు నడిపింది ఈ వ్యక్తే

ఆర్టీసీ డ్రైవర్‌ లేకపోవడాన్ని చూసి స్టీరింగ్‌ పట్టిన మానసిక వ్యాధిగ్రస్తుడు 

జగదాంబ జంక్షన్‌లో అదుపు తప్పి కారు, పలు వాహనాలు ధ్వంసం 

తప్పిన పెను ప్రమాదం

డాబాగార్డెన్స్‌ (విశాఖ):  సమయం గురువా­రం సా.4.10 గంటలు... శుక్రవారం శ్రీరామ­నవమి పండగ కావడంతో షాపింగ్‌ చేసే వారితో విశాఖ నగరంలోని జగదాంబ జంక్షన్‌ రద్దీగా ఉంది. ఆ సమయంలో ఓ ఆర్టీసీ బస్సు క్లాక్‌ టవర్‌ మీదుగా అదుపుతప్పి రయ్‌మంటూ దూసుకొచ్చింది. జగదాంబ పాత సిగ్నల్‌ వద్ద ముందు వెళ్తున్న కారును బలంగా ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా.. సూపర్‌బజార్‌ వైపు దూసుకెళ్లి మార్గమధ్యంలో పలు వాహనాలను ఢీకొట్టింది. జనం కేకలు వేస్తూ పరుగులు తీశారు. 

తీరా బస్సు ఆగాక చూస్తే.. దాన్ని నడుపుతోంది ఆర్టీసీ డ్రైవర్‌ కాదని, ఓ మానసిక వ్యాధి­గ్రస్తుడని తేలడంతో అంతా అవాక్కయ్యారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి చోడవరం వెళ్లాల్సిన బస్సు, ఇలా జగదాంబ జంక్షన్‌ వైపు రావడం, వాహనాలను ఢీకొట్టడంతో సుమారు గంటపాటు అక్కడ తీవ్ర కలకలం రేగింది. ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమా­దం తప్పినట్లయింది. పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, బస్సు డ్రైవర్, కండక్టర్లను విచారిస్తున్నారు.

అసలేం జరిగిందంటే 
ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి చోడవరం వెళ్లాల్సిన 300సీ బస్సు (ఏపీ39 యూడబ్ల్యూ 4866)ను టికెట్లు కొట్టేందుకు వీలుగా ఎల్‌ఐసీ వద్ద రోడ్డు పక్కన  డ్రైవర్‌ ఆపాడు. మహిళా కండక్టర్‌ ప్రయాణికులకు టికెట్లు ఇస్తుండగా, డ్రైవర్‌ బస్సు దిగి టైర్లలో గాలి చూసుకుంటున్నాడు. 

ఇంతలో డ్రైవర్‌ సీటు ఖాళీగా ఉండటాన్ని గమనించిన ఓ వ్యక్తి.. అందులో కూర్చుని క్షణాల్లో బస్సును స్టార్ట్‌చేసి జగదాంబ జంక్షన్‌ వైపు తీసుకెళ్లాడు. రాంగ్‌ రూట్‌లో బస్సు వెళ్తుండడంతో ప్రయాణికులు కేకలు వేశారు. జగదాంబ జంక్షన్‌ పాత సిగ్నల్‌ పాయింట్‌ వద్ద ఓ కారును ఢీకొట్టాడు. అక్కడి నుంచి లేపాక్షి, సూపర్‌బజార్‌ మీదుగా పూర్ణామార్కెట్‌ సత్యపోలమాంబ ఆలయం వద్దకు వెళ్లి ఆగింది. 

పొంతన లేని సమాధానాలు 
పోలీసుల విచారణలో ఆ వ్యక్తి పొంత­నలేని సమాధానాలు చెప్పాడు. తన పేరు గువ్వ కిషోర్‌ అని, స్వస్థలం విజయవాడ అని తెలిపాడు. కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నానటూమాట్లాడాడు. అయితే, అతడు నిజంగానే మానసిక వ్యాధిగ్రస్తుడా, లేక మద్యం మత్తులో ఇలా చేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement