
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ ప్రకటనపై త్వరలో స్పష్టత వస్తుందని, ఇందుకు సంబంధించి జూలై–ఆగస్ట్‌లో కార్యాచరణ చేపడతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో గురువారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దశల వారీగా టీచర్ పోస్టులు భర్తీ చేశామన్నారు.
సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉండాల్సిన టీచర్ పోస్టులు ఎన్ని? వాటిలో ఎన్ని పోస్టులు భర్తీ అయ్యాయి? ఇంకా ఎన్ని పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది? అనే అంశాలపై నివేదిక సిద్ధం చేస్తున్నామన్నారు. నివేదికను సీఎంకు వివరించి ఆయన తదుపరి ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు.