వైద్యుడి కుటుంబంలో ఊహించని విషాదం

Boy Drowned In The Pond In Chittoor District - Sakshi

రామిరెడ్డిగారిపల్లె చెరువులో మునిగి బాలుడు మృతి

వైద్యుడు అనిల్‌కుమార్‌ కుటుంబంలో తీవ్రవిషాదం

ఎమ్మెల్యే నవాజ్‌బాషా పరామర్శ

మదనపల్లె: వృత్తిబాధ్యతల్లో తలమునకలైన వైద్యులు కొందరు ఆదివారం సంతోషంగా గడపాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పట్ట ణానికి సమీపంలోని రామిరెడ్డిగారిపల్లె చెరువుకు విహారయాత్రగా వెళ్లారు. సరదాగా ఈత కొట్టేందుకు నిండుకుండలా ఉన్న చెరువులో కేరింతలు కొడుతూ పిల్లలతో ఆడుతూ ఉత్సాహంగా ఉన్నారు. ఇంతలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని ప్రముఖ వైద్యులు ఇందుకూరి అనిల్‌రెడ్డి, కవిత దంపతుల ఏకైక కుమారుడు ఇందుకూరి పునీత్‌రెడ్డి(12) చెరువులో ఈత కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు మునిగిపోయి ఊపిరాడక మృతి చెందాడు. అప్పటి దాకా అరుపులు, కేకలతో సరదాగా గడుపుతున్న కొడుకు క్షణాల వ్యవధిలో మృత్యువాత పడడంతో రోదనలు మిన్నంటాయి.

వాహనాలు తెచ్చేందుకు వెళ్లి..
సొసైటీ కాలనీలో దంతవైద్యులు అనిల్‌కుమార్‌రెడ్డి, ఫిజియోథెరపిస్ట్‌ కవిత అంజన క్లినిక్‌ నిర్వహిస్తున్నారు. వీరి ఏకైక కుమారుడు ఇందుకూరి పునీత్‌రెడ్డి(12) వశిష్ట స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. నెలలో ఒక ఆదివారం పట్టణంలోని కొందరు వైద్యులు కుటుంబసభ్యులతో కలిసి సమీప ప్రాంతాలకు పిక్నిక్‌కు వెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఇందులో భాగంగా మండలంలోని రామిరెడ్డిగారిపల్లె పిచ్చలవాండ్లపల్లె చెరువులో పెద్దలు, పిల్లలు అందరూ కలిసి ఈత కొడుతూ చాలాసేపు సంతోషంగా గడిపారు. ఇళ్లకు బయలుదేరే ముందు కాసేపు గడిపి వస్తామని పిల్లలు చెప్పడంతో వాళ్లను చెరువులో వదిలి వాహనాలు తెచ్చేందుకు పెద్దవాళ్లు బయటకు వచ్చారు.

బాలుడు పునీత్‌రెడ్డి ఈత కొడుతూ చెరువులో కొంత ముందుకు వెళ్లి గుండుపై కూర్చునేందుకు ప్రయత్నించాడు. అది పాచిపట్టి ఉండడంతో కాలుజారి లోతులోకి పడిపోయాడు. గమనించిన గ్రామస్తులు, వైద్యులు హుటాహుటిన చెరువులోకి దిగి బాలుడిని పైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేశారు. భయంతో నీళ్లు మింగడం, ఊపిరాడకపోవడంతో చెరువులోనే బాలుడు చనిపోయాడు. ఒక్కగానొక్క కుమారుడు కళ్ల ఎదుటే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల శోకానికి అంతులేకుండా పోయింది. బాలుడి తాత ఈశ్వర్‌రెడ్డి జనతాక్లినిక్‌ పేరుతో తక్కువ ఫీజుతో సేవలందించిన డాక్టర్‌గా గుర్తింపు పొందారు. మృతి చెందిన బాలుడిని అంత్యక్రియల నిమిత్తం డాక్టర్‌ అనిల్‌కుమార్‌రెడ్డి స్వస్థలం తంబళ్లపల్లె నియోజకవర్గం చౌడసముద్రంకు తరలించారు.

డాక్టర్‌ అనిల్‌కు పలువురి పరామర్శ..
పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్‌ అనిల్‌కుమార్‌రెడ్డి కుమారుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడన్న విషయం దావానంలా వ్యాపించింది. విషయం తెలిసి పలువురు పీఅండ్‌టీ కాలనీలోని డాక్టర్‌ అనిల్‌కుమార్‌రెడ్డి స్వగృహానికి చేరుకున్నారు. విషాదంలో మునిగిపోయిన బాలుడి తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేశారు. పరామర్శించిన వారిలో ఎమ్మెల్యే నవాజ్‌బాషా, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు తట్టి శ్రీనివాసులురెడ్డి, జబ్బల శ్రీనివాసులు, గోల్డెన్‌వ్యాలీ రమణారెడ్డి, బోర్‌వెల్‌ వెంకటేష్, కౌన్సిలర్లు జింకా వెంకటాచలపతి, డిష్‌ రామకృష్ణారెడ్డి, బాలగంగాధరరెడ్డి, ఎల్‌ఐసీ సుధాకర్, దేవతాసతీష్, రెడ్డి జనసంక్షేమ సంఘం సభ్యులు రోజానాగభూషణరెడ్డి, సాంబశివారెడ్డి, అంకిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

చదవండి: నిత్య పెళ్లికూతురు కేసులో మరో మలుపు   
మైనర్ ను గర్భవతిని చేసిన మరో టిక్‌టాక్ స్టార్

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top