దేశాభివృద్ధిలో రాజీలేని తత్వం వాజ్‌పేయిది

గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
సాక్షి, అమరావతి: దేశాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా దేశ రక్షణ అవసరాల పరంగానూ మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారి వాజ్‌పేయి రాజీ పడలేదని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. దేశాభివృద్ధి విషయంలో ఆయన ఎంతో ముందుచూపుతో వ్యవహరించారన్నారు. వాజ్‌పేయి జయంతి సందర్భంగా రాజ్‌భవన్‌లో ఆదివారం సుపరిపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో వాజ్‌పేయి చిత్రపటానికి గవర్నర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ విశ్వభూషణ్ మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి వాజ్‌పేయి చేసిన కృషి మరువలేనిదని ‘స్వర్ణ చతుర్భుజి’ కార్యక్రమాన్ని ప్రారంభించి దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మార్గం చూపారన్నారు. నాలుగు మెట్రోపాలిటన్ నగరాలను కలుపుతూ ఏర్పాటు చేసిన హైస్పీడ్ జాతీయ రహదారుల ప్రాజెక్ట్ ఫలాలను ఇప్పుడు ప్రజలు ఆస్వాదిస్తున్నారన్నారు.
60 ఏళ్లు పైబడిన పేద వృద్ధులకు 10 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేసి సంక్షేమ రంగంలో కొత్త ఒరవడి సృష్టించారని గుర్తు చేశారు. గ్రామాలను కలుç³#తూ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, ప్రాథమిక, మాధ్యమిక విద్య నాణ్యతను పెంపొందించేందుకు సర్వశిక్షా అభియాన్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వాజ్‌పేయి హయాంలో ప్రారంభమయ్యాయన్నారు.
అణుపరీక్షల వేళ ప్రపంచంలోని పెద్ద శక్తులు వాజ్‌పేయిపై విరుచుకుపడగా ఐదు పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసిన తరువాత అణుశక్తి దేశంగా భారత్‌ను ప్రకటించారని గుర్తు చేసారు. వాజ్‌పేయి ధైర్యవంతమైన చర్యల ఫలితంగా ప్రవాస భారతీయులు గర్వంగా, గౌరవంగా జీవించగలుగుతున్నారని గవర్నర్ హరిచందన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్‌భవన్ సంయుక్త కార్యదర్శి సూర్యప్రకాశ్, ఉపకార్యదర్శి నారాయణస్వామి, పలువురు మాజీ సైనికాధికారులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు :